కవిత్వం: నాక్కొంచెం మాట సాయం కావాలి

poem namala
Spread the love

రవీంద్రసూరి నామాల, సూర్యాపేట సెల్ : 9848321079

ఎలా చేసారో కదా
ఏళ్ల కొద్దీ ప్రపంచ యుద్ధాలు
రాష్ట్రం అనీ, స్వేచ్ఛ అనీ
గాలిలో లెక్కలేని ప్రాణాలెట్ల వొదిలేశారో కదా
పిట్టల్లా రాలిపోతున్న సంఖ్య
గుట్టల్లా పెరిగిపోతుంటే 
భయం తాలూకూ రంగు మారిపోతున్న వేళ
నాలుగు గోడల మధ్య
నరాలు చిట్లిపోతున్నా
ఒక పాజిటివ్ నిరసన సమయం

నాక్కొంచెం మాట సాయం కావాలి

లోపల ఏం జరుగుతుంది
బయట ఏం జరగబోతోంది
కోట్ల స్వప్నాలు పహారా కాస్తున్నా
ఒక రాకాసి సర్పమేదో
భూమి చుట్టుకొలత చూస్తున్నట్టు
అమాంతంగా హత్తుకొని
విషపు కౌగిలిని వీక్షిస్తుంది
నిల్చున్నచోట నేల కదులుతుంది
కదులుతున్న నేల పై 
కమ్మని కలలు కనడం ఎలా?
కూర్చున్నచోట భూమి కుంగుతుంది
కుంగుతున్న భూమిపై 
పొంగుతున్న ఆలోచనలను నిలిపేదెలా?

కలల్ని,ఆలోచనల్ని
సర్దుకోవడం కష్టంగా ఉంది
పొడి పొడి దగ్గుల మధ్య
పాళీ రాలిపోయినప్పుడు
పచ్చని అక్షరాలు నిలిచేదెలా?
గాలిని బంధించారు 
బదిలీ చేస్తున్నారు
వెచ్చని గాలి విరిగిపోతుంది
తరిగిపోని ఎటూ తరలిపోని 
ఆక్సిజన్ సిలిండర్ అవసరం 
పాజిటివ్ సమయంలో
గాలినే కొనే ధనవంతుడెక్కడున్నాడు

నాక్కొంచెం మాట సాయం కావాలి

ఎవరికి ఎవరూ ఏమీ చేయలేని దుస్థితి
ప్రభుత్వమే చేతులెత్తేసింది
నిర్దయ ప్రపంచమని రుజువైంది
బయట ఉన్నా
లోపలున్నా
భయం లేని కత్తిని ధరించి ఎదురించు

Related posts

Leave a Comment