తరచుగా అతడిని వరిస్తుంటాయి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలు, విశిష్ట వ్యక్తుల పేరుతో ఏర్పాటైన సమున్నత పురస్కారాలు! అతడు బహుముఖ సృజనాత్మక ప్రతిభాశాలి బొంగు నరసింగరావు! బి. నరసింగరావుగా విఖ్యాతుడైన అతని నిరుపమాన జీవనయాత్ర తెలిసిన వారికి ఈ పురస్కారాల వెల్లువలు ఎంతమాత్రమూ ఆశ్చర్యం కలిగించవు. థియేటర్, సినిమా, సంగీతం, సాహిత్యం, చిత్రకళ, శిల్పకళ, ఫోటోగ్రఫీ, జానపద సాహిత్యం, మానవ పరిణామ శాస్త్రం, జాతి జనుల జీవన స్రవంతి వంటి అనేక రంగాలలో ఆయన సాధించిన అత్యున్నత ప్రతిభకు ఈ ప్రామాణిక పురస్కారాలు ప్రతీకలు. కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో దాదాపు అన్ని రంగాల్లో ఆయన నెలకొల్పిన సాధికారతకు నిదర్శనం; తనకు లభించిన పది జాతీయ అవార్డులు, తొమ్మిది రాష్ట్ర అవార్డులు, అసంఖ్యాక అంతర్జాతీయ అవార్డులు. తెలంగాణ సాంస్కృతిక వైభవం, తెలంగాణ ప్రజలు, సమ్మోహన పరిచే జానపదుల కళలు, తన మదిలో, ఎదలో, రక్తనాళాల స్పందనలలో నవనవోన్మితంగా చివురులు వేస్తుంటాయి.
కోవిడ్ -19 మహమ్మారి మానవాళిని కృశింపచేసిన గత రెండేళ్లలోనూ బి. నరసింగరావు అంతఃచేతన లలితకళా ప్రపంచంలో సౌరభాలు ప్రసరించినది. ఇందుకు ముగ్ధులైన వివిధ అంతార్జాతీయ వేదికలు, సంస్థలు అరుదైన పురస్కారాలతో గౌరవించాయి. తనలోని బహుముఖ కళాకారుని సృజనను 2021వ సంవత్సరంలో ‘ద ఎలైట్ ఫెడరేషన్ ఆఫ్ వరల్డ్ కల్చరల్ అండ్ ఆర్ట్ సొసైటీ సింగపూర్ (FOWCASS) గుర్తించి ‘ఇంటర్నేషనల్ మల్టీ కల్చరల్ డిస్టింగిష్డ్ హానరరీ అడ్వైసర్’ గా ఎంపిక చేసింది. ఇది నిశ్చయంగా అరుదైన గౌరవం. బహుళ సంస్కృతులను ఆకళింపు చేసుకున్నఅంతర్జాతీయ ప్రముఖులతో ఏర్పాటైన ఆ సంస్థకు 160 దేశాలలో సభ్యులున్నారు. వీరు తమ సంస్థకు గౌరవ సలహాదారులుగా నియమించుకున్నది కేవలం 12 మందిని మాత్రమే! బి. నరసింగరావు అనే మనిషి చెట్టు తెలంగాణ నేలలో వేర్లు పాదుకుని తన కళాత్మక కొమ్మలతో విశ్వసంస్కృతులను ఆలింగనం చేసుకున్నాడు. ఈ సమగ్ర వ్యక్తిత్వం ప్రపంచ మేధోహృదయాలను విస్మయపరచిందని ఈ నియామకం వెల్లడించింది.
మొరాకో, ఫిలిప్పైన్ దేశాలు బి. నరసింగరావుకు డాక్టరేట్లు ప్రదానం చేశాయి. సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్ దేశాలు సత్కరించాయి. విమేన్ అఫ్ హార్ట్స్, లండన్ సంస్థ ‘ఎ జెంటిల్ మాన్ విత్ ఎ హార్ట్’ అవార్డును అర్పించింది. కజకిస్తాన్, వెనిజులా దేశాలు తమ దేశాల అత్యున్నత పురస్కారాలు ప్రదానం చేశాయి. మొరాకో దేశం ‘మానవ హక్కులను పరిరక్షించిన వ్యక్తిగా సత్కరించి, సాంస్కృతిక మానవీయ రంగాలలో సృజనశీలునిగా అభివర్ణించి ‘మొరాకన్ స్టార్’ అనే ప్రతిష్టాత్మక పౌర పౌర పురస్కారంతో సత్కరించింది.
దాదాపు అన్ని అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ నుంచి బి. నరసింగరావుకు ప్రత్యేక ప్రశంసలు లభించాయి. ఒక ఫిలిం మేకర్ గా సామాజిక సమస్యల వాస్తవికతలను తనదైన సునిశిత దృక్కోణంలో కొన్ని చారిత్రక దశలను కాల గర్భంలో కలసిపోకుండా మా భూమి, రంగుల కల వంటి చిత్రాల ద్వారా పదిలపరచారు. బి. నరసింగరావు తప్ప మరెవరూ వెండితెరపై ఆవిష్కరించలేని రాతి గుండెలను సైతం కరిగించే సామాజిక విషాద గీతం ‘దాసి’. భూస్వామ్య వ్యవస్థలోని కర్కశత్వానికి బలైన స్త్రీల దురవస్థను సినిమా భాషలో అనన్యంగా చూపిన చిత్రంగా మాస్కో ఫిలిం ఫెస్టివల్ అభివర్ణించిన ఈ చిత్రానికి మరే తెలుగు చిత్రానికీ రానన్ని జాతీయ అవార్డులు లభించడం గమనార్హం. శ్రామిక చీమల్లా నగరాన్ని నిర్మించే వైనాన్ని ‘మట్టిమనుషులు’ ద్వారా చూపారు. ‘హరివిల్లు’ బాలల మనోలోకాలను, పెద్దల అనవగాహనాలను చూపే మనోవైజ్ఞానిక మనోజ్ఞ దృశ్య కావ్యం.
తెలుగు సినిమా వజ్రోత్సవాల సందర్భంగా 2007 వ సంవత్సరంలో బి. నరసింగరావును సినీపరిశ్రమ ఎక్సలెన్స్ అవార్డు’ ను బహూకరించింది. నిరంతర నిబద్ధతతో ప్రజ్ఞతో భారతీయ చిత్ర రంగానికి వన్నె తెచ్చిన వ్యక్తిగా ఇండీవుడ్ ఎక్సలెన్స్ అవార్డులను ఎంపిక చేసే భారతీయ చిత్ర పరిశ్రమ ‘లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డు – 2017 ‘ అందచేసింది. కైరో (2004), బుడాపెస్ట్ (1999), బెర్గామో 1994 (ఇటలీ), ఫెస్టివల్ అఫ్ ఇండియా ఇన్ బెర్లిన్(1991-92) , మాస్కో(1989 & 1991), కార్లోవీవ్యారి (జెకోస్లోవేకియా)(1990), మ్యూనిచ్ (1989) వంటి వివిధ ఫిలిం ఫెస్టివల్స్ లలో తన చిత్రాల ద్వారా భారత దేశానికి గుర్తింపును తెచ్చిన ఆహ్వానిత ప్రతినిధిగా బి. నరసింగరావు పాల్గొన్నారు. ఫ్రాన్స్, స్లొవేకియా , స్విట్జర్లాండ్ ,కెనడా, స్వీడన్, ఐర్లాండ్,ఇజ్రాయిల్, ఇరాక్, జర్మనీ,ఇటలీ, రష్యా, ఇరాన్, బాంగ్లాదేశ్ లలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లలో ఆయన చిత్రాలు ప్రదర్శించారు. నరసింగరావు వృత్తిని-ప్రవృత్తిని లోతుగా తెలుసుకోవడం అంటే ఒక విధంగా మన జ్ఞానాన్ని విస్తృత పరచుకోవడమే! తెలంగాణ రాష్ట్రం, ప్రజ్ఞాపూర్ గ్రామంలో 1946 డిసెంబర్ 26వ తేదీన ఆయన జన్మించారు. తన పుట్టిన నేల మూలాలపై తనకెంతో తాదాత్యత. మమకారం. తాము పుట్టిన తమ ప్రాంతపు గొప్పతనం, చారిత్రక ప్రాధాన్యత తెలియని సాధారణ ప్రజలకు ఎరుక కలిగించారు. అదేసమయంలో తమ పరిసర ప్రాంతాలలో ఆధిపత్య ధోరణులను ప్రదర్శించే ఆంధ్రుల పై గల భ్రమలను తొలగించి, వారి కుహనా వైఖరులను ఎదిరించి, తమ ఆత్మగౌరవ బావుటాను ఎగరేసేలా చైతన్యవంతులను చేసారు.
ఈ క్రమంలో తాను 1988 నుంచి 2014 వరకు సాంస్కృతిక రంగంలో వివిధ ప్రక్రియల్లో చేసిన కృషి విశేష గుర్తిపు పొందింది. పదిలంగా ఉంది. తన మేధో జ్ఞానంతో, చారిత్రక ఆధారాలతో, తెలంగాణ వైభవోజ్వల చరితను, వివిధ కళారూపాలలోకి మలచి , సాంస్కృతిక బృందాలకు దశ-దిశా చూపారు. ఈ కళారూపాలు ఆంధ్ర పాలకుల దాష్టీకాన్ని కళ్ళకు కట్టి తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల హృదయాలను తాకి వారిని ఉద్యమ ప్రవాహంలో కెరటాలుగా మార్చాయి. తన నిర్విరామ కృషి, నిబద్ధతతో బి. నరసింగరావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమానికి మూల స్థంభంగా మన్ననలు అందుకున్నారు.
తెలుగు సినిమా పై చెరగని చేవ్రాలు చేసి, తెలుగు సినిమాను ఉన్నత స్థాయికి చేర్చిన అనంతరం; స్థానిక జానపద కళలను తెలంగాణ మూలలను- పరిణామ క్రమాలను చూపేందుకు, బి. నరసింగరావు ఫోటోగ్రఫీ, పెయింటింగ్ రంగాలలోకి ఉధృత వేగంతో పునః ప్రవేశం చేశారు. అయన లఘు చిత్రాలు, డాక్యూమెంటరీలు జాతీయ చానెల్స్ లో ప్రదర్శితమై విశేష ప్రశంసలు పొందాయి.
నరసింగరావుకు కవిత్వమొక తీరని దాహం. 24 వాల్యూముల కవితలు రాసారు . అందులో 10 వాల్యూములు ప్రచురితమైనాయి. పాఠకులు విశేషంగా ఆదరించిన ప్రచురిత కవితా సంకనాలానాలను చదివి విమర్శకులు శిరసులూపారు. అతనికి థియేటర్ రంగంలో గల గాఢమైన అనుభవం, వివిధ రంగాలపై గల అనురక్తి తన పైంటింగ్ లకు వినూత్న ఔన్నత్యాన్ని కలిగించాయి. అతడు పీల్చిన పల్లెగాలి, నేలపరిమళం, అతని వర్క్ అఫ్ ఆర్ట్ కు అంతర్జాతీయ ప్రతిష్ట, ప్రాధాన్యతలను సమకూర్చాయి. ఆర్ట్ అండ్ కల్చర్ పై తాను ఎడిటర్ గా ప్రచురించిన అనేక పుస్తకాలలో ఆర్ట్ @ తెలంగాణ తలమానికమైనది. మీగడ తరగలవంటి నాణ్యమైన పేపరుపై దృశ్యకావ్యంగా రూపు దాల్చిన ఆ పుస్తకం ద్వారా నూరు సంవత్సరాలుగా తెలంగాణ కళల పరిణామాలు, వికాసాలను అనన్య రీతిలో ప్రపంచం జేజేలు పలికేలా తెలియచేసారు. ప్రముఖ అంతర్జాతీయ గ్రంథాలయాలు ఆర్ట్ @ తెలంగాణ సేకరణలలో తెలంగాణ సాంస్కృతిక రాయబారులుగా ఉన్నాయి. ప్రధాన దిన – వార- మాస పత్రికలు మేటి పుస్తకంగా కొనియాడాయి.
నరసింగరావు షార్ట్ స్టోరీలు రాశారు. థియేటర్, సినిమా రంగాల గురించి, ఇతర ఆసక్తి కరమైన రంగాల గురించి వ్యాసాలు రాసారు . ఎందరో కొత్తతరం కళాకారులకు మంచి చెడులను చెబుతూ మార్గదర్శకులయ్యారు. నేడు గొప్ప కళాకారులుగా మన్ననలు అందుకుంటున్న పలువురు తమ స్థాయికి కారణం నరసింగ రావు గారే అని వినమ్రంగా చెబుతారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (యు.కె) ప్రచురించిన ‘ డ్ ఎంసైక్లోపీడియా అఫ్ ఇండియన్ సినిమా’ అనే పుస్తకంలో నరసింగరావు సినిమాల గురించి ప్రముఖంగా ప్రచురించింది. నమ్మశక్యం కాని అత్యద్భుత ఘట్టాన్ని ‘రంగుల కల’ ఆవిష్కరించింది. నరసింగరావు కథానాయకునిగా నటించి దర్శకత్వం వహించిన ‘రంగుల కల’ చిత్రం 1984లో ముంబైలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఆ సందర్భాన్ని శాశ్వతం చేస్తూ డైరెక్టరేట్ అఫ్ ఫిలిం ఫెస్టివల్స్ (DFF) ఇండియన్ సినిమా పై పుస్తకాన్ని ప్రచురించింది. అందులో ఒక వ్యాసాన్ని మోస్ట్ రెస్పెక్టెడ్ రైటర్ గా విఖ్యాతులైన ఉమా డా చునా రాసారు. ఆ వ్యాసంలో ఆమె బి. నరసింగరావును విభిన్న కళల రంగానికి ‘పునరుజ్జీవనం కల్పించిన వ్యక్తి’ (MAN of Renaissance ) గా కొనియాడారు.
ఒక వ్యక్తిగా వివిధ రంగాలలో నరసింగరావు చేసిన సృజనాత్మక కృషి, అతని అసాధారణ వ్యక్తిత్వం, అనేక సీమల సరిహద్దులను దాటిన వజ్రసదృశ ప్రకాశమూ అమూల్యమైనవి. అయినా ఒకటి వాస్తవం. అతడు మూర్తీభవించిన వినమ్రుడు!
బహుముఖ సృజనాత్మక ప్రతిభాశాలి బి.నర్సింగ్ రావు!
