క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మెల్లగా తనకంటూ మంచి పేరు తెచ్చుకుంటూ ముందుకు సాగుతోంది జ్యోతి స్వరూప. “తెర మీద కనిపిస్తే చాలనుకున్నా…. కానీ చూస్తుండగానే పాతిక సినిమాలు చేసేశాను” అంటూ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. “నాన్న ఎందుకో వెనకబడిపోయాడు” అనే షార్ట్ ఫిల్మ్ తో తన ప్రతిభను నిరూపించుకున్న జ్యోతి స్వరూపకు అయ్యప్ప కటాక్షం జత కలిసింది. సుమన్ హీరోగా నటించిన వందో చిత్రం “అయ్యప్ప కటాక్షం” తర్వాత నుంచి ఆమె కెరీర్ ఓ గాడిన పడింది. “వకీల్ సాబ్, భీష్మ” వంటి భారీ చిత్రాలు- “ఏక్ మినీ కథ, పటారుపాలెం ప్రేమకథ” వంటి బడ్జెట్ చిత్రాలు ఆమెకంటూ చిన్న గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం జ్యోతి స్వరూప నటించిన ఐదారు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండగా… నాలుగయిదు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
“నేనెప్పుడూ శ్రమను నమ్ముతాను. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందనే మాటను అనుసరిస్తాను. నేను ఇండస్ట్రీకొచ్చి అయిదేళ్ళవుతోంది. ఇప్పటికి 23 సినిమాలు చేశాను. అయితే… ఇవన్నీ నా కెరీర్ కి పునాదులుగా మాత్రమే భావిస్తాను. ఈ పునాదులపై భారీగా ఓ బహుళ అంతస్తుల భవనం నిర్మించుకోవాలనే అత్యాశ నాకు లేదు కానీ… నా కెరీర్ కి చల్లని నీడనిచ్చే చిన్న గూడు కట్టుకుంటాననే నమ్మకం మాత్రం ఉంది” అంటున్న జ్యోతి స్వరూప తన ప్రయత్నంలో విజయం సాధించాలని కోరుకుందాం!!