(చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం, విడుదల : 14 జనవరి -2025, రేటింగ్ : 3.75/5, నటీనటులు: వెంకటేష్, మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేశ్, వీకే నరేష్, వీటీ గణేష్, సాయి కుమార్, పమ్మి సాయి, సర్వదమన్ బెనర్జీ తదితరులు. దర్శకత్వం : అనిల్ రావిపూడి, నిర్మాత : దిల్ రాజు, సినిమాటోగ్రఫి: సమీర్ రెడ్డి, ఎడిటర్ : తమ్మిరాజు, మ్యూజిక్: భీమ్స్ సిసిరిలియో, బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
దర్శకుడు అనీల్ రావిపూడి సినిమాలన్నీ విడుదలకి ముందే రిజల్ట్ లీక్ అయిపోతుంటాయి. అందులోనూ.. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ప్రతిసారి విక్టరీ కొట్టిన వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటే హిట్ పక్కా అని విడుదలకు ముందే ఫిక్స్ అయిపోయారు ఫ్యామిలీ ఆడియన్స్. కథను టీజర్, ట్రైలర్‌లో చెప్పేస్తే అసలు కథపై ఇంట్రస్ట్ ఉండదని.. మెయిన్ పాయింట్‌ని రివీల్ చేయడానికి చాలామంది దర్శకులు ఇష్టపడరు. కానీ అనీల్ రావిపూడి మాత్రం.. ‘సంక్రాంతి వస్తున్నాం’ కథ మొత్తాన్ని ట్రైలర్‌లోనే రివీల్ చేశారు. కథ ఏంటి? కథనం ఏంటి? కథాగమనం ఏంటన్నదానిపై మెయిల్ లీడ్స్ క్యారెక్టర్స్‌తో క్లారిటీ ఇచ్చేశారు. కథని ముందే రివీల్ చేసి.. థియేటర్స్‌లో ఆడియన్స్‌ని రప్పించడం అంటే మామూలు విషయం కాదు. కానీ ట్రైలర్‌లోనే సినిమా మొత్తం చూపించేసి.. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌కి వెళ్లాలా.. సినిమా చూడాలా.. అనేట్టు చేశారు దర్శక, నటీనటులు. ప్రమోషన్స్ పీక్స్ అనేట్టుగా.. సినిమాపై ఇంట్రస్ట్ పెంచేశారు. ముఖ్యంగా హీరో వెంకటేష్ అయితే.. ఆడారు.. పాడారు.. నవ్వించారు.. మురిపించి మెప్పించి.. సినిమా ప్రమోషన్స్‌ని సూపర్ లెవల్‌కి తీసుకుని వెళ్లారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’.. విక్టరీ కొడుతున్నాం అని ముందే చెప్పిన యూనిట్ మరి ఆ విజయాన్ని అందుకుందా? బ్లాక్ బస్టర్ పొంగల్ రుచిచూపించిందా? తెలుసుకుందాం…
కథ: యాదగిరి దామోదర రాజు అలియాస్ యమ ధర్మరాజు (వెంకటేష్), భాగ్యలక్ష్మి (ఐశ్వర్య రాజేష్)లది హ్యాపీ ఫ్యామిలీ. గోదారిగట్టుపైనా రామచిలకవే అని భాగ్యాన్ని తెగ ప్రేమించేస్తుంటాడు రాజు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన రాజు ఓ ఎన్ కౌంటర్ విషయంలో సస్పెషన్‌కి గురై.. పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి తప్పుకుంటాడు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చి.. తొలిచూపులోనే భాగ్యని ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఆరేళ్లలో