(విడుదల తేదీ : 1, సెప్టెంబర్ 2023, రేటింగ్ : 3.25/5, నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, మురళీశర్మ, సచిన్ కేడ్కర్, వెన్నెల కిషోర్, రోహిణి, రాహుల్ రామకృష్ణ తదితరులు. దర్శకత్వం : శివ నిర్వాణ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని-వై.రవిశంకర్, సంగీతం: హిషామ్ అబ్ధుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ: మురళి.జి, ఎడిటర్: ప్రవీణ్ పూడి)
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ – సమంత కాంబినేషన్ లో వచ్చిన తాజా సినిమా ఖుషి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం నేడు ( 1, సెప్టెంబర్ 2023) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘ఖుషి’తో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలనే తపనతో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ పట్టుదలగా ఉన్నాడు. మ్యూజికల్ లవ్‌స్టోరీలో విజయ్ దేవరకొండతో సమంత జోడీ కట్టడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ సినిమా పాటలు అన్ని భాషల్లో పాపులర్ కావడం, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం…
కథ: బీఎస్ఎన్ఎల్ సంస్థలో ఉద్యోగం సంపాదించిన విప్లవ్ (విజయ్ దేవరకొండ) తన పోస్టింగ్‌ను కశ్మీర్లో ఇవ్వాలని కోరతాడు. కశ్మీర్ అంటే మణిరత్నం సినిమాల్లో చూపించే అందమైన మంచుపర్వతాలు, వాటికి తోడుగా ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్, అందమైన రొమాన్స్ అలా ఓ ఫాంటసీ ప్రపంచాన్ని ఊహించుకుంటాడు. అయితే అక్కడకు వెళ్లగానే ఓ బాంబ్‌బ్లాస్ట్ ఇన్సిడెంట్, భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య కాల్పుల సంఘటనను ఫేస్ చేయడంతో భయానికి గురవుతాడు. కశ్మీర్లో జీవితం ఊహించినట్లుగా అంత అందంగా ఉండదని అర్థమవుతుంది. ఈ సందిగ్ధ పరిస్థితుల్లో అక్కడ ఆరాబేగం (సమంత) పరిచయమవుతుంది. తొలిచూపు లోనే ఆమె ప్రేమలో పడతాడు విప్లవ్. తప్పిపోయిన తన సోదరుడి కోసం తాను పాకిస్థాన్ నుంచి వచ్చానని విప్లవ్కు అబద్ధం చెబుతుంది ఆరాబేగం. ఈ క్రమంలో వారు ప్రేమలో పడతారు. కొద్ది రోజుల తర్వాత ఆరాబేగం అసలు పేరు ఆరాధ్య అని, ఆమె కాకినాడకు చెందిన అమ్మాయి అని విప్లవ్కు తెలుస్తుంది. తాను ప్రముఖ ప్రవచనకర్త చదరంగం శ్రీనివాస రావు (మురళీశర్మ) కుమార్తెనని విప్లవ్‌తో చెబుతుంది ఆరాధ్య. మరోవైపు విప్లవ్ తండ్రి లెనిన్ సత్యం హైదరాబాద్‌లో నాస్తికవాద సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తుంటాడు. గతంలోనే