కొత్తతరం ప్రేమకథ!

most elijibul batchler telugu movie review
Spread the love

చిత్రం: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్

  • విడుదల : అక్టోబర్ 15, 2021
    రేటింగ్: 3/5
    న‌టీన‌టులు: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే,
    ఆమ‌ని, ప్రగతి, శ్రీకాంత్ అయ్యంగార్‌, ఈషా రెబ్బా,
    ఫ‌రియా అబ్దుల్లా, ముర‌ళీశ‌ర్మ‌, పోసాని కృష్ణ ముర‌ళి,
    అజయ్, అమిత్, ‘వెన్నెల’ కిషోర్, వి.జ‌య‌ప్ర‌కాష్, సుడిగాలి సుధీర్‌,
    గెట‌ప్ శ్రీను శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
  • నిర్మాణ సంస్థ : జీఏ2 పిక్చ‌ర్స్
    స‌మ‌ర్ప‌ణ‌: అల్లు అర‌వింద్‌
    నిర్మాతలు: బన్నీ వాసు, వాసు వర్మ
    దర్శకత్వం : ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌
    సంగీతం : గోపీ సుంద‌ర్‌
    సినిమాటోగ్రఫీ : ప్రదీశ్‌ ఎమ్‌. వర్మ
    ఎడిట‌ర్: మార్తాండ్. కె వెంక‌టేశ్
    ఆర్ట్ డైరెక్ట‌ర్: అవినాష్ కొల్లా

క్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్, హీరోగా తనకంటూ ప్రత్యేక స్టార్ డమ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కెరీర్ లో సరైన విజయాలు లేక నిరాశ పడుతున్నాడు. తాజాగా ద‌స‌రా బరిలోకి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’గా అడుగుముందుకేశాడు. ఈ చిత్రానికి ఓటీటీ నుంచి ఎన్నో ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ థియేట‌ర్‌లోనే విడుదల చేసింది చిత్ర‌ యూనిట్‌. జీఏ2 పిక్చ‌ర్స్ బ్యానర్ పై ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో బన్నీ వాసు, వాసు వర్మలు నిర్మించిన ఈ చిత్రంలో అఖిల్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది. ‘బొమ్మ‌రిల్లు’ భాస్క‌ర్‌కు యువతలో ఓ విధమైన క్రేజ్ ఉంది. సున్నిత‌మైన ప్రేమ‌క‌థ‌లను వైవిధ్య‌భ‌రితంగా తెర‌పై ఆవిష్క‌రించి యువ‌త‌రం హృద‌యాల్నికొల్ల‌గొట్టిన ఆయన తెలుగు చలన చిత్ర రంగంలో దర్శకుడిగా తనకంటూ ఓ ముద్రని వేసుకున్నారు. అలాగే కొత్త‌ద‌న‌మున్న ప్రేమక‌థ‌ల‌ను ఆద‌రించ‌డంలో ముందుండే యువ క‌థానాయ‌కుడు అఖిల్ అక్కినేనికి పేరుంది. అలాంటి ఈ ఇద్ద‌రి క‌ల‌యిక నుంచి వ‌చ్చిన ఓ కొత్తతరం ప్రేమకథ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’. ద‌స‌రా సంద‌ర్భంగా బాక్సాఫీస్ ముందుకొచ్చిన ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, చిత్రాలు ఆక‌ట్టుకోవ‌డంతో సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ ద‌క్కింది. దీంతో సినీప్రియులు ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు. మ‌రి ఆ అంచ‌నాల‌ను అఖిల్‌, పూజాల జోడీ అందుకుందా? ‘బొమ్మ‌రిల్లు’ భాస్క‌ర్ చెప్పిన ప్రేమ‌క‌థ ప్రేక్ష‌కుల్నిఏ మేరకు మెప్పించింది? ఇలాంటి అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ బ్యాచ్‌లర్.. ప్రేక్షకులకి నచ్చాడో? లేదో? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