నలుగుర్ని పిల్లల్నికనిసే బిందాస్‌గా బతుకుతుంటాడు. అయితే తెలంగాణ సీఎం కేశవ్ (నరేష్) పెట్టుబడుల్ని ఆకర్షించే ఉద్దేశంతో దేశంలోనే నెంబర్ 1 కంపెనీ సీఈఓ అయిన సత్య ఆకేళ్ల (అవసరాల శ్రీనివాస్)ని హైదరాబాద్‌కి రప్పిస్తారు. కాగా అతన్ని బీజూ పాండే కిడ్నాప్ చేస్తాడు. జైల్లో ఉన్న తన అన్న పాప పాండేని విడిపిస్తేనే సత్య ఆకేళ్లని విడుస్తాం లేదంటే చంపేస్తాం అని అంటాడు. ఈ విషయం బయటకు తెలిస్తే.. ప్రభుత్వం పరువుపోతుందని సీక్రెట్ ఆపరేషన్ చేపడతారు సీఎం కేశవ. పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్‌గా మారిన ఈ క్రైమ్ అండ్ కిడ్నాప్ కేసుని రాజు మాత్రమే ఛేదించగలడని నమ్మి.. అతని సస్పెన్షన్‌ను ఎత్తి వేసి నేరస్థులను పట్టుకునే బాధ్యతను రాజుకి అప్పగిస్తారు. ఈ కేసులో రాజుకి సహకరించేందుకు జూనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మీనా (మీనాక్షి చౌదరి)ని తోడుగా పంపిస్తారు. అక్కడ మొదలౌతుంది గిలిగింతలుపెట్టే.. టిపికల్ ట్రాజరీ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ. ఓ బలహీన సమయంలో రాజు.. తన బ్రేకప్ స్టోరీని భార్యకి పూసగుచ్చినట్టు చెప్పేస్తాడు. పోలీస్ ఆఫీసర్‌గా వచ్చిన మీనే.. తన భర్త మాజీ ప్రేయసి కావడంతో భాగ్యం నిఘాపెడుతుంది. కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో రాజు, మీనాలు దగ్గరౌతుండటాన్ని తట్టుకోలేకపోతుంది. తాను కూడా ఇన్వెస్టిగేషన్‌లో భాగం అవుతుంది. వాళ్లు కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే భాగ్యం.. భర్త బ్రేకప్ లవ్ స్టోరీని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటుంది. అటు భార్య.. ఇటు మాజీ ప్రేయసి మధ్య నలిగిపోతూ.. కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్‌ను ఏవిధంగా ముగించాడు? ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు దామోదర రాజు ఎందుకు సస్పెండ్ అయ్యాడు? సత్యంను పాండే గ్యాంగ్ ఎందుకు కిడ్నాప్ చేస్తారు? మీనాక్షితో రాజు బ్రేకప్ ఎందుకు జరుగుతుంది? ఏ పరిస్థితుల్లో భాగ్యలక్ష్మీని రాజు పెళ్లి చేసుకొంటాడు? సత్యంను కిడ్నాప్ నుంచి విడిపించేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో భాగ్యం కూడా ఎందుకు భాగస్వామ్యమైంది? భాగ్యానికి మీనాక్షి రూపంలో సవతిపోరు ఎలాంటి సమస్యలు తెచ్చింది? మాజీ ప్రేయసి, భార్య మధ్య రాజు నలిగాడు? తన పెంపుడు తండ్రి (సర్వదమన్ బెనర్జీ) కోసం ఎంత వరకు వెళ్లాడు? చివరకు సత్యం కిడ్నాప్ డ్రామా ఎలా సుఖాంతమైంది? అన్నదే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అసలు కథ.
విశ్లేషణ : వందలకోట్లు బడ్జెట్ లేదు.. పాన్ ఇండియా ఆర్టిస్ట్‌లూ హడావిడి లేదు.. ఏళ్లకి ఏళ్లు కాలక్షేపం లేదు.. మూడే మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి ఆరే ఆరు నెలల్లో సినిమా తీసి.. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ బొమ్మని వదిలారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’.. విక్టరీ కొడుతున్నాం అని ముందే చెప్పి మరీ బ్లాక్ బస్టర్ పొంగల్ రుచిచూపించారు. అటు భార్య.. ఇటు మాజీ ప్రేయసి మధ్య నలిగే ఓ భర్త. ప్రతి ఫ్యామిలీ రిలేట్ చేసుకునే సినిమా ఇది. ఇదేదో నా కథలా ఉందే అని ఓన్ చేసుకునే సినిమా . : ఫన్, ఫాదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ లాంటి అంశాలను కలబోసి రూపొందించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. భార్య, భర్త, ప్రేయసి నడుమ.. గమ్మత్తైన కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్‌ని ఇరికించి ఫన్ రైడ్ చూపించారు. చివర్లో గురువుని గౌరవించాలి అని సందేశాన్ని ఇచ్చారు. ప్రతి విద్యార్థి వెనుక భుజం తట్టిన మాస్టర్ ఉండే ఉంటారు. అలాంటి గురువుని మర్చిపోకూడదు. గురువుని గుర్తించుకోలేని విజయం కూడా అనాధ’ అంటూ గురోపదేశాన్ని అందించారు అనీల్ రావిపూడి. ‘ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దు’ అని వెంకీమామ సరదాగానే చెప్పినా.. దాని వెనుక బలమైన ఉద్దేశమే ఉంది. పెళ్లికి ముందు ఎవర్నైనా ప్రేమించావా? అని చాలా సుతిమెత్తగా అడుగుతారు. పొరపాటున నోరుజారి నిజం చెప్పారో.. మటాష్. జీవితం మొత్తం సందర్భం వచ్చిన ప్రతిసారి గుచ్చుతూనే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఎదో ఒక గతం ఉంటుంది. ఆ గతంలో ప్రేమకథ కూడా ఉండి ఉంటుంది. ప్రేమలేదూ అంటే ప్రేమని వెతకలేదనే అర్థం. ఆ ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా కనీసం ఫస్ట్ క్రస్ ఉంటుంది. ఆ ఫస్ట్ లవ్ గురించి కానీ.. క్రష్‌ల గురించి కానీ పెళ్లం కూపీ లాగినప్పుడు కూశావో లైఫ్ లాంగ్ టార్చరే. ఆ టార్చర్ ఎలా ఉంటుందో సంక్రాంతి నాడు.. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో సందడిగా చూపించారు. ప్రేయసికి పెళ్లానికి మధ్య ప్రియుడి ప్రేమగారడీ ఉల్లాసంగా సాగుతుంది. ఫస్టాఫ్ సినిమా క్రేజీగా సాగిపోతే.. సెకండాఫ్ కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో ఎక్కువ అంచనా వేసుకొంటే కొంత డిజాపాయింట్ అవుతారు. కాకపోతే పూర్తి క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్ చూశామని తృప్తితో ప్రేక్షకుడు బయటకు వచ్చేలా సినిమా ఉంటుంది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూసే జంధ్యాల మార్కు కామెడీ సినిమా. థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ కోసం సినిమా హాళ్లలోనే చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది. సినిమా కథ పాతదైనప్పటికీ రెగ్యులర్, రొటీన్ కమర్షియల్ పాయింట్ లో సాగి కాస్త హుషారు కలిగిస్తుంది. తనదైన