ప్రముఖ నిర్మాత, చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు నారాయణ దాస్ నారంగ్ (76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో వున్న ఆయన స్టార్ ఆసుప్రతిలోచికిత్స తీసుకుంటున్నారు. ఆయన చికిత్స పొందుతూ మంగళవారంనాడు ఉదయం 9.04 నిముషాలకు (ఏప్రిల్ 19,2022)న తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ కూడా నిర్మాతలే.
నారాయణ దాస్ నారంగ్ 1946 జులై 27న జన్మించారు. ఆయన డిస్ట్రిబూటర్‌గా పలు విజయవంతమైన చిత్రాలను విడుదల చేశారు. నిర్మాతగా మంచిపేరు సంపాదించుకున్నారు. ఏషియర్ గ్రూప్ అధినేత గ్లోబల్ సినిమా స్థాపకుడు, ఫైనాన్సియర్‌కూడా ఆయిన ఆయన చలనచిత్రరంగంలో అజాతశత్రువుగా పేరుగాంచారు. తెలంగాణలో పంపిణీదారునిగా ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆయన మృతి పట్ల తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి, తెలంగాణ వాణిజ్యమండలి తమ ప్రగాఢసానుభూతి తెలియజేసింది.
నారాయణ దాస్ నారంగ్ భౌతికాయాన్ని ఆస్పత్రి నుంచి మరో గంటలో వారి ఇంటికి తీసుకురానున్నారు. ఈరోజు సాయంత్రం 4గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానంలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలియజేశారు.
సినీరంగంలో ఒక మహారథి నారాయణదాస్ నారంగ్ : మెగాస్టార్ చిరంజీవి శ్రద్ధాంజలి
ప్రదర్శనారంగంలో నిష్ణాతుడు, మాట మీద నిలబడే నిఖార్సైన మనిషి,నిబద్ధత కలిగిన వ్యక్తి,అపార అనుభవజ్ఞుడు,సినీరంగంలో ఒక మహారథి, ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ నారాయణదాస్ నారంగ్ గారికి శ్రద్ధాంజలి
తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నారాయణదాస్ కిషన్ దాస్ నారంగ్ సేవలు మరువరానివి: కె. ఎల్. దామోదర్ ప్రసాద్, ఎం. రమేష్ , గౌరవ కార్యదర్సులు
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు శ్రీ నారాయణదాస్ కిషన్ దాస్ నారంగ్ ఈ రోజు ఉదయం స్వర్గస్తులైనారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయన కుమారులు శ్రీ సునీల్ నారంగ్, శ్రీ భరత్ నారంగ్. శ్రీ నారాయణదాస్ కిషన్ దాస్ నారంగ్ ప్రముఖ సినిమా ఫైనాన్సియర్ మరియు పంపిణీదారుడిగా, ఎగ్జిబిటర్ గాను, నిర్మాతగా ఆనాటి తరం నుండి ఈనాటి తరం వరకు అందరితోనూ సత్సంబంధాలు కలిగిన వ్యక్తి. శ్రీ నారాయణదాస్ కిషన్ దాస్ నారంగ్ తెలంగాణాలో ఏషియన్ గ్రూప్ మరియు గ్లోబల్ సినిమాస్ కంపెనీలను స్థాపించి అనేక సినిమాలను పంపిణి చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అయన చేసిన సేవలు మరువరానివి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరపున తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అన్ని విభాగాలకు సంబంధించిన సభ్యులు, ఆఫీసు బేరర్స్, కార్యవర్గ సభ్యులు మరియు కార్యాలయముల సిబ్బంది అయన ఆత్మకు శాంతి కలగాలని కోరుచూ, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేయడమైనది.