ఏప్రిల్ 20-2022 రాత్రి రవీంద్రభారతిలో నేను శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న కార్యక్రమంలో పాత్రికేయ శిరోమణి పురస్కారాన్ని అందుకున్నాను. అవార్డు కమిటీ చైర్మన్ డాక్టర్ మహమ్మద్ రఫీ ఫోన్‌చేసి, ఆ పురస్కారానికి నన్ను ఎంపిక చేసినట్లు చెప్పగానే, నిజంగా మొదట ఆ పురస్కారాన్ని అందుకోవడానికి నేను అర్హుడనేనా అనే ప్రశ్న వెంటనే మనసులో మెదిలింది. అంగీకారం తెలపడానికి సందేహించాను. జర్నలిస్టుగా, రచయితగా నా కెరీర్ ఎలా సాగుతూ వచ్చిందో, నేనేం రాశానో, నేనేం సాధించానో 1993 నుంచీ రఫీకి చాలావరకు తెలుసు. ఆ విషయం అతను చెప్పగానే సరేనన్నాను. ఈ సందర్భంగా నేనేమిటన్నది చాలావరకు తెలీని మిత్రులు, కొంతే తెలిసిన మిత్రులు చాలామందే ఉంటారు. వాళ్ల కోసమే ఈ నాలుగు (నాలుగంటే నాలుగు కాదనుకోండి) మాటలు…
22 సంవత్సరాల వయసులో.. 1993లో గ్రామీణ విలేకరిగా ఆంధ్రజ్యోతి డైలీలో పనిచేయడం ద్వారా కెరీర్ మొదలుపెట్టాను. చీరాలలో 1995లో జరిగిన లాకప్‌డెత్ అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ ఘటనపై నేను రాసిన పలు పరిశోధనాత్మక కథనాలు నాకు తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. (తర్వాత దాన్ని ఆధారం చేసుకొని నవ్య వీక్లీలో రాసిన ‘లాకప్‌డెత్’ కథకూ చాలా మంచి పేరు వచ్చింది.) అదే కాలంలో దాదాపు అన్ని ప్రధాన దిన పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో సామాజిక అంశాలు, సమస్యల మీద అనేక పరిశోధనాత్మక వ్యాసాలు రాశాను. 1996లో హైదరాబాద్‌కు వచ్చి.. ప్రముఖ కవి, జర్నలిస్టు, నా గురువు అఫ్సర్ ప్రోత్సాహంతో ఆంధ్రభూమి డైలీలో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా అనేక వ్యాసాలు రాశాను. ఆయనే నాతో తొలి సినిమా సమీక్ష రాయించారు. ఆ తర్వాత ఆంధ్రభూమిలోనే మిత్రుడు అబ్దుల్ సహకారంతో 2002లో సినిమా రిపోర్టర్‌గా చేరి, 2007 వరకు పనిచేశాను. ఈ కాలంలో వందలాది సినిమా సమీక్షలు, వ్యాసాలు రాశాను. ఫ్యాక్షన్‌ను గ్లోరిఫై చేస్తూ తీసిన సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు సహా పలు నంది అవార్డులు ఇస్తే, “మళ్లీ హింసకే నంది “అంటూ రాసిన వ్యాసానికి ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు, సహ జర్నలిస్టుల అభినందనలు అందుకున్నాను. ఆంధ్రభూమి సినిమా స్పెషల్ ‘వెన్నెల’ ద్వారా చల్లా శ్రీనివాస్, బుద్ధి యజ్ఞమూర్తి, అబ్దుల్ (తెలుగు సినిమా), సికిందర్ (హిందీ సినిమా).. ఈ నలుగురూ ఆ టైమ్‌లో ఓ వెలుగు వెలిగారు.
2008 నుంచి 2017 వరకూ ఆంధ్రజ్యోతి డైలీలో సీనియర్ రిపోర్టర్‌గా పనిచేశాను. ఎంతోమంది సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేయడంతో పాటు, పలు వ్యాసాలు రాశాను. ఆ తర్వాత ఏడాదిన్నర పాటు ‘మనం’ దినపత్రిక సండే ఇన్‌చార్జిగా పనిచేశాను. 42 ఆదివారం అనుబంధం సంచికలు తెచ్చాను. ప్రతి సంచిక లైబ్రరీలో దాచుకోదగ్గదిగా పలువురు రచయితలు, కవుల నుంచి ప్రశంసలు అందుకున్నాను. ఈ క్రెడిట్ నాకు సహకరించిన రచయితలదే. 2019 ఆగస్ట్ నుంచి ‘తెలుగువన్ డాట్ కామ్’ సినిమా సెక్షన్‌కు ఎడిటర్‌గా పనిచేస్తూ వస్తున్నాను. దాంతో పాటు కొంత కాలంగా తెలుగువన్ యూట్యూబ్ చానల్‌కు సెలబ్రిటీ ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నాను. ఇదో కొత్త అనుభవం. దీన్ని ఆస్వాదిస్తున్నాను. అలాగే రచయితగా, కవిగా దిన, వార, మాస పత్రికలు, వెబ్ మ్యాగజైన్లలో 70కి పైగా కథలు, 30కి పైగా కవితలు పబ్లిష్ అయ్యాయి.
నాతో పాటు పాత్రికేయ శిరోమణి పురస్కారాన్ని అందుకున్న సహ జర్నలిస్టులకు నా అభినందనలు. వ్యక్తిగతంగా టీవీ9 రవిచంద్ర రెండు దశాబ్దాలుగా సన్నిహిత పరిచయం ఉన్నవాడు. తరచూ సినిమా ప్రెస్‌మీట్లలో, ఈవెంట్లలో కలుస్తూ ఉండేవాడు. ప్రస్తుతం సీవీఆర్‌లో చేస్తోన్న రూపవాణిగారైతే నాలుగేళ్లుగా పరిచయం. ఆంధ్రజ్యోతి మురళీధర్‌తో ఒకట్రెండు సార్లు మాట్లాడాను. మిగతా జర్నలిస్టులతో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. వారందర్నీఈ విధంగా కలవడం ఆనందదాయకం.
ఫొటోలు :
-ఏప్రిల్ 20-2022 రాత్రి రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్‌వెల్ కార్పొరేషన్, తిరుమల బ్యాంక్ కలిసి నిర్వహించిన ఉగాది విశిష్ట పురస్కారాలు – 2022 ఈవెంట్‌లో తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాపతి ఎస్. మధుసూదనాచారి చేతుల మీదుగా ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారం – 2022 అందుకున్న క్షణాలు…
-అవార్డు తీసుకొనే ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూడాలని వచ్చిన అర్ధాంగి కృష్ణవేణితో…