వార్తల సేకరణ కోసం నిద్దరహారాలు మాని రాత్రి పగలు విధులు నిర్వహించే జర్నలిస్టుల శ్రమ వెలకట్టలేనిదని కేంద్ర పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి
జి.కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్ లో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్.యు.జె) మీడియా డైరీ – 2022ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా విపత్తు నుండి ప్రజలను అప్రమత్తం చేయడానికి, ధైర్యాన్ని అందించడానికి జర్నలిస్టులు ప్రాణాలను ఫణంగా పెట్టి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారని కొనియాడారు. కరోనా సమయంలో ఎందరో జర్నలిస్టులు ప్రాణాలను సైతం కోల్పోవడం తీరని విషాదమన్నారు. ముఖ్యంగా ఎలాంటి జీత భత్యాలు లేకుండా మీడియా సంస్థల్లో వెట్టిచాకిరి చేస్తున్న స్ట్రింగర్ల బతుకులు దీనస్థితిలో ఉన్నాయని, కనీసం భార్యాపిల్లలకు కడుపునిండా తిండి అందించలేక పోతున్నారని కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక తమ జీవితాలు మెరుగుపడతాయని ఆశించిన జర్నలిస్టులకు నిరాశే మిగిలిందన్నారు. కనీసం ప్రభుత్వం వారికి గూడును కూడా అందించలేక పోతుందని ఆయన విమర్శించారు. మీడియాలో యాజమాన్యాల ధోరణి మూలంగా సంపాదకులు కూడా స్వేచ్ఛగా వార్తలు అందించలేక పోతున్నారని, యాజమాన్యాల వ్యక్తిగత ఎజెండాలే వార్తలుగా వస్తుండడంతో సోషల్ మీడియాకు ఆదరణ పెరిగిపోతుందన్నారు. ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మీడియా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయిందన్నారు. భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించుకునేందుకు ప్రతి ప్రజాస్వామికవాది స్పందించాలని ఆయన కోరారు. సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మాట్లాడుతూ తమ సంఘంలో హైదరాబాద్ యూనిట్ గా కొనసాగుతున్న హెచ్.యూ.జే కు సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. పలువురు సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు హెచ్.యు.జె బాధ్యులుగా కొనసాగారని ఆయన గుర్తుచేశారు. ప్రతియేట ఆనవాయితీగా ఉత్తమ సమాచారంతో డైరీని ప్రచురిస్తున్న హెచ్.యు.జే బాధ్యులను ఆయన అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయుడబ్ల్యుజె ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, ఐజేయు నాయకులు కె.సత్యనారాయణ, హెచ్.యు.జె అధ్యక్ష, కార్యదర్శులు రియాజ్ అహ్మద్, శిగ శంకర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, స్వామి, వెంకటా చారి,యూసుఫ్ బాబు,వెంకటయ్య, ఆర్యన్ శ్రీనివాస్, జేపీ చారీ, ఎన్.
మధుగౌడ్, మల్లికార్జున్ రెడ్డి, ముత్యాల శ్రీనివాస్, రఫీ, తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల శ్రమ వెలకట్టలేనిది: HUJ డైరీ ఆవిష్కరణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
