* దుశ్శల పాత్రలో జీవించిన అలేఖ్య పుంజాల
అభినయ తపస్వి డాక్టర్ అలేఖ్య పుంజాల మరోసారి తన నట విశ్వ సౌరభాన్ని చాటుకున్నారు. గాంధారి కుమార్తెగా, వంద మంది కౌరవులకు చెల్లెలు అయిన దుశ్శల పాత్రలో జీవించి రాణించి మెప్పించారు. బుధవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో, త్రిష్ణ కూచిపూడి డాన్స్ అకాడమి, సూత్రధార్ యాక్టింగ్ ట్రైనింగ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ సంగీత నాటక అకాడమి అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య పుంజాల దుశ్శల ఏకపాత్రాభినయం ప్రదర్శించారు. 70 నిముషాలు పాటు నాన్ స్టాప్ అభినయ వాచకంతో ఆమె విశేషంగా ఆకట్టుకున్నారు. కూచిపూడి నాట్య గురువుగా నర్తకీమణి గా విభిన్న పాత్రలతో ప్రయోగాలు చేస్తూ తనదైన గుర్తింపు పొందిన అలేఖ్య పుంజాల ప్రత్యేక దుశ్శల పాత్రలో మంచి నటీమణి అని నిరూపించుకున్నారు. అనాదిగా స్త్రీ వివక్షకు గురవుతూనే వున్నదని, మహా భారతంలో కౌరవుల చెల్లెలిగా, గాంధారి ధృతరాష్ట్రుడి కుమార్తెగా, సైంధవుడి భార్యగా, సురథ తల్లి గా దుశ్శల ఎలా అణచివేతకు గురైందో, ఆమె పట్ల చూపించిన నిర్లక్ష్యానికి ఏ విధంగా జీవితంలో నష్ట పోయిందో, ఆమె ఆవేదనను అలేఖ్య పుంజాల కళ్ళకు కట్టేలా కొత్తకోణంలో ఆవిష్కరించి ఆలోచనలు రేకెత్తించారు. గతంలో జరిగిన ప్రదర్శన కన్నా ఈ ప్రదర్శన తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని డాక్టర్ అలేఖ్య పుంజాల వ్యాఖ్యానించారు. ఇది రెండవ ప్రదర్శన అని, దర్శకుడు వినయ్ వర్మ తనకు ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఆసక్తికరం అనిపించి ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఈ ఏకపాత్రను ప్రదర్శించినట్లు చెప్పారు. అనాదిగా మహిళలు అణచివేతకు బలవుతూనే ఉన్నారని, ఇన్నేళ్లు అయినా అన్ని రంగాల్లో రాణిస్తున్నా స్త్రీ స్వేచ్ఛ లో మాత్రం మార్పు రాలేదని ఆమె వివరించారు. పుట్టినప్పటి నుంచి దుశ్శల పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కావడం, కౌరవులకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా తనకు దక్కకపోవడం, సింధు రాజు సైంధవుడ్ని వివాహం చేసుకోవడం, కుమారుడు సురథ ను కాపాడుకునేందుకు అర్జునుడితో యుద్ధం వద్దని వేడుకోవడం ఇలా దుశ్శల పాత్రకు మహా భారతంలో చాలా ప్రత్యేకత ఉంది. కానీ, పాండవుల భార్య ద్రౌపదికి లభించిన గుర్తింవు దుశ్శలకు లభించలేదని చెబుతూ ఆమె నుంచి కొన్ని ప్రశ్నలు లేవనెత్తిన తీరు విశేషంగా ఆకర్షించింది. ఆహార్యం, రంగోద్దీపనం చక్కగా అద్భుతంగా కుదిరాయి. ప్రీతం చక్రవర్తి రచించగా, వినయ్ వర్మ దర్శకత్వ ప్రతిభ దుశ్శల పాత్రను తీర్చిదిద్దడంలో స్పష్టంగా కనిపించింది. అభినయంలో తనకు తానే సాటి అయిన అలేఖ్య పుంజాల వాచకంలోనూ మేటి అనిపించుకుని దుశ్శలగా ప్రశంసలందుకున్నారు. ప్రభుత్వ పూర్వ సలహాదారులు బివి పాపారావు, గోథే జెంత్ర అమితా దేశాయ్, పి. వినయ్ కుమార్, కళాకృష్ణ తదితరులు ప్రేక్షకుల్లో ఉన్నారు. విశాలి సింగ్ వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రఖ్యాత నర్తకీమణి మల్లికా సారాబాయి కూడా వచ్చారు
అపురూపం ఆలోచనాత్మకం దుశ్శల ఏకపాత్రాభినయం