శైలిలో హస్యాన్ని జోడించడంలో దిట్ట అయిన అనిల్ రావిపూడి అదే ట్రీట్‌మెంట్‌తో చెలరేగిపోయాడని చెప్పొచ్చు. కొన్నిసార్లు జంధ్యాల మార్కు కామెడీ కనిపిస్తే.. మరికొన్ని సార్లు పక్కా జబర్దస్త్ సీన్లను గుర్తు చేస్తుంది. అయితే వెంకీ మామ ఇమేజ్.. ఆయనకు ఉన్న ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని రాసుకొన్న సన్నివేశాలు హిలేరియస్ హాస్యాన్ని పండించాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు యాక్షన్ జోడించి సంక్రాంతి పండుగ సంబరాన్ని సినీ అభిమానులకు పంచాడనే చెప్పాలి. అప్పట్లో.. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఇప్పుడు.. ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఆ కథలో ఇంట్లో ఇల్లాలు ఉండగా.. ప్రియరాల్ని వంటగదిలో పెట్టి వినోదాన్ని పంచిన వెంకీమామ.. ఈసారి మాజీ ప్రేయసి, కట్టుకున్న భార్య కథతో గిలిగింతలు పెట్టాడు. ఇద్దరి మధ్య నలిగిపోయే క్యారెక్టర్ చేయడంలో దిట్ట అయిన వెంకీ మామ మరోసారి కడుపుబ్బా నవ్వించారు. థియేటర్స్‌లో నవ్వుల పూలు పూయించారు. ఈ సంక్రాంతికి అసలుసిసలు ఎంటర్‌టైన్మెంట్‌ని అందించారు. అనీల్ రావిపూడి సినిమా అంటే.. నవ్విస్తాడ్రా.. కాసేపు హాయిగా నవ్వుకుని రావొచ్చు అనేవాళ్లు ఉంటారు. వీడెప్పుడూ రొటీన్ రోత కొట్టుడు సినిమాలు తప్పితే డిఫరెంట్‌గా ట్రై చేయలేడా? ఒకే సినిమాని తిప్పి తిప్పి ఒకే విధంగా తీస్తాడు అనేవాళ్లు ఉన్నారూ. ఆ తిట్టుకునే వాళ్ల టేస్ట్‌ని అనీల్ రావిపూడి మ్యాచ్ చేయలేకపోవచ్చు కానీ.. తనకంటూ సెటాఫ్ ఆడియన్స్‌ని సెటాఫ్ సినిమాలను సెట్ చేసుకున్న అనీల్ రావిపూడి మరోసారి తన పంథాని మార్చుకోకుండా ఫన్ ట్రీట్ అందించారు. కామెడీ అనే కోర్ ఎలిమెంట్‌ని మాత్రం మిస్ చేయకపోవడమే అనీల్ రావిపూడి డైరెక్షన్ మార్క్. అతను గొప్ప సినిమాలు తీయకపోవచ్చు కానీ.. చెత్త సినిమాలు అయితే తీయట్లేదు. అనీల్ రావిపూడి సినిమా అంటే.. ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు.. కలెక్షన్లకు ఢోకా ఉండదు. హిట్ టాక్ గ్యారంటీ.. ఒక్కటి కాదు రెండు కాదు పటాస్‌తో మొదలుపెట్టి సినిమా వరకూ ఆరు హిట్లు కొట్టి.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఫామ్ కంటిన్యూ చేశారు. అబ్బే అనీల్ రావిపూడి ఏమంత గొప్ప సినిమాలు తీశాడనీ.. అని అనుకోవడం తప్పేం లేదు. ఎందుకంటే.. ఏది గొప్ప సినిమా అంటే.. అదో పెద్ద డిబేటింగ్ సబ్జెక్ట్. పుష్ప, బాహుబలి లాంటి ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్లనే తూట్లు పొడిచిన సందర్భంలో అనీల్ రావిపూడి సినిమాల్లో ‘గొప్పేం ఉంటుంది. అందుకే అనీల్ రావిపూడి నాకు కావాల్సింది డిబేట్‌లు కాదు.. సినిమా ఆడటమే ముఖ్యం. ఈ సినిమాతోనే అదే చేశారు. తాను తీసిని సినిమా ఎంతమందికి రీచ్ అయ్యింది.. ఎంత కలెక్ట్ చేసింది.. ఆడియన్స్‌ని మెప్పించడం.. నవ్వించడమే సక్సెస్ మంత్రగా భావించిన అనీల్ రావిపూడి.. డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌తో మరోసారి ఆకట్టుకున్నారు.
