చిత్రం: పెళ్లి సందD
విడుదల: 15 అక్టోబర్ 2021
రేటింగ్ : 2/5
నటీనటులు: రోషన్, శ్రీలీల, ప్రకాశ్‌రాజ్,
రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, రావు రమేష్,
వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్,
రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్,
అన్నపూర్ణ, జాన్సి, ప్రగతి, హేమ,
కౌముది, భద్రం, కిరీటి తదితరులు.
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ
ఎడిటర్: తమ్మిరాజు
నిర్మాణం: ఆర్కా మీడియా వర్క్స్, ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్ బ్యానర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయిబాబా కోవెలమూడి
నిర్మాతలు: మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
దర్శకత్వ పర్యవేక్షణ: కె.రాఘవేంద్రరావు బి.ఏ
దర్శకత్వం: గౌరీ రోణంకి
కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘పెళ్లి సందడి’ గొప్ప విజయాన్ని నమోదు చేస్కుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ ‘పెళ్లి సందD’ అనే టైటిల్‌తో ఆయన దర్శకత్వ పర్యవేక్షణలోనే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం.. అప్పటి ‘పెళ్లిసందడి’లో హీరోగా నటించిన శ్రీకాంత్ తనయుడు.. ఇప్పటి ‘పెళ్లి సందD’లో హీరో కావడం ఈ సినిమాపై ఆసక్తి కలిగించింది. రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఆయనే దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతోపాటు ఓ కీలక పాత్రని కూడా పోషించారు. ఈ చిత్రానికి మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లలో విడుదలైందీచిత్రం. మరి ఇన్ని ప్రత్యేకతల మధ్య వచ్చిన ఈ ‘పెళ్లి సందD’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కథ: బాస్కెట్ బాల్ ప్లేయర్ వశిష్ట (రోషన్). తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో ఒక పెళ్ళిలో సహస్ర (శ్రీలీల) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు.. ఆ అమ్మాయి కూడా వశిష్టపై మనసు పడుతుంది. అలా ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ తిరుగుతారు. సరదాగా మొదలైన వీరిద్దరి ప్రేమ కథకు సహస్ర సోదరి (వితిక శేరు) తీసుకున్న నిర్ణయం అడ్డుకట్టగా నిలుస్తుంది. ఆ నిర్ణయం ప్రేమికులు ఇద్దరినీ దూరం చేస్తుంది. తన అక్క జీవితం కోసం తండ్రి (ప్రకాష్ రాజ్)కి ఓ మాట ఇస్తుంది సహస్ర. ఇంతకీ ఆ మాట ఏమిటి? కలిసి బతకాలనుకున్న వశిష్ట… సహస్ర మధ్య బంధం ఏమయ్యింది? ప్రేమికులిద్దరూ ఒకటయ్యారా? తన ప్రేమను, ప్రియురాలిని ఎలా సొంతం చేసుకున్నాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: మాయ (శివాని రాజశేఖర్) అనే ఓ దర్శకురాలు ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీత అయిన వశిష్ట బయోపిక్ తీయాలనుకుంటుంది. ఎవరికీ తెలియని ఆయన గురించి తెలుసుకునేందుకు మాయ తండ్రి (రాజేంద్రప్రసాద్) రంగంలోకి దిగుతాడు. అక్కడినుంచి మొదలవుతుంది ఈ నయా ‘పెళ్లిసందD’. రాఘవేంద్ర రావు – కీరవాణి మార్క్ పాటలు, చిత్రీకరణ తప్ప ఇందులో చెప్పుకోవాల్సిన విషయాలు పెద్దగా కనిపించవు. ఫ్యామిలీ స్టోరీ అనుకున్నప్పుడు ఫ్యామిలీని కట్టిపడేసే బంధాలు అనుబంధాలు తెరపై కనిపించాలి. రొమాంటిక్ స్టోరీ అనుకున్నప్పుడు ప్రధాన జోడీ మధ్య ప్రేమ, రొమాన్స్ పండాలి. అవేం లేవు. ఇదొక కుటుంబ కథా చిత్రమని మొదటి నుంచి చెబుతున్నారు. అయితే ఇందులో కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే భావోద్వేగ సన్నివేశాలు ఎక్కడోగానీ కనిపించలేదు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ఈ చిత్రంలో ఆయన మార్క్ రొమాన్స్ కనిపించలేదు. హీరోహీరోయిన్ల జోడీ కొత్తగా, ప్రెష్‌గా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. తండ్రిలో ఉన్న ఛార్మింగ్ రోషన్‌లోనూ ఉంది. డాన్స్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంది. హీరో శ్రీకాంత్‌కు జనాల్లో ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడి తనయుడు ‘పెళ్లి సందD’ సినిమా చేస్తున్నాడనగానే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే నటనతో మెప్పించి ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు హీరో. హీరోయిన్ శ్రీలీల గ్లామర్‌గా కనిపిస్తూ నటనతోనూ ఆకట్టుకుంది. తెర వెనక ఉండి కథ నడిపించే దర్శకేంద్రుడు తొలిసారి తెరపై కనిపించారు. అయన నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెరపై కనిపించిన సీనియర్ నటీనటులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. వశిష్ట తండ్రి పాత్రలో రావు రమేశ్ నటించాడు. రఘుబాబు తన పాత్రతో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. సాంకేతికంగా విభాగంలో సంగీతం, నృత్య దర్శకత్వం ప్రధాన పాత్ర పోషించింది. ఎడిటింగ్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. అందమైన లొకేషన్లను కెమెరాల్లో బంధించి మంచి విజువల్స్ రాబట్టడంలో కెమెరామన్ కొంత మ్యాజిక్ చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. పెళ్లి అంటే సందడి సందడిగా ఉండాలి.