నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ క్యాప్షన్. వశిష్ట్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 5న ఈ మూవీ గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. స్టార్ హీరో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో..
స్టార్ హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ‘‘రెండేళ్ల క్రితం కళ్యాణ్ అన్న ఫోన్ చేసి.. చాలా ఇంట్రెస్టింగ్ కథ విన్నాను.. నువ్ ఒకసారి వింటే బాగుంటుందని అని అన్నారు. ఇప్పుడు వశిష్ట అంటున్నారు.. అంతకు ముందే వేణు అనేవాళ్లు. నాకు కూడా తనని వేణు అని పిలిస్తే బావుంటుంది. ఆ రోజు ఒక ఐడియాగా బింబిసార కథ చెప్పడం జరిగింది. ఆ రోజు మొదలైన భయం.. ఎక్స్‌పీరియన్స్ లేదు.. ఇంత పెద్ద చిత్రాన్ని హ్యాండిల్ చేయగలిగుతాడా? లేడా? అనే భయం. ఎంత కసిగా కథను చెప్పాడో.. అంత కంటే గొప్పగా ఈ చిత్రాన్ని మలిచాడు. ఇదేం చిన్న విషయం కాదు.
మీ అందరి కంటే నేను అదృష్టవంతుడిని. ఎందుకంటే ఈ సినిమాను నేను ముందుగానే చూశాను. కథ, కథనం తెలుసు. కథలో ఏం జరగబోతుందో కూడా తెలుసు. ఇంత తెలిసినా కూడా నేను సినిమా చూసేటప్పుడు ఎంతో ఎగ్జైట్ అయ్యాను. మీరంతా కూడా ఆ ఎగ్జైట్మెంట్‌కు గురవుతారు. నమ్మినట్టుగా కథను మల్చడం మామూలు విషయం కాదు. తొలి సినిమానే ఇంత గొప్పగా తెరకెక్కించాడంటే.. ఇకపై తను ఎంత గొప్ప చిత్రాలను చేయగలడో అని చెప్పడానికి ఇదొక టీజర్‌లాంటిది. తన భవిష్యత్తుకి ఇది టీజరే కాదు.. తన జీవితానికి ట్రైలర్ వంటిది. చోటా అన్నతో ఎన్నో సినిమాలు కలిసి చేశాం. ఎన్నో గొప్ప సినిమాలు ఆయన చేశాడు. బింబిసారకు కొత్త చోటా కనిపించారు. ఎంతో ఊపిరి పోశాడు. రేపు సినిమా థియేటర్స్‌లో మీకు ఆ ఎక్స్‌పీరియెన్స్ కలుగుతుంది. చోటా నాయుడుగారు ఓ పిల్లర్‌గా నిలిచాడు.
ఈ సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఆడియెన్స్ నుంచి వచ్చిన డిమాండ్‌కు తగ్గట్టుగా రాకపోతే సినిమాలు చూడటం లేదు. ఆడియెన్స్ మెచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించేందుకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. బింబిసార సినిమా గురించి మాట్లాడినప్పుడు మాకు ఓ వెలితి అనిపించేది. అదే కీరవాణి గారి సంగీతం. బింబిసార ఎప్పుడు విడుదలవుతందనే భయం లేదు.. ఎప్పుడు విడుదలవెతుందా? అనే ఎగ్టయిట్‌మెంట్ ఉంది.. దానికి కారణం కీరవాణిగారు. ఆయన కొత్త పాటలు, కొత్త బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఆయనే మా బింబిసారకు బ్యాక్ బోన్. ఆయన బాధ్యత తీసుకోవడంతో మా కాన్ఫిడెన్స్ పెంచారు.
నేను ఇదే స్టేజ్ మీద.. నేను ఎప్పుడో ఒక మాట అన్నాను.. మీకు నచ్చేవరకు సినిమాలు చేస్తాం.. నచ్చక పోతే ఇంకోటి ఇంకోటి.. చేస్తామని చెప్పాను. బింబిసార సినిమా చూశాక నందమూరి కళ్యాణ్ రామ్ కాలర్ ఇంకా పైకి ఎత్తుతారు. అది మీరు చూస్తారు. కళ్యాణ్ అన్న కెరీర్.. బింబిసారకు ముందు.. బింబిసారకు తరువాత అవుతుంది. ప్రతి సినిమాకు ఓతమ్ముడిగా ఆయన ఎంత కష్టపడతారో నాకు తెలుసు. రక్తం ధార పోసి.. ఎంతో కష్టపడ్డారు. కళ్యాణ్ రామ్ తప్పా ఆ పాత్రకు ఇంకెవ్వరూ న్యాయం చేయలేరు. అలాంటి నటుడు ఉండడు కూడా.
థియేటర్లకు జనాలు రావడం లేదని అంటున్నారు. కానీ నేను నమ్మను. మంచి సినిమా వస్తే ఆదరించే తెలుగు ప్రేక్షక దేవుళ్లు మీరు. బింబిసారను ఆదరిస్తారని, సీతారామం సినిమా కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీకి తెలుగు ప్రేక్షకులు ఓ ఊపు ఇవ్వాలని, ఇంకా చల్లగా మీ అందరినీ అలరించాలని కోరుకుంటున్నాను. వర్షాకాలాలు,కంగారు పడకండి.. జాగ్రత్తగా మీ ఇళ్లకు చేరాలి.. మీ కోసం తల్లిదండ్రులు, పిల్లాపాపలు, భార్యలు ఎదురుచూస్తుంటారు. నా కంటూ కళ్యాణ్ అన్నకంటూ ఆస్తిపాస్తులొద్దు.. మీరుంటే చాలు.. మా తాతగారు, నాన్నగారు వదిలిపోయిన అభిమానులు మీరు..మీకు రుణపడే ఉంటాం. మీరు ఆనందంగా ఉంచేందుకు మేం ప్రయత్నిస్తుంటాం. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి..జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ’’ అన్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘‘మన అందరికీ చందమామ కథలు, అమరచిత్ర కథలు, జాన పద చిత్రాలంటే ఇష్టం. వాటిని మొదలు పెట్టింది మా తాత గారు. బాబాయ్ భైరవ ద్వీపం, చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలు మన ముందుకు వచ్చాయి. అదే పంథాలో మీ ముందుకు మంచి సోషియో ఫాంటసీ సినిమా తీసుకు రావాలనే మా ప్రయత్నమే ఈ బింబిసార. ఆగస్ట్ 5న మీ ముందుకు రాబోతుంది. తప్పకుండా థియేటర్‌లో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మిమ్మల్ని కచ్చితంగా ఈ సారి మిమ్మల్ని నిరాశపర్చను. సినిమా చూశాక మీరు గర్వపడతారు. 200 శాతం శాటిస్పై అవుతారు. ఎందుకంటే ఇది మా తాత గారి వందో జయంతి. తెలుగు సినిమాకు మూల కారకుడైన ఆయనకు ఈ సినిమాను అంకితం చేస్తున్నాను. సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఎంతో కష్టపడి పని చేశారు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ఎడిటర్ తమ్మిరాజు, వీఎఫ్ఎక్స్ అద్వితా, అనిల్ పాడూరి అందరికీ థాంక్స్. మీరు లేకపోయి ఉంటే.. ఆ విజువల్స్ వచ్చి ఉండేవి కావు. వెంకట్, రామకృష్ణ ఫైట్ మాస్టర్లకు థాంక్స్. శోభి, యష్, విజయ్, రఘు మాస్టర్లకు థాంక్స్. మాటలు రాసిన వాసుదేవ్‌కు థాంక్స్. మా పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి వచ్చి రైటర్ అయ్యారు. టీజర్ కట్ చేసిన సంతోష్‌కి థాంక్స్. చోటా గారికి థాంక్స్. ట్రైలర్ చూశారు కదా? టాలెంట్ అంతా వశిష్టదే. ఈ సినిమాకు లైఫ్ ఇచ్చింది కీరవాణి గారు. ఈ రోజు బింబిసారుడి కర్త కర్మ క్రియ ఒకే ఒక వ్యక్తి మా హరిబాబు. హరి లేకపోయి ఉంటే.. ఇంత వరకు వచ్చేవాళ్లం కాదు. ఇంత పెద్ద సినిమాను మాకు ఇచ్చినందుకు రుణపడి ఉంటాను. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చిన నా తమ్ముడికి థాంక్స్ చెప్పను. లవ్యూ నాన్న.. అదే మన రిలేషన్. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి.. వర్షాలు పడుతున్నాయి.. ఇంకా జాగ్రత్తగా వెళ్లండి.. ఆగస్ట్ 5న థియేటర్లోకి రాబోతోంది. అందరూ చూడండి’’ అని అన్నారు.
డైరెక్టర్ వశిష్ఠ్ మాట్లాడుతూ ‘‘బింబిసార సినిమా విషయంలో మా నిర్మాత హరిగారికి, హీరో కళ్యాణ్ రామ్‌గారికి థాంక్స్. వారే బ్యాక్ బోన్‌గా నిలబడ్డారు. వారి సాయాన్ని ఎప్పటికీ మరచిపోలేను. డైలాగ్ రైటర్ వాసు, ఫైట్ మాస్టర్ రామకృష్ణ, అనిల్, శివగారు, కిరణ్‌గారు, కీరవాణిగారు, తమ్మిరాజుగారు, సంతోష్, ఛోటాగారికి థాంక్స్. వరికుప్పల యాదగిరి, చిరంతన్ భట్‌గారికి థాంక్స్. కీరవాణిగారు మా సినిమాకు ప్రాణం పోశారు’’ అన్నారు.
ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ ‘‘నందమూరి అభిమానుల ఎనర్జీకి తగ్గట్టే బింబిసార ఉంటుంది. ఇంతకు ముందు మీకు కనిపించిన బింబిసార వేరు.. బింబిసారలో కళ్యాణ్ రామ్ వేరు. చింపి పడేశాడు. ఆగస్ట్ 5న కళ్యాణ్ రామ్ తన పెర్ఫా మెన్స్‌తో తొక్కి పడేశాడు. తొలిసారి కళ్యాణ్ రామ్‌తో చేశాను. సినిమా కోసం కళ్యాణ్ చాలా కష్టపడ్డాడు. కొత్త డైరెక్టర్.. ఎలా ఉండాలో వశిష్ట్‌ను చూసి నేర్చుకోవాలి. క్యాథిరిన్, సంయుక్త మీనన్ అద్భుతంగా నటించారు. ఫైట్స్‌ను రామకృష్ణ అద్భుతమైన ఫైట్స్‌తో డిజైన్ చేశారు. ఇక అనిల్ ఫెంటాస్టిక్ గ్రాఫిక్స్ చేశారు. ఆగస్ట్ 5న రిలీజ్ తర్వాత మళ్లీ మాట్లాడుతాను’’ అన్నారు.
క్యాథరిన్ మాట్లాడుతూ ‘‘బింబిసార సినిమా నటిగా నాకెంతో ఇంపార్టెంట్ మూవీ. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో ఎప్పటి నుంచో పనిచేయాలని అనుకుంటున్నాను. బింబిసారతో కుదిరింది. వశిష్ట్‌కు థాంక్స్. ఐరా అనే మంచి పాత్రను నాకు ఇచ్చినందుకు థాంక్స్. వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. వండర్‌ఫుల్ కో స్టార్స్‌తో వర్క్ చేశాను. కళ్యాణ్ రామ్‌గారు కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అమేజింగ్ రోల్ చేశాడు. సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశాడు. తన హార్డ్ వర్క్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. కళ్యాణ్‌గారితో కలిసి పనిచేయటం చాలా సంతోషానిచ్చింది. ఛోటాగారితో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ సూపర్బ్. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు సూపర్బ్ వర్క్ చేశారు. యూనిక్ మూవీ. కచ్చితంగా సిల్వర్ స్క్రీన్‌పై సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
సంయుక్తా మీనన్ మాట్లాడుతూ ‘‘తెలుగులో నేను సైన్ చేసిన తొలి చిత్రం బింబిసార. చాలా ఇంపార్టెంట్ మూవీ. చాలా ఇంపార్టెంట్ పాత్ర చేశాను. కళ్యాణ్ రామ్‌గారికి, వశిష్ట్‌గారికి థాంక్స్. కళ్యాణ్‌గారు చాలా మంచి కోస్టార్. థియేటర్‌లో బింబిసార విజువల్ ఫీస్ట్‌గా ఉంటుంది’’ అన్నారు.
వరికుప్పల యాదగిరి మాట్లాడుతూ ‘‘నేను ఇండస్ట్రీలో వచ్చిన ఇన్నేళ్ల తర్వాత అంటే పాతికేళ్ల తర్వాత మ్యూజిక్ డైరెక్టర్‌గా నా పేరు పడింది. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన కళ్యాణ్ రామ్‌గారికి థాంక్స్’’ అన్నారు.
శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ‘‘అఖండ సినిమాలో చిన్న పాపతో బాలయ్య బాబు నటించాడు. అది సూపర్ హిట్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ చిన్న పాపతో నటిస్తే బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాలోనూ కళ్యాణ్ రామ్‌గారు కూడా చిన్న పాపతో నటించారు. ఇది కూడా సూపర్ హిట్టే. వశిష్టగారు జుబేదా అనే క్యారెక్టర్ ఇచ్చారు. ఇక ఛోటాలాంటి టెక్నీషియన్ ఉంటే సినిమాను దడదడలాడించాడు. కళ్యాణ్ రామ్‌గారి పక్కన్న జుబేదా క్యారెక్టర్లో నటించటం చాలా హ్యాపీ. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు.
చమ్మక్ చంద్ర మాట్లాడుతూ ‘‘ఇప్పటికే బింబిసార్ ట్రైలర్, పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పటికే ఓ ఊపు ఊపేశాయి. సినిమాలో నేను చిన్న పాత్ర చేశాను. ఆగస్ట్ 5న సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్స్‌లో సినిమాను చూసి ఆదరించాలి. కళ్యాణ్ రామ్ గారితో కలిసి నటించిన రెండో చిత్రమిది. ఎంటైర్ టీమ్‌కి అభినందనలు’’ అన్నారు.
వైవా హర్ష మాట్లాడుతూ ‘‘నందమూరి కళ్యాణ్ రామ్‌గారితో పని చేయటం వల్ల సినిమాను ఎంత బెస్ట్‌గా చేయాలని నేర్చుకోవటమే కాదు. క్రమశిక్షణ కూడా నేర్చుకున్నాను. మంచి సినిమాలో నటించిన అవకాశం కల్పించిన కళ్యాణ్ రామ్‌గారు సహా అందరికీ థాంక్స్’’ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వరికుప్పల యాదగిరి, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్, శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.