ఎవరెలా చేశారంటే… వెంకటేష్‌కు రాజు క్యారెక్టర్ టైలర్ మేడ్ రోల్. అనాథగా, ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా, మాజీ ప్రియుడిగా, బాధ్యాతాయుతమైన భర్త, తండ్రి, కొడుకుగా ఇలా రకరకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. తనదైన మేనరిజం, బాడీ లాంగ్వేజ్‌లో మరోసారి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ రూపంలో ఫుల్ మీల్స్ అందించాడు. యాదగిరి దామోదర రాజు అలియాస్ యమ ధర్మరాజు పాత్రలో వెంకటేష్.. వీరవిహారం చేశారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ నవ్విస్తూనే ఉన్నారు. బ్లాక్ బస్టర్ పొంగలూ అని పాట పాడటమే కాదు.. పొంగల్‌కి గ్రాండ్ విక్టరీ అందించారు. ఇక ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి తమ పాత్రలతో చెలరేగిపోయారు. తమ క్యారెక్టర్లలో లీనమై నటించారు. వెంకటేష్‌కి భార్యగా నటించిన ఐశ్వర్య రాజేష్. భాగ్యం పాత్రలో కెరియర్‌లోనే మరో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. తనలోని మల్టీ షేడ్స్‌ని చూపించి.. ‘రాజు బా’కి చుక్కలు చూపిస్తూ.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. ఆయ్ మాది గోదావరి అండి అంటూ.. గయ్యాళిగా కనిపించాలి.. అలా అనిపించకూడదు. చాలా టిపికల్ క్యారెక్టర్‌ని అంతే ఈజీగా చేసింది ఐశ్వర్య రాజేష్. సవతిపోరుని గట్టిగా ఢీకొట్టి.. గడుసరి పెళ్లం అనిపించింది. భాగ్యానికి తన భర్త ప్రేమ కథ చెప్పనంతవరకూ భార్యగానే కనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రేమకథ చెప్పాడో.. ఆమెలో అసలుసిసలైన పెళ్లం బయటకు వచ్చేసింది. గోదారి ఆడపడుచుగా మెప్పిస్తూ.. ఆ గోదారి యాస సైతం భాగ్యానికి మరింత భాగ్యం తీసుకొచ్చేట్టు చేసింది. ఇక కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో రాజుకి సహకరించే జూనియర్ ఐపీఎస్ ఆఫీసర్‌గా మీనాక్షి చౌదరి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. మీనాక్షి చౌదరి.. పోలీస్ డ్రెస్‌లో అదరగొట్టింది. యాక్షన్ సీన్లలోనూ మెప్పించింది. ఇక రాజుకి భార్యతో కొట్లాడే మాజీ లవర్‌గానూ బాగా సెట్ అయ్యింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసిన తరువాత.. హీరో హీరోయిన్లు, డైరెక్టర్ గురించి ఎంతమంది మాట్లాడుకుంటారో ఏమో కానీ.. వెంకటేష్ కొడుకు బుల్లిరాజుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ గురించి మాత్రం తప్పకుండా చెప్పుకుంటారు అనేట్టుగా యాక్టింగ్‌ని కొరికిపారేశాడు ఈ బుడ్డోడు. ‘కొరికేస్తా.. కొరికేస్తా’ అంటూ థియేటర్స్ నిజంగానే కొరికిపారేశాడు. ఫస్టాఫ్‌లో ఊరి వాళ్లంతా వచ్చి.. తన తండ్రి చిన్నరాజుని