‘వాల్తేరు వీరయ్య’ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాబోతుంది : మాస్ మహారాజా రవితేజ
‘వాల్తేరు వీరయ్య’ గుండెల్లో నాటుకుపోతుంది…పూనకాలు అందరికీ రీచ్ అవుతాయి: దర్శకుడు బాబీ కొల్లి
‘వాల్తేరు వీరయ్య’ ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది : నిర్మాత నవీన్ యెర్నేని
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్ తో పాటు .. ఇద్దరూ కలసి అలరించిన పూనకాలు లోడింగ్ పాటకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన అల్బమ్లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక తాజాగా విడుదలైన వాల్తేరు వీరయ్య ట్రైలర్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ వైజాగ్ లో మెగామాస్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని మాసీవ్ గా నిర్వహించింది. భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానుల సమక్షంలో మాస్ జాతరలా జరిగిన మెగామాస్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. బాబీ వాల్తేరు వీరయ్య అనే టైటిల్ తో కథ చెప్పినపుడు వినగానే అద్భుతం అనిపించింది. షేక్ హ్యాండ్ ఇచ్చి ‘ఈ సినిమా తప్పకుండా చేస్తున్నాం’’ అని అప్పుడే చెప్పాను. ఫస్ట్ హియరింగ్ లోనే చాలా బావుంది అనుకునే కథలు నా కెరీర్ లో సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఆ నమ్మకంతో చెబుతున్నాను.. వాల్తేరు వీరయ్య చాలా బాగా ఆడుతుంది. ఈ సినిమా చేస్తున్నంత కాలం బాబీపై ప్రేమ రోజురోజుకు పెరుగుతూపోయింది. దానికి కారణం తన కష్టపడే తత్త్వం. ఒక అనుభవం తో ఇచ్చిన సూచనని తీసుకొని సినిమా బెటర్ మెంట్ కోసం అహర్నిశలు ప్రయత్నం చేసే దర్శకుడు బాబీ. అందుకే మొదటి రోజు విన్నది తర్వాత రోజురోజుకి అద్భుతంగా రూపాంతరం చెందింది. ప్రతి ఒక్కరిని అలరించే సినిమా వాల్తేరు వీరయ్య. బాబీలో కథకుడు, రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, డైరెక్టర్ కనిపిస్తారు. ఆ తర్వాతే తనలో అభిమానిని చూస్తాను. అభిమాని అని సినిమా ఇవ్వలేదు. అతని ప్రతిభ అద్భుతమనే ఈ సినిమాని ఇచ్చాను. నా నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అనుకున్నదాని కంటే గొప్పగా సినిమాని తీశాడు. ఒక కమర్షియల్ సినిమాలో ఏ ఎలిమెంట్స్ కావాలో అన్నీ చక్కగా పొందుపరిచాడు. వాల్తేరు వీరయ్య ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్. ఇది కదా సినిమా.. ఇలాంటి కమర్షియల్ సినిమా వచ్చి ఎంత కాలం అయ్యిందని ప్రతి ఒక్కరితో అనిపిస్తాడు బాబీ. బాబీ అందించిన ఈ సినిమా నిఖార్సయిన కమర్షియల్ సినిమా. మీ చేత షెబాష్ అనిపించుకునే సినిమా. అందుకే నమ్మకంగా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. బాబీ ఎక్కడా విశ్రాంతి చెందలేదు. ఎక్కడైనా చిన్న గ్రేఏరియా వుంటే తన రైటర్స్ తో కూర్చుని దాన్ని అద్భుతంగా మలచి ఎక్కడా రిలాక్స్ అవ్వకుండా కసితో పని చేశాడు. అందుకే సినిమా అద్భుతంగా వచ్చింది. బాబీ చేసిన హార్డ్ వర్క్ చూసి నేను బాబీ అభిమానిని అయ్యాను. బాబీ నా అభిమాని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. రామానాయడు, అశ్వనీదత్, అల్లుఅరవింద్, కేఎస్ రామారావు లాంటి గొప్ప నిర్మాతల స్థాయిలో నిలబడ్డదగ్గ నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ రవిగారు, నవీన్ గారు, చెర్రీ. ఏనాడూ లెక్కలు చూసుకోలేదు. ఎక్కడా రాజీపడలేదు, సినిమాకి కావాల్సిన సమస్తం సమకూర్చారు. సినిమాలో మొదటి ఇరవై నిమిషాల్లో హాలీవుడ్ స్థాయి ఎపిసోడ్స్ వుంటాయి. అవి తెరపై చూస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ కి సినిమా అంటే ప్యాషన్. