పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీలో చాలామంది ఆర్టిస్టులు కనిపించారు. వారిలో రెండు కీలక సన్నివేశాల్లో నటించిన నటుడు ఎవరా అని చాలామంది ఆరా తీస్తున్నారు. ఒక సీన్‌లో డానియల్ శేఖర్ అడవిలో మేకలు కాచుకుంటున్న గడ్డం మనిషి దగ్గరకొచ్చి భీమ్లా నాయక్‌ను ‘కొక్కిరి దేవర’గా గిరిజనం ఎందుకు కొలుస్తున్నారని అడుగుతాడు. అప్పుడు ఆ గడ్డం మనిషి ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను డానియల్‌కు చెప్తాడు. ఒక ఫారెస్ట్ కాంట్రాక్టర్ (అజయ్) దౌర్జన్యాలు చేస్తూ, గిరిజన ఆడపిల్లలను చెరబడుతూ అతి కిరాతకంగా ప్రవర్తిస్తుంటే, అప్పుడే అక్కడకు వచ్చిన భీమ్లా ఆ కాంట్రాక్టర్‌నీ, అతని గ్యాంగ్‌నీ ఊచకోత కోసి, అతను చెరబట్టిన ముగ్గురు అమ్మాయిలను విడిపించే వైనాన్ని వివరిస్తాడు. అప్పట్నుంచీ ఆయనను తామంతా కొక్కిరి దేవరగా కొలుస్తున్నామని చెప్తాడు.
ఆ తర్వాత క్లైమాక్స్‌లో డానియల్‌తో జరిగిన ద్వంద్వ యుద్ధంలో భీమ్లా పడిపోతే, అతడిని తిరిగి మేల్కొలిపే వ్యక్తిగా గడ్డం మనిషి కీలక పాత్ర వహించాడు. ఆ నటుని పేరు ఎం.ఎస్. చౌదరి. పూర్తిపేరు మాదల మధుసూదన చౌదరి. రెండే రెండు కీలక సీన్లతో ఆయన అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు. ప్రధానంగా రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత అయిన ఆయన నాటకాల్లో 17 నంది అవార్డులను అందుకున్నాడంటే ఆయన ప్రతిభాపాటవాలు ఏమిటో అర్థమవుతుంది. ఇంతదాకా ఆయన 30 వరకు సినిమాల్లో నటించారు. వాటిలో కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ 100వ చిత్రం ‘మహాత్మ’లో చేసిన యంగ్ విలన్ (జయప్రకాశ్‌రెడ్డి కొడుకుగా), తేజ డైరెక్ట్ చేసిన ‘నీకు నాకు డాష్ డాష్’లో మెయిన్ విలన్ క్యారెక్టర్లు మంచి పేరు తెచ్చాయి.
పవన్ కల్యాణ్‌తో ఎం.ఎస్. చౌదరికి ‘భీమ్లా నాయక్’ తొలి సినిమా కాదు. ఇదివరకు ‘గబ్బర్‌సింగ్’, ‘అజ్ఞాతవాసి’ సినిమాల్లోనూ ఆయన నటించారు. ‘భీమ్లా నాయక్’లో గడ్డం మనిషి క్యారెక్టర్‌కు చౌదరి అయితే కరెక్టుగా ఉంటుందని త్రివిక్రమ్‌కు సూచించింది స్వయంగా పవన్ కల్యాణే. వెంటనే ‘అజ్ఞాతవాసి’లో ఆయన నటించిన విషయం త్రివిక్రమ్‌కు కూడా గుర్తుకొచ్చింది. అలా ఎం.ఎస్. చౌదరి ‘భీమ్లా నాయక్’లో చిన్న పాత్రే అయినా, కీలక సన్నివేశాల్లో వచ్చే పాత్రను చక్కగా పోషించి మెప్పించారు. త్వరలో ఆయన ప్రధాన పాత్ర చేసిన ‘జెట్టీ’ అనే తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం విడుదల కానున్నది.