బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ 2’ విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నెల 12న సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రీమియర్స్, టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాణ సంస్థ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 5న రిలీజ్ కావాల్సిన అఖండ-2 వాయిదా పడిన విషయం తెలిసిందే. ‘అఖండ 2 తాండవం’ విడుదల వాయిదా పడ్డాక కొత్త డేట్ కోసం అభిమానుల నుంచి ఒత్తిడి ఎక్కువయింది. నందమూరి ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర డిసెంబర్ 5 చేసిన అలంకరణ, బ్యానర్లు, లైటింగ్ అంతా అలాగే ఉంచేశారు. వేరే సినిమాలు ఆడుతున్నా సరే డెకరేషన్ తీసేయొద్దని ఓనర్లను రిక్వెస్ట్ చేసుకున్నారు. తక్కువ గ్యాప్ లో వస్తుందనే నమ్మకంతో అలా అన్నారు. నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు, డిస్ట్రిబ్యూటర్ల ప్రతినిధుల మధ్య దీని గురించే చర్చ జరిగింది. విడుదల చివరి క్షణంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి తనను బాధించిందంటూ నిర్మాత విశ్వ ప్రసాద్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తాను నిర్మిస్తున్న ‘ది రాజాసాబ్’ రిలీజ్‌పై వచ్చిన రూమర్స్‌పైనా ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. ”విడుదలకు సిద్ధమైన సినిమాలు కొన్ని గంటల ముందు వాయిదా పడుతుండటం దురదృష్టకరం. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలి. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు.. ఇలా ఎంతోమందిపై అది ప్రభావం చూపుతుంది. థర్డ్ పార్టీలు చివరి క్షణంలో సినిమా విడుదలకు అంతరాయం కలిగించకుండా చట్టపరమైన మార్గదర్శకాలు రూపొందించడం చాలా ముఖ్యం. ‘ది రాజాసాబ్’ రిలీజ్‌పై రూమర్స్ వచ్చాయి. ఈ సినిమా కోసం సేకరించిన పెట్టుబడులను మేం క్లియర్ చేశాం. వడ్డీని కూడా త్వరలోనే చెల్లిస్తాం. ‘అఖండ 2’తోపాటు డిసెంబరులో విడుదల కానున్న చిత్రాలు, 2026 సంక్రాంతికి రానున్న ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘జన నాయగన్’, ‘పరాశక్తి’ తదితర సినిమాల కోసం ఎదురుచూస్తున్నా. అన్నీ విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఏదేమైనా ‘అఖండ-2’కు లైన్ క్లియర్ కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
‘అఖండ-2’కు లైన్ క్లియర్