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. ఇలాంటి నిర్మాతలని నిలబెట్టుకోవడం మన ఇండస్ట్రీ బాధ్యత. ఇన్నేళ పరిశ్రమలో ఒకే నిర్మాత రెండు భారీ చిత్రాలు ఒకేసారి విడుదల చేయడం ఎప్పుడూ జరగలేదు. ఇది ఫస్ట్ టైం జరిగింది. దీనికి కారణం కథలపై వారికుండే నమ్మకం. ప్రేక్షకులు రెండు సినిమాలని ఆదరిస్తారనే నమ్మకం. మైత్రీ మూవీ మేకర్స్ సంక్రాంతి రిలీజ్ చేయబోయే రెండు సినిమాలు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య పెద్ద విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. రవితేజ ఆజ్ కా గుండా రాజ్ సినిమాలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ తో నాకు పరిచయమయ్యాడు. తర్వాత అన్నయ్య సినిమా కలిసి చేశాం. అన్నయ్య నుండి అలా ఎదిగి ఈ రోజు మాస్ మహారాజ్ అయ్యాడు. తనకంటూ ఒక ముద్రవేసుకున్నాడు. వాల్తేరు వీరయ్య లో మా పాత్రలు చాలా ఆసక్తికరంగా వుంటాయి. రవితేజ ఎంట్రీ తర్వాత సినిమా మరో స్థాయికి వెళుతుంది. ఈ పాత్రకు రవితేజ తప్పితే మరో నటుడు న్యాయం చేయలేడు. తను రావడం వలనే పాత్రకు న్యాయం జరిగింది. శ్రుతి హాసన్ చాలా చక్కగా చేసింది. తన పాత్రకు చాలా ప్రాధన్యత వుంటుంది. కేథరిన్ ఇందులో కీలకమైన పాత్ర. చాలా చక్కగా తన పాత్రని పోషించింది. ఊర్వశి రౌతేలా బాస్ పార్టీ సాంగ్ ని చాలా ఎనర్జిటిక్ గా చేసింది. ప్రకాష్ రాజ్, బాబీ సింహా చాలా అద్భుతంగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ గారి పాత్రలో చాలా డెప్త్ వుంటుంది. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శకలక శంకర్ అందరూ చక్కగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ మా ఇంట్లో కుర్రాడు. ఈ రోజు నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం ఆనందంగా వుంది. ఇందులో ప్రతి సాంగ్ కి ప్రాణం పెట్టి మరో స్థాయికి తీసుకెళ్ళాడు. అద్భుతమైన నేపధ్య సంగీతం చేశాడు. సినిమా ఒక మ్యూజికల్ జర్నీలా వుంటుంది. అర్ధర్ విలన్స్ వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో వుంటాయి. శేఖర్ మాస్టర్ నాతో మళ్ళీ వింటేజ్ స్టయిల్ లో చాలా చక్కగా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. డ్యాన్సులు చాలా గ్రేస్ ఫుల్ గా చేయించారు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ అద్భుతమైన సెట్ వర్క్ చేశారు. వాల్తేరు వీరయ్యలో ప్రతి పది నిమిషాలకు ఒక హై వుంటుంది. ప్రతి సీన్ అనూహ్యంగా వుంటుంది. థ్రిల్ ఇచ్చే విధంగా వుంటాయి. వావ్..అంటూ ప్రతిది సీట్ ఎడ్జ్ లో చూస్తారు. దానికి కారణం రచయితలు కోనవెంకట్, మోహన్, చక్రి, వినీత్. బాబీ అందరినుండి మంచి వర్క్ ని రాబట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత బాబీ స్టార్ డైరెక్టర్ అవ్వడం అనేది ఎంతో దూరంలో లేదు. ఈ సినిమా కోసం అందరూ కలసి కట్టుగా పని చేశాం. వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్ అవ్వాలనే ఒకేఒక లక్ష్యంతో పని చేశాం. 13వ తేదిన పూనకాలు లోడింగ్. డోంట్ స్టాప్ సీయింగ్. గో ఆన్ సీయింగ్. లవ్ యూ ఆల్ ’’ అన్నారు .
మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య నటీనటులకు, సాంకేతిక నిపుణలందరికీ ఆల్ ది బెస్ట్ కాదు.. కంగ్రాట్స్. ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్. పూనకాలు లోడింగ్. చిరంజీవి గారితో నా జర్నీ మొదలైయింది విజయవాడ నుండి. విజేత వేడుక విజయవాడ లో జరిగినప్పుడు .. చిరంజీవి గారిని చాలా దూరం నుండి చూశాను. అప్పుడే మా ఫ్రండ్స్ తో ఏదో ఒక రోజు .. ఆయన పక్కన కూర్చుంటానని చెప్పాను. అక్కడ నుండి మొదలైతే మొదట ఫ్రండ్ క్యారెక్టర్, తర్వాత తమ్ముడి క్యారెక్టర్.. ఇప్పుడు వాల్తేరు వీరయ్య. చిరంజీవి గారితో వున్న ప్రతి మూమెంట్ చాలా గర్వంగా వుంటుంది. ఆయన నన్ను ఎంతో ఇష్టపడతారు ప్రేమిస్తారు. అన్నయ్య ఎవరేమన్నా భరిస్తారు.. బాధపడతారేమో కానీ బయటపడరు. ఆయనలో వున్న గొప్ప లక్షణం అది. ఆయన ఎప్పుడూ ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు. బాబీ బలుపు సమయంలో పరిచయమయ్యాడు. పవర్ తీశాడు. వీరయ్యతో నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడని నా గట్టి నమ్మకం. దేవిశ్రీ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం’’ అన్నారు.
దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయడం నా జీవితంలో చాలా స్పెషల్ మూమెంట్.అన్నయ్యని ప్రేమించే వారు డైరెక్టర్ అయితే రిజల్ట్ ఇలానే వుంటుంది. హార్ట్ అండ్ సోల్ అన్నీ కలిపి ప్రేమించి ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఆన్నయ్యపై వున్న మా ప్రేమని రిఫ్లక్ట్ చేశాం. చిరంజీవి గారి అభిమానులుగా పుట్టడం మేము చేసుకున్న అదృష్టం. అన్నయ్య లాంటి వారు కుటుంబానికి ఒకరు వుండాలి. కోట్లాది మంది అభిమానులు బ్రహ్మరధం పడుతున్నారంటే కారణం అన్నయ్య మనసు. నిద్రలో కూడా సినిమాని ప్రేమించాలి.. రెండేళ్ళ ప్రయాణం లో ఆయన నుండి నేర్చుకున్న విషయం ఇది. 2003లో విజయవాడ గుంటూరు కి మధ్య ఇంద్ర వేడుక జరిగింది. అక్కడికి వచ్చిన కోట్లాది మందిలో నేను ఒకడిని. అప్పుడే మా నాన్నకి మాటిచ్చా. ఎప్పుడైనా చిరంజీవి గారితో సినిమా చేస్తానని. ముఫ్ఫై తొమ్మిదేళ్ళు వచ్చేసరికి మెగాస్టార్ సినిమాకి దర్శకుడిని అయ్యాను. ఇంతకంటే ఏం కావాలి. ఇది మా నాన్నగారు పై నుండి చూస్తున్నారు. ఇండస్ట్రీకి ఒకే ఒక మెగాస్టార్. అన్నయ్య పై వున్న ప్రేమని ఇందులో చూపించాం. ఇలాంటి కథకు మాకు కావాల్సిన శక్తి మాస్ మహారాజా రవితేజ గారు. చిరంజీవి గారు, రవితేజ గారు ఇద్దరూ స్వయంకృషి తో వచ్చిన గ్రేట్ స్టార్స్. ఇందులో రవితేజ గారిని తీసుకోవడం గొప్ప ఛాయిస్ అని కాలర్ ఎత్తుకొని వెళ్తారు మాస్ మహారాజా అభిమానులు. చిరంజీవి గారు రవితేజ గారి కాంబినేషన్ కి నేను న్యాయం చేశానని నమ్ముతున్నాను. నా రచయితలు వినీత్, మోహన్ కృష్ణ లతో రెండేళ్ళ క్రితం ఈ సినిమా ప్రయాణం మొదలైయింది. వారి సపోర్ట్ ని మర్చిపోలేను. మా గురువు గారు కోన వెంకట్, చక్రి ప్రాణం పెట్టి పనిచేశారు. వాల్తేరు వీరయ్యకి ఎన్నో సక్సెస్ మీట్లు వుంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ తో పని చేయాలని కోరుకున్నాను. నేను అనుకున్న సినిమాని నాతో తీయించారు. నవీన్ గారు, రవి గారు , చెర్రి గారికి కృతజ్ఞతలు. దేవిశ్రీ ప్రసాద్ గారు బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. శేఖర్ మాస్టర్ అన్నీ పాటలకి అద్భుతమైన క్రోయోగ్రఫీ చేశారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్స్ గా వుంటాయి. ఇంటర్ వెల్ కి పది నిమషాల ముందు అరాచకం ఆరంభం అన్నట్లుగా వుంటుంది. పూనకాలు లోడింగ్ మా ఇంటర్వెల్ కార్డ్. ప్రకాష్ గారు వండర్ ఫుల్ సెట్స్ వేశారు. అర్ధర్ విలన్స్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కెమరామెన్ అవుతారు. ఎడిటర్స్ నిరంజన్, చోటా , లిరిక్స్ రైటర్స్ చంద్రబోస్ , రామజోగయ్య శాస్త్రి గారి కి కృతజ్ఞతలు. డైలాగ్ రైటర్స్ భాను నందులకి థాంక్స్. ప్రకాష్ రాజ్ గారు అద్భుతంగా చేశారు. బాబీ సింహా గారు కూడా అన్నయ్యకి ఫ్యాన్. చాలా చక్కగా చేశారు.