గత కొన్ని రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స తీసుకుంటున్న నందమూరి తారకరత్న (40) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. నారాయణ హృదయాలయకు విదేశాల నుంచి ప్రత్యేకమైన వైద్య బృందం వచ్చి బెంగళూరులో తారకరత్నకు చికిత్స చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కోమాలోకి వెళ్లిన తారకరత్నను కాపాడేందుకు డాక్టర్లు చేసిన విశ్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న కుప్పంలో హార్ట్ స్ట్రోక్ కు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి.. ఆ తర్వాత బెంగళూరు నారాయణ హృదయాలయకు షిఫ్ట్ చేశారు. అప్పటినుంచి చికిత్స కొనసాగింది. తారకరత్న మరణ వార్తతో సినీ లోకంతో విషాదం అలుముకుంది. తారకరత్న మరణ వార్త తెలిసి నందమూరి ఫ్యామిలీకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. నందమూరి తారకరత్న కోలుకోవాలని ఆయన అభిమానులతో పాటు రెండు రాష్ట్రాల ప్రజలు కోరుకున్నా చివరకు నిరాశే మిగిలింది. తారకరత్న ఇకలేరని తెలిసి నందమూరి ఫ్యాన్స్ శోక సంద్రంలో మునిగిపోయారు.
ఒక కొత్త హీరో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా తొమ్మిది చిత్రాలతో.. అదీ ఒకే రోజున పరిచయం కావడం సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని సంఘటన. నందమూరి తారకరత్న విషయంలోనే అలా జరిగింది. మహానటుడు ఎన్టీఆర్ మనవడు, ఛాయాగ్రాహకుడు నందమూరి మోహనకృష్ణ తనయుడైన తారకరత్న ను అంత గ్రాండ్‌గా లాంఛ్ చేసింది నందమూరి కుటుంబం. 2002 లో జరిగిన ఈ చారిత్రక సంఘటనకు వేదికగా నిలిచింది హైదరాబాద్‌లోని రామకృష్ణా స్టూడియో ప్రాంగణం.
తాత ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నెల రోజులకు అంటే 1983 ఫిబ్రవరి 22న పుట్టారు తారకరత్న. నందమూరి కల్యాణ్‌రామ్ కంటే ఐదేళ్లు చిన్న. జూనియర్ ఎన్టీఆర్ కంటే నాలుగు నెలలు పెద్ద. బాబాయి బాలకృష్ణ సినిమా హీరో కావడంతో చిన్నతనం నుంచీ తారకరత్నకు సినిమాలంటే ఆసక్తి ఉండేది. బాలకృష్ణ దగ్గర ఎక్కువ చనువు ఉండడంతో నటుణ్ణి కావాలనే కోరికను ఆయన ముందు వ్యక్తం చేశారు తారకరత్న. ఆయన తన సోదరులతో మాట్లాడి వారిని ఒప్పించి, తారకరత్నను హీరోగా పరిచయం చేశారు బాలకృష్ణ. ఒకేరోజు తొమ్మిది సినిమాలతో తారకరత్న పరిచయం కావాలన్న ఆలోచన కూడా బాలకృష్ణదే. ఈ రోజు ఏ ఏ సినిమాలు ప్రారంభించాలనీ, దర్శకులు ఎవరనేది నిర్ణయించింది కూడా బాలకృష్ణే. ఆ రోజు
ఆ రోజు తొమ్మిది సినిమాలు మొదలైనా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలైన ఏకైక చిత్రం ‘ఒకటో నంబర్ కుర్రాడు’. ఈ సినిమాకు కె.రాఘవేంద్రరావు, అశ్వనీదత్ నిర్మాతలు కావడం విశేషం. 2002లో విడుదలైన ఈ సినిమాకు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. అయితే ఆ తర్వాత హీరోగా తారకరత్న కెరీర్ అనుకున్నంత సాఫీగా సాగలేదు. ఇంతవరకూ మొత్తం 21 చిత్రాల్లో ఆయన నటించారు. వీటిల్లో ‘యువరత్న’, ‘భద్రాద్రి రాముడు’, ‘నందీశ్వరుడు’ చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.. ‘9 అవర్స్’ వెబ్ సిరీస్‌లో తారకరత్న చివరి సారిగా నటించారు. హీరోగానే కాకుండా ‘అమరావతి’, ‘రాజా చెయ్యి వేస్తే’ చిత్రాల్లో విలన్‌గా తారకరత్న నటించారు. ‘అమరావతి’ చిత్రంతో నంది అవార్డ్ కూడా అందుకొన్నారు. విలన్‌గా కూడా ఆయన ప్రయాణం ఆశించిన విధంగా సాగలేదు. బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తారకరత్న విలన్‌గా నటిస్తారని నిర్మాతలు ఇటీవలే ప్రకటించారు. కానీ ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొనక ముందే తారకరత్న ఇలా కన్ను మూశారు. నందమూరి వంశంలో ప్రేమ వివాహాలు అనేవి లేవు. అన్నీ పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే. కానీ ఆ వంశంలో తొలి సారిగా ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తి తారకరత్న. ఒకప్పటి తన స్నేహితురాలు అలేఖ్యా రెడ్డిని ఆయన 2012 ఆగస్టు 2న హైదరాబాద్‌లోని సంఘీ టెంపుల్‌లో పెళ్లి చేసుకున్నారు. అలేఖ్యా రెడ్డికి అప్పటికే పెళ్లయింది. కానీ విడాకులు తీసుకున్నారు. ఈమె ఎవరో కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి మరదలి కూతురు. కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా ఆమె పని చేశారు. తారకరత్న నటించిన ‘నందీశ్వరుడు’ సినిమాకు కూడా ఆమె వర్క్ చేశారు. తారకరత్న ప్రేమ వివాహంతో ఆగ్రహించిన నందమూరి కుటుంబ సభ్యులు ఆయన్ని కొంత కాలం దూరం పెట్టినా తర్వాత కలసి పోయారు. ఈ దంపతుల ఏకైక కుమార్తె నిష్క. తన మేనమామ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన మాట కోసం తారకరత్న తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో గుడివాడ నియోజక వర్గం నుంచి తారకరత్నను పోటీలో నిలపాలని తెలుగు దేశం పార్టీ అధిష్టాన వర్గం ఆలోచన. కుప్పంలో ప్రారంభమైన ‘యువగళం’ పాద యాత్రలో తారకరత్న పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఆయన గుండె పోటుకు గురై మరణించడం దురదృష్టకరం.
”తారకరత్న మరణవార్తతో తీవ్ర విషాదంలో కూరుకుపోయాను. చాలా బాధగా ఉంది. ఎంతో ఆప్యాయత కురిపించే తారకరత్న ఇక లేరంటే నమ్మశక్యంగా లేదు.వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలి. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలి” అంటూ చిరంజీవి సంతాపాన్ని ప్రకటించారు.
”నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరం. నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకున్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవడం దురదృష్టకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అన్నారు పవన్ కల్యాణ్
”తారకరత్న మృతి తీవ్ర విషాదానికి గురిచేసింది. నా సోదరుడు చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతారని ఊహించలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి” అంటూ సంతాపాన్ని ప్రకటించారు మహేశ్‌బాబు
నందమూరి తారకరత్న కన్నుమూత
