క్రియాశీలం…

thirunagari srinivas
Spread the love

తిరునగరి శ్రీనివాస్, 8466053933

  • నిజమే…ఏ లెక్కకూ అందదు
    నిస్వార్ధం… ఓ క్రియాశీలక సంఘర్షణ
    పురోగామి జీవితం నుండి
    నిట్టూర్పులను బహిష్కరిస్తే
    వేలవేల చేతులై విస్తరించాలి
    సన్నివేశాలుగా రూపుదిద్దుకోవాలి
    మేఘం ఉరుమై మెరిసినప్పుడే
    సెలయేళ్ల రెక్కలు పురి విప్పుకోవాలి
    పాదాలకు ధైర్యం పెరిగితే
    ప్రాణంలేని పర్వతాలేమిటి
    ప్రపంచమే కదులుతుంది
    దూసుకపోయే చూపుకు
    జీవితమే వర్ణదృశ్యచిత్రం
    కమ్ముకున్న ఒంటరితనానికి
    ఆవరించిన శూన్యకాశానికి
    ఆలోచనే దుముకి వచ్చే ఆయుధం
    మనోవికాసమే తలెత్తుకునే గతిశీలం
    ముందడుగే వెనుదిరగని జలపాతం
    ఎన్నెన్ని సంఘర్షణలు చరిత్రగా మారితే
    ధైర్యపు ఉగ్గులు పొసే ఊతకర్రలు మొలుస్తాయి
    జవసత్వాలు మొగ్గలు విచ్చుకుంటాయి నడకలు నదులై సాగుతాయి
    అందుకే
    జీవితం వ్యాపకం కాదు
    నిప్పులాంటి జ్ఞాపకం
    పుట్టుమచ్చలాంటి శాశ్వత ప్రతిబింబం
    అంతమంటూలేని ఎడతెగని ప్రయాణం.

Related posts