తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది అగ్ర కథానాయిక సమంత. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ‘ఫ్యామిలీమెన్-2’ సిరీస్ ద్వారా బాలీవుడ్‌లో సత్తా చాటింది. ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి చేసిన ఈ బ్యూటీ ‘యశోద’ సినిమా కూడా చేస్తోంది. మరోవైపు శివనిర్వాణ-విజయ్ దేవరకొండ లవ్ స్టోరీ ఖుషీలోనూ నటిస్తోంది. దీంతోపాటు హిందీలో వరుణ్ ధావన్‌తో కలిసి వెబ్ ప్రాజెక్టు చేస్తోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీ ప్రాజెక్టుల పై ఎక్కువ ఫోకస్ పెట్టిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే.. దక్షిణాది ప్రేక్షకులందరికీ సుపరిచితురాలైన ఈ భామ ఇప్పటివరకు మలయాళ సినిమాలో మాత్రం నటించలేదు. తాజా సమాచారం ప్రకారం సమంత మలయాళ అరంగేట్రానికి రంగం సిద్ధమైందని తెలిసింది. మలయాళంలో సీనియర్ దర్శకుడైన షాజీ కైలాస్ ‘పింక్ పోలీస్’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. మహిళా ప్రధాన కథాంశమిది. ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించనుందని తెలుస్తున్నది. ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని..కథతో పాటు తన పాత్రలోని వైవిధ్యం నచ్చడంతో ఆమె ఈ సినిమాకు అంగీకరించిందని అంటున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది చివరలో షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నారని సమాచారం. ఇదిలా ఉండగా హైదరాబాద్ కంటే ఎక్కువగా ముంబైలోనే స్టే చేస్తున్న సమంత తాజాగా బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో కలిసి దిగిన స్టిల్‌ను షేర్ చేయగా..నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. అంతేకాదు రణ్ వీర్ సింగ్ స్వీటెస్ట్ యాక్టర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తింది. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందంటూ వార్తలు ఊపందుకున్నాయి. సామ్-రణ్ వీర్ సింగ్ సినిమా చేయబోతున్నారా..? అదేం లేదని..వీరిద్దరూ ఓ యాడ్ ఫిల్మ్ షూట్ కోసం ఇలా కనిపిస్తున్నారని అంటున్నారు కొందరు. మొత్తానికి ఓ వైపు తెలుగులో సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌లో కూడా పాగా వేయాలనుకుంటున్న సామ్ కమిట్‌మెంట్‌కు ఫిదా అయిపోతున్నారు ఆమె అభిమానులు, ఫాలోవర్లు. రాబోయే కాలంలో సామ్ నుంచి మరిన్ని బాలీవుడ్ సినిమా అప్ డేట్స్ రావడం మాత్రం పక్కా సమాచారం.
బాలీవుడ్ పై సమంత ఫోకస్!
