“నిర్మాతగా నా వందో చిత్రం… వంద రోజుల సినిమాలు తీయడంలో సిద్ధహస్తులైన- “వంద సినిమాల దర్శకశిఖరం” రూపొందించనున్నారు. నిర్మాతగా నా స్థాయిని వంద రెట్లు పెంచే సదరు వందో చిత్రం అధికారిక ప్రకటన… వంద చిత్రాల దర్శకుడు అధికారికంగా అతి త్వరలో ప్రకటించనున్నారు. ఈ పుట్టినరోజుకు నేనందుకుంటున్న అతి పెద్ద కానుక ఇది. అంతేకాదు… నిర్మాతగా నాకిది “లైఫ్ టైమ్ అచీవ్మెంట్” లాంటిది” అంటున్నారు ప్రముఖ నిర్మాత – భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. సెప్టెంబర్ 10… తన 64వ పుట్టినరోజును పునస్కరించుకుని ఆయన మీడియాతో ముచ్చటించారు.
“2021 నాకు చాలా ప్రత్యేకమైన సంవత్సరం. “జాతీయ రహదారి” 10 న విడుదలవుతోంది. ఈ సినిమా కచ్చితంగా అవార్డుల పంట పండిస్తుంది. నా పేవరెట్ డైరెక్టర్ ఆర్జీవి దర్శకత్వంలో ప్రముఖ రచయిత యండమూరి అందించిన కథతో ‘తులసి తీర్ధం’ తెరకెక్కిస్తున్నాను. యండమూరి దర్శకత్వం వహిస్తున్న “నల్లంచు తెల్లచీర, అతడు-ఆమె-ప్రియుడు” చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు “దండుపాళ్యం” ఫేమ్ శ్రీనివాసరాజు దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ మూవీ ప్లాన్ చేస్తున్నాం. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. 2004లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. సి.కళ్యాణ్, వి.వి.వినాయక్, విజయేంద్రప్రసాద్, యండమూరి, ఆర్జీవి వంటి గొప్ప వ్యక్తుల మనసుల్లో స్థానం సంపాదించుకోగలగడం నిజంగా నా అదృష్టం. అలాగే సినిమారంగంలో నాకు గల అనుభవాన్ని, అనుబంధాన్ని గుర్తించి… నన్ను “ఊర్వశి ఓటిటి” సిఇవోను చేసిన రవి కనగాల, శ్యామ్ గార్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు” అన్నారు.