కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ ఉప్పలపాటి కృష్ణంరాజు గారు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారన్న వార్త విని కలత చెందాను. కొంతకాలంగా అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఎప్పటిలాగే తిరిగి ఇంటికి వస్తారని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఆయన కంటే కొంచెం వయసు ఎక్కువే అయినా మా మధ్య మంచి అనుబంధం ఉండేది. అవి “ద్రోహి” సినిమా రిలీజ్ అయిన రోజులు. ఆ సినిమా చూస్తున్న సమయంలో కృష్ణంరాజు గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరై ఉంటారు ? అని నాకు అనుమానం కలిగింది. సహజంగా నాకు అన్న ఎన్టీఆర్ గారి వాయిస్ తప్ప మరొకరి వాయిస్ నచ్చదు. అలాంటిది ఆయన తెలుగు పలుకుతున్న విధానం నన్ను కట్టి పడేసింది. సుదీర్ఘ కవితలను, డైలాగులను అలవోకగా చాలా స్పష్టంగా పలుకుతున్నారు అది విని పక్కనే కూర్చున్న అల్లు రామలింగయ్యతో ‘ఏమయ్యా లింగయ్య.. ఆ కుర్రాడికి డబ్బింగ్ చెప్పింది ఎవరయ్యా ? ఎవరో గానీ, అన్న గారిలా బాగా రౌద్రంగా చెబుతున్నారు.. ఎవరు ?’ అని ఆతృతగా అడిగితే సొంత డబ్బింగ్ అని చెప్పారు. అది విని ఆశ్చర్యపోయాను, సినిమా అయిపోయాక వెంటనే ఆయనను కలిసి ‘ఏమయ్యా ఇంత అద్భుతంగా డైలాగులు చెబుతున్నావ్.. నువ్వు మరిన్ని చిత్రాల్లో నటించాలి’ అని అంటే.. ఆ మాటకు ఆయన నవ్వుతూ.. ‘అంటే.. ఇప్పుడు నన్ను మీకు కూడా క్యారెక్టర్స్ లేకుండా చేయమంటారా ?’ అంటూ నవ్వేశారు. అలా మొదలైన మా పరిచయం మారణ హోమం, ప్రేమ తరంగాలు, అమర దీపం, బొబ్బిలి బ్రహ్మన్న, రావణ బ్రహ్మ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో భాగమయ్యేలా చేసింది. ఆయన లాంటి నటుడిని దూరం చేసుకుని కళామ తల్లి బాధపడుతుంది. ఆయన కన్నుమూయడం తెలుగు సినీ జగత్తుకే కాదు మా అందరికీ తీరని లోటు.
‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ నుండి “చాలాబాగుందే.. ” లిరికల్ వీడియో విడుదల
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్ కల్యాణమండపం,సమ్మతమే చిత్రాలతో అలరించిన కిరణ్ హీరోగా ఇప్పుడు “నేను మీకు బాగా కావాల్సినవాడిని” చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్‌ఆర్ కల్యాణమండపం డైరెక్టర్ శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి “చాలా బాగుందే” అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాట వింటుంటే ఇది మెలోడీ సాంగ్ అని అర్ధమవుతుంది.
అలానే ఈ ట్రైలర్ కు కూడా మంచి స్పందన లభించింది. కిరణ్ ఈ సినిమాలో క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.వి కృష్ణారెడ్డి ఈ సినిమాలో కనిపిస్తున్నారు. కిరణ్ అబ్బవరం తో పాటు కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ కూడా కనిపించనున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కిరణ్‌కు జోడీగా సంజనా ఆనంద్ హీరోయిన్‌గా నటించింది.కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా, ఈ నెల 16న విడుదల కానుంది.
కృష్ణం రాజుగారికి నివాళులు అర్పించిన అల్లు అర్జున్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనేక సాంఘీక,పౌరాణిక, రాజకీయ, జానపద చిత్రాలలో విభిన్న పాత్రాలలో కధానాయకునిగా నటించి, సినిమా ప్రేక్షకులను రంజింప చేయటంలో అగ్రభాగాన నిలిచిన ప్రఖ్యాత నటులు ఉప్పలపాటి కృష్ణంరాజు మృతి సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయన మరణ వార్త తెలియగానే హీరో అల్లు అర్జున్ హుటాహుటిన బెంగుళూరు నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకొని, నేరుగా ఏయిర్ పోర్టు నుంచి కృష్ణం రాజుగారి నివాసానికి చేరుకొని ఆయన పార్ధివ దేహనికి నివాళులు అర్పించారు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ
శ్రీ కృష్ణంరాజు గారి మరణ వార్త తెలియగానే ఎంతో డిస్టర్బ్ అయ్యాను, ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. 50 సంవత్సరాలకు పైగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. సినీ రంగం పై ఆయన తనదైన ముద్ర వేశారు. అలాంటి అద్భుతమైన ఒక లెజెండ్ ను కోల్పోవడం టాలీవుడ్ కు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు