చిత్రం: ‘కొండపొలం’
- విడుదల తేది: అక్టోబర్ 8, 2021
రేటింగ్: 3/5
నటీనటులు :
పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్,
సాయిచంద్, అన్నపూర్ణ, కోట శ్రీనివాసరావు,
హేమ, రచ్చరవి, ‘రంగస్థలం’ ఫేమ్ మహేష్,
అంటోని, రవిప్రకాశ్ తదితరులు - దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
సమర్పణ: బిబో శ్రీనివాస్
బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు: సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి
సంగీతం: ఎం.ఎం కీరవాణి
సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ వీఎస్
కథ: సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి
ఎడిటర్: శ్రావన్ కటికనేని
ఆర్ట్: రాజ్ కుమార్ గిబ్సన్
కాస్టూమ్స్: ఐశ్వర్యా రాజీవ్
ఫైట్స్: వెంకట్
మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లు గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొండపొలం’. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నేడు (అక్టోబర్ 8)న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విడుదలకు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ ‘కొండపొలం’..మరి ఆ అంచనాలను అందుకుందో.. లేదో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కథ: రవీంద్రనాథ్ (వైష్ణవ్‌తేజ్) గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన ఓ యువకుడు. ఉద్యోగం వెతుక్కుంటూ భాగ్యనగరానికి చేరుకుంటాడు. ఎంతగా ప్రయత్నించినా ఉద్యోగం రాదు. ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో తిరిగి తన ఊరికి చేరుకుంటాడు. అలా ఊరికి చేరుకున్న అతడు కరవు కాటకాల వల్ల తండ్రితో పాటు గొర్రెల్ని మేపడం కోసం కొండపొలానికి వెళ్లక తప్పదు. తీరా అక్కడికి వెళ్లాక ఆ యువకుడికి అడవి ఏం నేర్పింది? గొర్రెల్ని కొండపొలానికి తీసుకెళ్లి వచ్చాక రవీంద్రనాథ్ లో ఎలాంటి మార్పు వచ్చింది? క్లయిమాక్స్.
విశ్లేషణ: దర్శకుడు క్రిష్.. చేసే ప్రతీ సినిమాకు ఓ కొత్త బ్యాక్ డ్రాప్ ఉండాలని అనుకుంటాడు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండ పొలం’ నవల ఆధారంగా ఈ సినిమాని తెరపైకి తీసుకొచ్చేందుకు దర్శకుడు పడ్డ తపన ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపించింది. అద్భుతమైన యాక్షన్, అడ్వెంచరస్ గా దీనిని తీర్చిదిద్దిన వైనం తెరపై కనిపించింది. ఏమీలేని స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగే ఓ కుర్రాడి కథను మలిచిన తీరు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. అడవి అంటే ఇష్టం, ఆ అడవి, అక్కడి అమ్మాయితో ప్రేమలో పడే ఓ కుర్రాడి జీవిత ప్రయాణం, ఆ గ్రాఫ్ బాగుంటుంది. ఈ కథ, పాత్ర చాలా కొత్తగా అనిపిస్తుంది. పుస్తకంగా రాయడం వేరు.. దాన్ని సినిమాగా తీయడం వేరు. పుస్తకంలో రాసిన దానిని సినిమాగా తీయాలంటే దానికి కొన్ని పరిమితులుంటాయి. ఉదాహరణకు సన్నపురెడ్డి వెంకటరెడ్డి రాసిన కథలో ఓబులమ్మ పాత్ర ఉండదు. అదొక అద్బుతమైన కథ. చక్కటి కథనంతో రాశారు. ప్రతీ ఒక్క ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. దానికి అందమైన ప్రేమకథను జోడిస్తే ఎలా ఉంటుందని ఓబులమ్మ పాత్రను క్రియేట్ చేసి అందర్నీ మెప్పించాడు దర్శకుడు. నీళ్లు లేక గొర్రెల కాపర్లు అందరూ కలిసి వాటిని తీసుకుని కొండమీదకు వెళ్తారు అక్కడ జరిగే పరిణామాలేంటి? అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఊరి జనాభాకే నీళ్లు లేనప్పుడు.. గొర్రెలకు ఎక్కడి నుండితెస్తారు. అందుకే వాటిని కొండ ప్రాంతానికి తీసుకెళ్తారు. సినిమా చూస్తుంటే మనం కూడా గొర్రెల కాపరి అవుతాం. అది చాలా కష్టమైన పని. పిక్ నిక్ వెళ్లడంలా ఉండదు. అడ్వెంచెరస్ జర్నీ. ఓ చిన్నపిల్లవాడు వస్తే మాత్రం ఆ గొర్రెలన్నీ కూడా అతని వెనుకే