తిడుతుంటే.. బుడ్డోడు బుల్లిరాజు పేల్చిన డైలాగ్‌లకు థియేటర్స్‌లో గొల్లున నవ్వులు వినిపించాయి. నీకోసం నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, నా పిన్ని వచ్చింది నాన్నోయ్ అని మీనాక్షి చౌదరి చూపించే సీన్ హైలైట్. మా నాన్న మా అమ్మతో డాన్స్ చేస్తున్నాడు.. మీ పెళ్లాలతో డాన్స్ చేయట్లేదు కదా అని బుడ్డోడు పలికించిన హావభావాలు, డైలాగ్‌లు.. ఎక్కడా లిమిట్ క్రాస్ చేయకుండా గొల్లున నవ్వేట్టు చేశాయి. తెలంగాణ సీఎంగా నరేష్.. పార్టీ అధ్యక్షుడిగా వీటీవీ గణేష్ పాత్రలు ఫన్ రైడ్‌లో కీలక భాగం అయ్యాయి. జైలర్ జార్జ్ ఆంటోనీగా ఉపేంద్ర లిమాయే విలక్షణ నటనను ప్రదర్శించారు. సాయి కుమార్ బేస్ వాయిస్ ఎపిసోడ్ కూడా పండింది. అవసరాలతో పాటు.. శ్రీనివాస్ రెడ్డి, వడ్లమాని శ్రీనివాస్‌లకు మంచి పాత్రలే దక్కాయి. గోదావరి యాసలో పమ్మిసాయి.. కథను మలుపు తిప్పే పాత్రలో గణేష్ నవ్వుల్లో ముంచెత్తుతారు.
టెక్నీకల్ విషయాలకొస్తే… బీజీఎం, సాంగ్స్‌తో భీమ్స్ ఫుల్ మార్కులు కొట్టేశాడు. సినిమా రిలీజ్‌కు హిట్ వైబ్ అందించిన ఆయన తెరపైన పాటలను, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మరో రేంజ్‌కు తీసుకెళ్లాడని చెప్పాలి. ఈ సినిమాలో మేజర్ హైలైట్ అంటే.. భీమ్స్ సిసిరోలియో సంగీతమే అని చెప్పొచ్చు. గోదారి గట్టుపైన రామాచిలకవే అంటూ సన్సేషనల్ సింగర్ రమణగోగులతో పాట పాడించి.. ఆడియన్స్‌తో ఆ పాటని మళ్లీ మళ్లీ పాడేట్టు చేశారు. అయితే ఆ పాట విజువల్‌గా అంతే అద్భుతంగా ఉంది. భాను మాస్టర్ కొరియోగ్రఫీ కూడా చాలా డీసెంట్‌గా అనిపిస్తుంది. గోదారి గట్టు మీద రామచిలకవే, మీరు , బ్లాక్ బస్టర్ పొంగలూ ఇలా ప్రతి పాట అదిరింది. వాటి ప్లేస్ మెంట్ కూడా బాగా కుదిరింది. కథలో ఇరికించినట్టుగా కాకుండా… కరెక్ట్ ప్లేస్ మెంట్ సందర్భానుసారంగా వచ్చిన పాటలు ఈ సినిమాలో మేజర్ హైలైట్. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా వాయించారు. ఇక సమీర్ రెడ్డి ప్రతీ సీన్‌ను అందంగా చెక్కారు. గోదావరి అందాలను చక్కగా కెమెరాలో బంధించారు. తమ్మిరాజు సినిమాను పరుగులు పెట్టించారు. దిల్ రాజు ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ మొత్తం థియేటర్స్‌కి వెళ్లి హ్యాపీగా నవ్వుకుని రావడానికి బెస్ట్ ఛాయిస్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఎక్స్ లవ్ స్టోరీలు ఉన్నా కూడా.. భార్యలతో కలిసి చూడాల్సిన చూడముచ్చటైన సినిమా. మరోసారి సంక్రాంతికి కుటుంబం అంతా వినోదించే ఫ్యామిలీ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అందించిందనే చెప్పాలి. మరి..ఎందుకు ఆలస్యం.. ‘బ్లాక్ బస్టర్ పొంగల్’ని ఎంజాయ్ చేసేయండి.