మాస్ నాడిని పట్టుకోవడం బహుశా .. దర్శకుడు బోయపాటి శ్రీనుకు తెలిసినంత మరే దర్శకుడికి తెలియదేమో.. అనిపిసిస్తుంది ‘అఖండ’ ప్రభంజనం చూస్తూంటే! నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఆయనకు జోడీగా బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ నటించింది. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ ఇతర కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య 2021 డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తాజాగా డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ సత్తా చాటుతూనే ఉంది. అయితే.. ఈ ‘అఖండ’ను హిందీతో పాటు మిగతా భాషల్లో డబ్ చేయనున్నట్టు తెలిసింది.
బాలయ్యకు సంబంధించి గతంలో ఏ సినిమా కూడా డిస్నీ హాట్ స్టార్‌లో సెట్ చేయని రికార్డు ఓటీటీ వేదికగా ‘అఖండ’ క్రియేట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. అంతేకాదు.. ఈ సినిమాను మన భారత్ లోనే ఎక్కువ మంది ప్రేక్షకులు వీక్షించిన సినిమాగా రికార్డులకు ఎక్కడం మామూలు విషయం కాదు.. అసలు విషయానికొస్తే.. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోన్నఈ ‘అఖండ’ చిత్రాన్ని ఇప్పుడు వివిధ భాషల్లోకి డబ్ చేసి రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే తమిళంలో ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ హక్కులు అమ్మేశారు. ఇప్పటికే తమిళ వెర్షన్ డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయని చెబుతున్నారు. మరోవైపు కన్నడ, మలయాళంతో పాటు హిందీ హక్కులు తీసుకున్నవారు ఈ సినిమాను ఆయా భాషల్లో డబ్ చేసి విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ ‘అఖండ’ను ముందుగా హిందీలో రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అఘోరగా బాలయ్య విశ్వరూపం చూసి ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసేకంటే నేరుగా డబ్బింగ్ వెర్షన్ విడుదల చేస్తే బాగుంటుందనే టాక్ అక్కడి ప్రేక్షకుల నుంచి వస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా నార్త్ ఆడియన్స్ ఈ సినిమాను హిందీలో డబ్ చేయమని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమా హిందీ వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం. ఒకవేళ హిందీతో పాటు ఆయా భాషల్లో ‘అఖండ’ డబ్బింగ్ వెర్షన్‌కు మంచి రెస్పాన్స్ వస్తే.. తదుపరి గోపీచంద్ మలినేనితో పాటు చేయబోయే సినిమాను బాలయ్య ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మరి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘అఖండ’ ఇతర భాష ప్రేక్షకులను ఆకట్టుకుంటాడా? లేదా? అన్న మీమాంసలో మేకర్స్ ఉన్నారట. ఈ సినిమా ఓటీటీ వేదికగా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూసిన ఫ్యాన్స్.. వచ్చీ రాగానే మరోసారి డిస్నీ హాట్ స్టార్‌లో ఈ సినిమా చూస్తున్నారు. తాజాగా ‘అఖండ’ మూవీ హాట్ స్టార్ డిస్నీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డులను సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని వాళ్లు అధికారికంగా కూడా ట్వీట్ చేసారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి యూట్యూబ్‌లో విడుదల చేసిన మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ‘అఖండ’ గా ఆ పాత్ర బాలయ్య తప్ప ఇంకే హీరో కూడా చేయలేడంటూ నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కామన్ ఆడియన్స్ కూడా బాలయ్య నటనకు ఫిదా అయిపోయారు. లాజిక్స్ లేకపోయినా కూడా మాస్ మ్యాజిక్ ఈ సినిమాలో బాగానే పని చేసింది. కాంబినేషన్ క్రేజ్ సినిమాకు భారీ లాభాలు తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నెల రోజుల పాటు అఖండ హవా భీభత్సంగా కనిపించింది. ‘పుష్ప’ వచ్చిన తర్వాత కూడా అఖండ జోరు తగ్గలేదు. ఎక్కడ చూసినా కూడా జన జాతర కనిపించింది. అగ్రిమెంట్ కుదుర్చుకున్నపుడే సినిమా విడుదలైన 30 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నారు కానీ సినిమాకు థియేటర్స్‌లో వసూళ్లు బాగా వస్తుండటంతో 30 కాస్తా 50 రోజులు అయింది. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా మరో 10 రోజులు పొడిగించారు. ఈ రోజుల్లో చాలా వరకు సినిమాలకు 30 రోజులు మాత్రమే డెడ్ లైన్ పెడుతున్నారు నిర్మాతలు. అలా చేస్తే వాళ్లకు కూడా ఎక్కువ రేట్ వస్తుంది.