కథ: అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఐటీ ప్రొఫెషినల్ అయిన హర్ష (అఖిల్ అక్కినేని) తన ఆలోచనలకు తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని సెలవు పెట్టి ఇండియా వస్తాడు. హర్ష ఫ్యామిలీ అతని కోసం ఎన్నో సంబంధాలను సిద్ధం చేసి ఉంచుతుంది. అంటే ఇరవై రోజుల్లో ఇరవై మంది అమ్మాయిలని చూసి అందులో నుండి ఒకర్ని హర్ష పెళ్లి చేసుకుని మళ్లీ అమెరికా వెళ్లిపోవాలి. ఆ ఇరవై అమ్మాయిల్లో ఒకమ్మాయి విభ (పూజా హెగ్డే). బ్యాచ్‌లర్ లైఫ్‌, పెళ్లి తర్వాత లైఫ్‌ వంటి వాటిపై స్టాండప్ కామెడీ చేసే విభని చూసిన వెంటనే హర్ష.. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే విభ జాతకం, హర్ష జాతకం కలవలేదని అతని ఫ్యామిలీ రిజెక్ట్ చేస్తుంది. విభ భావాలను, ఆలోచనలను హర్ష ఇతర అమ్మాయిలను చూడడానికి వెళ్లినప్పుడు ప్రదర్శిస్తుండటంతో.. ఏ ఒక్క సంబంధం అతనికి సెట్ కాదు. పైగా గొడవలు జరిగి కోర్టు వరకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఫ్యామిలీ హర్టయి.. పెళ్లొద్దు, ఏం వద్దు అని హర్షను మళ్లీ అమెరికా పంపించేస్తారు. అమెరికా వెళ్లిన తర్వాత పెళ్లిపై తనకి ఉన్న క్లారిటీ సరైంది కాదని, విభకి ఉన్న క్లారిటీతో జీవితాంతం సుఖంగా ఉండగలమని భావించిన హర్ష ఆమె కోసం భారత్ వచ్చేస్తాడు. ఈలోపు హర్ష ఫ్యామిలీ అమెరికాకు చెందిన అమ్మాయితో హర్ష పెళ్లిని ఫిక్స్ చేసి నిశ్చితార్థ కార్యక్రమం కూడా పూర్తి చేస్తారు. తన తండ్రి సుబ్రమణ్యం(మురళీశర్మ) ప్రవర్తనతో పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయం తీసుకున్న విభని హర్ష పొందగలిగాడా? సుబ్రమణ్యం చేసిన తప్పేంటి? చివరికి హర్ష తన ఫ్యామిలీ సెట్ చేసిన అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేక తన ప్రేమించిన విభని చేసుకున్నాడా? అస‌లు విభ‌కు పెళ్లంటే ఎందుకు విర‌క్తి? ఆమెను త‌న‌తో పెళ్లికి హీరో ఎలా ఒప్పించాడు? ఈ క్ర‌మంలో ఎదుర‌య్యే ప‌రిస్థితులేంటి? వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు? పెళ్లి విష‌యంలో విభ అడిగిన కొన్ని ప్ర‌శ్న‌లు.. హ‌ర్ష జీవితంలో పెను మార్పుల‌కు కార‌ణ‌మ‌వుతాయి. మ‌రి ఆ ప్ర‌శ్న‌లేంటి? వాటికి స‌మాధానం క‌నుక్కునే క్ర‌మంలో హ‌ర్ష తెలుసుకున్న జీవిత‌ స‌త్య‌మేంటి? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేష‌ణ‌: ఎప్పుడూ చిన్న లైన్‌తోనే సినిమా తీయాల‌నుకుంటాడు ‘బొమ్మ‌రిల్లు’ భాస్క‌ర్. క‌థ కంటే క‌థనం మీద ఎక్కువ దృష్టి పెట్టి మ్యాజిక్ సృష్టిస్తాడు. కానీ ఈసారి ప్రేమ‌, రొమాన్స్‌కి తేడా ఏమిటి? అని చ‌ర్చించేందుకు ప్ర‌య‌త్నించాడు. ఈ విష‌యంలో క్లారిటీ ఇవ్వాల్సింది పోయి మ‌రింత క‌న్‌ఫ్యూజ్ చేసిన‌ట్లు క‌నిపించింది. ఫ‌స్టాఫ్‌లోని కొన్ని స‌న్నివేశాలు బొమ్మ‌రిల్లు సినిమాను గుర్తు చేస్తాయి. అంతేకాకుండా ప్ర‌తిదాన్ని సాగ‌దీసి ప్రేక్ష‌కుల‌కు తెగ బోర్ కొట్టించారు. క్లైమాక్స్ కూడా ఊహ‌కంద‌నంత ఎత్తులో ఏమీ లేదు. ఇంట‌ర్వెల్ సీన్‌, కోర్టు స‌న్నివేశాలు మాత్రం ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. రెండు, మూడు పాట‌లు బాగున్నాయి. తెరపై వచ్చే సినిమాల్లో చిన్న చిన్న మార్పులుండొచ్చు గానీ ప్రేమ‌క‌థ‌ల‌న్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. ఎవ‌రైతే ఆ ప్రేమ‌క‌థ‌ను స‌రికొత్త కోణంలో తెర‌పై ఆవిష్క‌రించ‌గ‌లుగుతారో వాళ్లే ప్రేక్ష‌కుల మెప్పు పొంద‌గ‌లుగుతారు. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌ది అందెవేసిన చేయి. ఆయ‌న‌ చిత్రాల్లో ప్రేమ‌క‌థ‌ల‌న్నీ చిన్న లైన్‌తోనే ముడిప‌డి ఉంటాయి. కానీ, ఆ పాయింట్‌ను ఆయ‌న స‌రికొత్త ట్రీట్‌మెంట్‌తో చెప్పే తీరు సినీప్రియుల్ని మెప్పిస్తుంటుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’నూ అలాంటి ఓ చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న ఓ ఆస‌క్తిక‌ర క‌థాంశంతోనే రూపొందించారు. విరామానికి ముందు వ‌చ్చే కోర్టు సీన్ లాజిక్‌కు దూరంగా అనిపించినా.. ఆ ఎపిసోడ్‌లో పోసాని కృష్ణ ముర‌ళి చేసే హంగామా మంచి కాల‌క్షేపాన్ని అందిస్తుంది. ఇక విరామ స‌మ‌యానికి విభాకు హ‌ర్ష దూరం కావాల్సి రావ‌డంతో ద్వితీయార్ధం ఏం జ‌రుగుతుందా? అన్న ఆస‌క్తి క‌లుగుతుంది. అయితే ప్ర‌ధ‌మార్ధంలో ఉన్న మెరుపు ద్వితీయార్ధం ఆరంభం నుంచే తగ్గినట్లు అనిపిస్తుంది. పెళ్లికి అస‌లైన ఎలిజిబులిటి ఏంటి? అన్న‌ది చెప్ప‌డం కోసం ద్వితీయార్ధంలో భాస్క‌ర్ రాసుకున్న కొన్ని ఎపిసోడ్లు బ‌ల‌వంతంగా ఇరికించిన‌ట్లుగా ఉంటాయి. విభా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం క‌నుక్కునే క్ర‌మంలో హ‌ర్ష త‌న‌ని తాను తెలుసుకోవడం.. ఆమెని త‌న ప్రేమ‌తో మెప్పించ‌డం కోసం అత‌ను చేసే ప్ర‌య‌త్నాలు ఆక‌ట్టుకునేలా సాగుతాయి.


