రవీంద్రసూరి నామాల
9848321079
ఆగి ఆగి కురుస్తున్న
మధ్యాహ్నపు వాన
మా చిన్నోడు ఏడుపు ఆపి
నిద్రలోకి వెళ్లిన నిశ్శబ్దంలా
వాన సాయంకాలం దాకా
సన్న సన్నని ధారలుగా
కురుస్తూనే ఉంది
ఆదాట్న,
సగం నిద్రనుండి లేచిన చిన్నోడు
తెల్లారిందని
పళ్ళుతోముకోవడానికి
మారాం చేసినట్టుగా
వాన కసురుకుంటూ
ఇంకా ముసురుపెడుతూనే ఉంది
గెరువిస్తే బావుండు
గేటుదాటాలని
పెద్దోడి చూపంతా
తుంపర తుంపర
చినుకులపైనే ఉంది
వర్షాతిరేకాన్ని
ఆస్వాదిస్తున్న నా పెన్నుకెళ్లి
ప్రేమగా చూసిన మా ఆవిడ
వానకి తడపడమే కాదు
కలపడం కూడా తెలుసంటూ
కిచెన్ లోనికెళ్లి పకోడీ తెచ్చి
చలికి వెచ్చదనాన్ని కప్పింది
మేఘం మిగిల్చి వెళ్లిన
సగం వానకి వందనం చేస్తూ
మల్లెప్పుడొస్తావని
ఆకాశం వైపు చూస్తే
కొంటెగా కన్నుగీటి తుర్రుమంది
చిలిపి వాన
తెరిపిచ్చానుగా అంటూ…