వచ్చాయి. ఆ టెక్నిక్ వైష్ణవ్ బాగా పట్టేశాడు. ఆ సమయంలో అతడి నటనను మెచ్చుకోకుండా ఉండలేం. దర్శకుడు క్రిష్ అడుగడుగునా కథను తెరకెక్కించిన విధానం, ఆయా నటీనటుల పాత్రలను మలిచిన తీరు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకునేలా చేసింది. విభిన్న జానర్లను ఎంచుకోవడం, సమాజంలోని సమస్యలను తీసుకోవడం, ఆర్టిస్ట్ల నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవడం క్రిష్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. దర్శకుడి టేకింగ్ కు తోడు, వైష్ణవ్ తేజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ.. ఓ అందమైన రస్టిక్ ప్రేమ కథను చూపించారు. మామూలుగా ఈ సినిమా కథే అందరినీ ముందుగా ఆకట్టుకుంటోంది. కొండపొలం అని టైటిల్ ప్రకటించినప్పటి నుంచీ అంచనాలు పెరిగాయి. ట్రైలర్, టీజర్ ఇలా అన్నీ కూడా సినిమా మీద పాజిటివ్ బజ్ను క్రియేట్ చేశాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉంది. వెన్నెముకలేనట్టుగా భయం భయంగా కనిపించే ఓ యువకుడు ఆత్మవిశ్వాసంతో తలపైకెత్తి నిలిచేంత ధైర్యాన్ని, తనపై తనకి నమ్మకాన్ని అడవి, అడవిలాంటి ఓ యువతి ఎలా ఇచ్చారనేది ఈ చిత్రంలో ఆసక్తికరమైన అంశం. గొర్రెల కాపరుల జీవిత చిత్రాన్ని తెరపై సహజంగా ఆవిష్కరిస్తూ మొదలయ్యే ఈ కథ… అడవిలోకి వెళుతున్న కొద్దీ ప్రయాణం సాగుతున్న కొద్దీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. అడవి ప్రాముఖ్యతను తెలుపుతూనే, దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఎంత ఉందో ఈ చిత్రంలోని సన్నివేశాలు చాటి చెబుతాయి.
నటీనటుల విషయానికొస్తే.. రవీంద్ర అనే క్యారెక్టర్ లో వైష్ణవ్ తేజ్ ఒదిగిపోయాడు. అతడి కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ బాగా కుదిరాయి. తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన యువకుడిగా పాత్రలో ఒదిగిపోయాడు. రాయలసీమ యాస పలికిన విధానం ప్రతీ ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంది. అడవిలో పులితో చేసే పోరాట ఘట్టాలు.. కథానాయిక రకుల్ తో కలిసి చేసిన సన్నివేశాల్లోనూ అతడి నటన ఆకట్టుకుంటుంది. వైష్ణవ్ లో నేర్చుకోవాలనే తపన కనిపించింది. ప్రతీ సీన్ను కొత్తగా చేసేందుకు ప్రయత్నించాడు. సినిమాలంటే ఎంతో ప్యాషన్ ఉండబట్టే తొలి అడుగులో ‘ఉప్పెన’ లాంటి కథను ఎంచుకున్నఅతడు మలి అడుగులోనే ‘కొండపొలం’లాంటి బరువైన క్యారక్టర్ ను ఎంచుకుని తన ప్రతిభను చాటాడు.
ఓబులమ్మగా నటించిన రకుల్ సహజంగా నటించింది తన యాసతో అందరినీ ఆశ్చర్యపరిచింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఓబులమ్మగా ఆమె మొహంలోని హావాభావాలను చక్కగా పండించింది రవీంద్ర తండ్రిగా సాయిచంద్, తాతగా కోట శ్రీనివాసరావు, రవిప్రకాశ్, రచ్చరవి, మహేశ్ తదితర పాత్రలు ప్రేక్షకుల్నిమెప్పించాయి.
సాంకేతిక విభాగానికొస్తే.. జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ అడవి అందాల్ని కళ్ళకు కట్టింది. సినిమాకి మాటలు, పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆర్ట్ డైరెక్టర్ గా రాజ్ కుమార్ గిబ్సన్ వర్క్ మంచి మార్కుల్ని కొట్టేసింది. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ చిత్రానికి తగ్గస్థాయిలోనే ఉంది. ‘కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ‘ఓబులమ్మ’ ‘శ్వాసలో’ పాటలలు బాగా ఆకట్టుకున్నాయి. శ్వాసలో
పాట స్వరవాణి ఎంఎం కీరవాణి మార్క్ చూపించే రొమాంటిక్ మెలోడి గీతమిది. ఈ పాటకు కీరవాణి సాహిత్యాన్ని కూడా అందించడం విశేషం. ఆయన సాహిత్యం, బాణీ అందరినీ కట్టిపడేసింది. ఎంఎం కీరవాణి ఈ చిత్రాన్ని మరో లెవెల్కి తీసుకెళ్లారు. రయ్ రయ్ అనేది పాట కాదు మంత్రం. కీరవాణి, సిరివెన్నెల అద్భుతమైన పాటలు రాశారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది.