జమునకు టాలీవుడ్ నివాళి!

జమునకు టాలీవుడ్ నివాళి!
Spread the love

ఎంతో విచారకరం : చిరంజీవి
సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు.మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది.ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను.

కళాకారులకు మరణం ఉండదు : నందమూరి బాలకృష్ణ
అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమున గారు. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195 పైగా సినిమాలలో నటించి నవరసనటనా సామర్ధ్యం కనబరిచారు జమున గారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రసంశలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున గారు… నాన్నగారు అన్నట్లుగా కళకు కళాకారులకు మరణం ఉండదు.. ఈ రోజున జమున గారు బౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి… వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.

శ్రీమతి జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్
ప్రముఖ నటి, లోక్ సభ మాజీ సభ్యురాలు శ్రీమతి జమున గారు దివంగతులు కావడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన శ్రీమతి జమున గారు తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారు. ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారు. ఠీవీగాను, గడుసుగాను కనిపించే పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రజా జీవితంలో లోక్ సభ సభ్యురాలిగా సేవలందించారు. శ్రీమతి జమున గారి మృతికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

మహారాణి లా కొనసాగారు : ఎన్ఠీఆర్
దాదాపు గా 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మహారాణి లా కొనసాగారు. గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి ఎన్నో మరుపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేసారు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

వెన్నెలాంటి మనస్సు : నందమూరి రామకృష్ణ

టాలీవుడ్ ను ఓ తరం నెమ్మదిగా వీడి వెళ్లిపోతోంది. ఆత్రేయ గారు చెప్పినట్లు పోయినోళ్లు అందరూ మంచోళ్లు..ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు. జమున గారి తీపి గురుతులు సినిమాల రూపంలో చాలా ఉన్నాయి. జమున గారి మృతి నన్ను చాలా బాధకు గురి చేసింది..
జమున గారు నాన్న గారితో చాలా సినిమాల్లో నటించారు. వారిద్దరూ కలిసి నటించిన ప్రతి సినిమా ఒక ఆణిముత్యం. జమున గారు లేని జమానా సినిమా పరిశ్రమలో లేదు. అందం, అభినయం అనేవి జమున గారు తెలుగు సినిమాకు అద్దిన అలంకారాలు.
ఆమె మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

శ్రీమతి జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలి : డా. టి. సుబ్బరామిరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు

సుప్రసిద్ధ బహుభాషా నటీమణి లోక్ సభ మాజీ సభ్యురాలు శ్రీమతి జమున గారు మరణం చిత్ర పరిశ్రము తీరని లోటు. ఆమె మరణ వార్త తెలిసి ఎంతో చింతించాను. వెండి తెరపై సత్యభామ అంటే జమున గారు అనేలా గుర్తుండిపోయారు. ఎన్నో పౌరాణిక పాత్రలకు జీవం పోశారు. ప్రేక్షకలోకంలో స్థిర కీర్తిని సముపార్జించుకున్నారు. లోక్ సభ సభ్యురాలిగా ప్రజలకు ఎన్నో సేవలందించారు. కళాపీఠం తరఫున ఆమెను సమున్నతంగా సత్కరించు కోవడం నా అదృష్టం గా భావిస్తున్నాను. శ్రీమతి జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ,వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

తెలుగు సినిమా సీనియర్‌ నటి జమున మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లం సంతాపం తెలిపారు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొని నటిగానే కాకుండా 1989లో రాజమండ్రి ఎంపీగా ప్రజల మన్ననలు అందుకున్నారని గుర్తుకు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు: వై.ఎస్.జగన్
తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌ మొద‌టిత‌రం నటీమణులలో అగ్ర‌క‌థానాయ‌కిగా వెలుగొంది తెలుగు వారి హృద‌యాల్లో చెర‌గని ముద్ర‌వేసుకున్న జ‌మున గారు మృతి చెంద‌డం బాధాక‌రం. ఆవిడ‌ మృతి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు. జ‌మున గారి కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి.

జమున ఆత్మకు శాంతి చేకూరాలి : బండారు దత్తాత్రేయ, హరియాణ గవర్నర్‌
సీనియర్‌ నటి జమున మరణం చాలా బాధాకరం. తెలుగు, హిందీ, దక్షిణాది భాషల్లో అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, తెలుగుదనం మూర్తీభవించిన నటి. మచ్చలేని నటిగా జీవితాన్ని కొనసాగించారు. నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు జమున ఢిల్లీకి వచ్చి సినీరంగం, ప్రజా సమస్యలపై చర్చించేవారు. సమస్యల పరిష్కారానికి కృషిచేసేవారు. జమున ఆత్మకు శాంతి చేకూరాలి.

సినీ పరిశ్రమకు తీరని లోటు : తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మంత్రి
ప్రముఖ సీనియర్ నటి జమున మృతికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. సీనియర్ నటీమణి జమున మృతిచెందడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని తనను తీవ్రంగా కలిచి వేసిందని ఆయన అన్నారు. తెలుగు మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి తెలుగు వారి స్థాయిని పెంచేందుకు కృషి చేశారని ఆయన అన్నారు. జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆయన పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

జమున మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జమున మృతిపట్ల ప్రజానాట్యమండలి సినిమాశాఖ అధ్యక్షుడు వందేమాతరం శ్రీనివాస్‌, కార్యదర్శి మద్దినేని రమేశ్‌ బాబు, కోశాధికారి మాదాల రవి సంతాపం ప్రకటించారు. ‘పుట్టిల్లు’ సినిమాతో జమున తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. జమున మృతిపట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల నివాళులర్పించారు. కాగా ప్రజానాట్యమండలి కోసం జమునను ముక్దుం భవన్‌కు ఆహ్వానిస్తే వచ్చారని.. తన కుటుంబం చెంతకొచ్చినట్లుగా ఉందని ఆనందం వ్యక్తం చేశారని నారాయణ గుర్తు చేసుకున్నారు. జమున, ప్రజానాట్యమండలి గరికపాటి రాజారావు ద్వారా కళారంగానికి పరిచయం అయ్యారని తమ్మినేని వీరభద్రం అన్నారు.

Related posts

Leave a Comment