అఖిల్‌ త‌న‌కు స‌రిగ్గా సూట్ అయ్యే పాత్ర సెల‌క్ట్ చేసుకుని న‌ట‌న‌తో అదుర్స్ అనిపించాడు. నటన పరంగా క్లాప్స్‌ కొట్టించాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు. అఖిల్ డైలాగ్ డెలివరీ, అతను కనిపించిన తీరంతా చూసే ప్రేక్షకులకు నచ్చుతుంది. పూజా హెగ్డే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించింది. ముందు నుంచి అనుకున్న‌ట్లు ఆమె పాత్ర డిఫ‌రెంట్‌గా ఉండి అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ముఖ్యంగా పూజా త‌న గ్లామ‌ర్‌తో ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేసింది. తన పాత్రని చక్కగా చేసింది. గ్లామర్ విషయంలోనూ ఎక్కడా తగ్గలేదు. రొమాంటిక్ స‌న్నివేశాల్లో అఖిల్‌, పూజాల జోడీ ఎంతో చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపించింది. రియ‌ల్ క‌పుల్ చిన్మ‌యి శ్రీపాద‌, రాహుల్ ర‌వీంద్ర‌న్ త‌మ పాత్ర‌లకు న్యాయం చేశారు. ముర‌ళీ శ‌ర్మ‌, జేపీల‌కు అలవాటైపోయిన పాత్ర‌లే ప‌డ్డాయి. టెక్నిక‌ల్‌గా సినిమా బాగుంద‌నిపించింది. పాట‌లు, నేప‌థ్య సంగీతం సినిమాకు ఆయువుప‌ట్టుగా నిలిచాయి. కొంత‌మేర‌కు సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకున్నా కొద్ది చోట్ల మాత్రం అవి పెద్ద స్పీచ్‌లా అనిపిస్తాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ప్ర‌ధ‌మార్ధంలో సుడిగాలి సుధీర్‌.. పోసాని కృష్ణ‌ముర‌ళి, ద్వితీయార్ధంలో వెన్నెల కిషోర్ త‌మ‌వంతు న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. ఈషా రెబ్బా, ఫ‌రియా అబ్దుల్లా, నేహా శెట్టి వంటి నాయిక‌ల్ని అతిథి పాత్ర‌ల్లో ఉప‌యోగించుకున్న తీరు బాగుంది. సుబ్రమణ్యంగా మురళీశర్మ, అతని వైఫ్‌గా ప్రగతి డిఫరెంట్‌గా కనిపించారు. ముఖ్యంగా మురళీశర్మ పాత్ర సినిమాకి కామెడీ, సీరియస్‌నెస్‌ని ఇచ్చేలా ఉంటుంది. హర్ష తల్లిదండ్రులుగా జయప్రకాశ్, ఆమని.. గాడ్‌ఫాదర్‌గా శ్రీకాంత్ అయ్యంగార్, హర్ష బావగా అజయ్ పాత్రలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రగతి, సుడిగాలి సుధీర్, వెన్నెల కిషోర్, పోసాని పాత్రలతో చేసిన కామెడీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ సినిమాకి నిర్మాణ విలువలు గురించి ప్రత్యేకంగా చెప్పుకునేంతగా ఉన్నాయి. సినిమాని రిచ్‌గా తెరకెక్కించారు.సినిమాటోగ్రఫీ హైలెట్‌గా ఉంది. గోపీసుందర్ ఇచ్చిన నేపథ్యం సంగీతం, పాటలు బాగున్నాయి. ఎడిటింగ్సి ఓకే. మొత్తంమీద ఈ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ ఫర్వాలేదనిపించాడు.


-దిల్

Related posts

Leave a Comment