చదరంగం శ్రీనివాసరావుకు, లెనిన్ సత్యం మధ్య సిద్దాంత పరమైన విభేదాలుంటాయి. ఈ నేపథ్యంలో తన కుటుంబ అభీష్టానికి వ్యతిరేకంగా ఆరాధ్య.. విప్లవ్‌ను పెళ్లాడుతుంది. ఇద్దరి జాతకం కుదరనందున వివాహంలో సమస్యలు వస్తాయని ఆరాధ్య తండ్రి చదరంగం శ్రీనివాస రావు హెచ్చరిస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఈ జంట వైవాహిక జీవితంలో ఎలాంటి మలుపులు తిరిగిందన్నది సినిమా కథ. సనాతన ధర్మాన్ని ఆచరించే అమ్మాయి కుటుంబం, నాస్తిక వాదాన్ని నమ్మే అబ్బాయి తండ్రి..వీరిద్దరి మధ్య జరిగే ఓ సంఘర్షణ నేపథ్యంలో దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. జంట మధ్య వివాహానంతరం ఏర్పడే విభేదాలు, మనస్పర్థల నేపథ్యంలో గతంలో ఎన్నో ప్రేమకథా చిత్రాలొచ్చాయి. అయితే ఈ సినిమాలో సనాతన ధర్మం, నాస్తికత్వం అనే విరుద్ధ సిద్దాంతాల నడుమ ఓ జంట ప్రయాణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. సున్నితమైన అంశాన్ని తీసుకొని అంతిమంగా బంధాలు, ప్రేమలు గొప్పవనే సందేశాన్ని అందించారు. కశ్మీర్ నేపథ్యంలో ఈ సినిమా ప్రథమార్థం ఆద్యంతం ఆహ్లాదభరితంగా, చక్కటి వినోదంతో సాగింది. చిన్న అబద్ధంతో మొదలైన విప్లవ్, ఆరాధ్య ప్రేమాయణాన్ని తెరపై అందంగా ఆవిష్కరించారు. ఆరాబేగం అలియాస్ ఆరాధ్య ప్రేమను గెలుచుకోవడానికి విప్లవ్ చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు హృద్యంగా ఉంటూ మంచి వినోదాన్ని పంచుతాయి. విజయ్ దేవరకొండ, వెన్నెల కిషోర్ మధ్య కామెడీ బాగా వర్కవుట్ అయింది. ఇక సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌పై కథ నడుస్తుంది. ఆరాధ్యకు సంతానం కలగాలంటే హోమం జరపాల్సిందేనని చదరంగం శ్రీనివాసరావు పట్టుబడటం, దానికి లెనిన్ సత్యం వ్యతిరేకించడంతో రెండు కుటుంబాల మధ్య సంఘర్షణతో ద్వితీయార్థం భావోద్వేగాలతో నడుస్తుంది. అయితే హోమం నేపథ్యంలో సాగే డ్రామాను సాగతీశారనే భావన కలుగుతుంది. శాస్త్రాలు, సైన్స్ కంటే ప్రేమ, పెళ్లి బంధమే గొప్పదని ఇరు కుటుంబాలు రియలైజ్ కావడంతో కథ సుఖాంతమవుతుంది. కథాపరంగా పాయింట్ పాతదే అయినా దానిని తెరపైకి కన్విన్సింగ్‌గా తీసుకురావడంలో దర్శకుడు శివ నిర్వాణ సఫలీకృతుడయ్యాడు. విప్లవ్ పాత్రలో విజయ్ దేవరకొండ చక్కటి నటనను కనబరిచాడు. ప్రేమికుడిగా, భర్తగా రెండు భిన్న పార్శాలున్న పాత్రల్లో మెప్పించాడు. కథానాయిక సమంతకు ఈ తరహా పాత్రలు కొత్తేమీ కాదు. ఆరాధ్య పాత్రలో బరువైన భావోద్వేగాలను పలికిస్తూ ఆకట్టుకుంది.
విశ్లేషణ : మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ఇది. వీటికి తోడు ఫీల్ గుడ్ లవ్ సీన్స్ .. ఎమోషనల్ గా సాగే ఫ్యామిలీ టచింగ్స్ .. అలాగే డీసెంట్ గా అనిపించే నటీనటుల పనితీరు ఈ ‘ఖుషి’ చిత్రానికి హైలైట్స్ గా నిలిచాయి. ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది. దర్శకుడు శివ నిర్వాణ నాస్తికత్వానికి – భక్తికి సంబంధించి మంచి పాయింట్ ను తీసుకుని.. భార్యాభర్తల మధ్య మంచి ఎమోషనల్ సన్నివేశాలతో బాగానే ఆకట్టుకున్నాడు. గుడ్ కాన్సెప్ట్, ఫీల్ గుడ్ లవ్ సీన్స్, ఎమోషనల్ గా సాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలో హైలైట్స్ గా నిలిచాయి. దర్శకుడు శివ నిర్వాణ తీసుకున్న కథాంశం బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సాదాసీదాగా సాగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోని కశ్మీర్ సీక్వెన్స్ అలాగే సెకెండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే స్లోగా ఉండి సోసో అనిపిస్తుంది. ఇక హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స కూడా రెగ్యులర్ గానే సాగుతాయి. మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ సీన్స్ ను ట్రిమ్ చేసి వుంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. దర్శకుడు శివ నిర్వాణ రాసిన కథ, పాత్రలు కొత్తగా పెళ్లి అయిన వారి జీవితాల్లోని సంఘటనలు పరిస్థితుల ఆధారంగా సాగుతూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయి. ఆద్యంతం ఆసక్తికమైన సన్నివేశాలతో సాగి ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఓ ప్రవచన కర్త – ఓ నాస్తికుడి మధ్య జరిగిన సంఘర్షణ.. ప్రేమ కథలో కూడా కాన్ ఫ్లిక్ట్ ను పెంచడం చాలా బాగుంది. విజయ్ దేవరకొండ – సమంత కూడా తమ పాత్రలకు ప్రాణం పోశారు. భర్త పాత్రలో విజయ్ దేవరకొండ ఆకట్టుకునే నటనను కనబరిచాడు. పెళ్లి అయిన తర్వాత ఓ సగటు భర్తగా హుందాగా నటించి మంచి మార్కుల్ని కొట్టేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే.. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి జీవం పోశాడు. మెయిన్ గా సెకెండ్ హాఫ్ లో హోమం సీక్వెన్స్ లో అలాగే సమంత వెళ్ళిపోయాక వచ్చే సన్నివేశంలో విజయ్ నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది. అలాగే విజయ్ కి – సమంతకి మధ్య కెమిస్ట్రీ కూడా ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. కథానాయకగా నటించిన సమంత తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. ఈ సినిమాలో కొన్ని సీక్వెన్స్ స్లోగా సాగడం, అలాగే కొన్ని రొటీన్ సీన్స్ సినిమాకి మైనస్ అయ్యాయి. కాకపోతే, విజయ్ దేవరకొండ – సమంత తమ నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకువెళ్లారు. ముఖ్యంగా వారిద్దరీ కెమిస్ట్రీ చాలా బాగుంది. మురళీశర్మ, సచిన్ ఖేడ్కర్ కథలో కీలకంగా నిలిచారు. వారిద్దరి నటన బాగుంది. ఇక వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమదైన కామెడీ టైమింగ్, డైలాగ్స్‌తో మెప్పించారు.
సాంకేతిక విభాగం : సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ముందుగా శివ నిర్వాణ దర్శకుడి గురించి చెప్పుకోవాలి. మంచి కథాంశంతో చక్కటి టేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే ప్రతీ సన్నివేశాన్ని ఆయన తెరకెక్కించిన తీరు వాహ్.. అనిపించింది. సంగీత దర్శకుడు హిషామ్ అబ్ధుల్ వహాబ్ అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే అనిపించింది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతలు నవీన్ ఎర్నేని-వై.రవిశంకర్ పాటించిన నిర్మాణ విలువలు సూపర్ గా ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లలో ‘ఖుషి’ ఖుషీగా అలరిస్తూ వినోదంలో ముంచెత్తుతుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు సాగతీతగా అనిపించినా ఓవరాల్‌గా ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ’ఖుషి’ ప్రేక్షకులను మెప్పిస్తుంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మంచి ఫలితాలను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.