ప్రచారం ‘పల్స్’ పట్టేస్తున్న తెలుగు సినిమా!

ప్రచారం ‘పల్స్’ పట్టేస్తున్న తెలుగు సినిమా!
Spread the love

తెలుగు సినిమా ప్రచారం గురించి కొంత మాట్లాడుకోవాలి. 80 దశాబ్దాలు దాటిన తెలుగు సినిమా ప్రచారం -కొత్త వేళ్లూనుతోంది. సరికొత్త కోణాలు వెతుకుతోంది. లుక్కులు, చాప్టర్లు, ఫెస్ట్‌లు, ఫీస్ట్‌లతో కొంగొత్త వెలుగులూ విరజిమ్ముతోంది. ప్రచారం ‘పల్స్’ పట్టేందుకు ఇంకేవేవో చేస్తోంది కూడా. మొత్తంగా ప్రచారం మాత్రం సినిమాను మించిపోతోంది. ప్రమోషన్‌తో -సినిమా హిట్టు ఫట్టుకు సంబంధం లేదు. కానీ, ఆ సినిమావైపు దృష్టిని మరల్చాలంటే బలమైన ప్రచారం ఒక్కటే మార్గం. తప్పదు.
ప్రచార పరిణామక్రమాన్ని ఒక్కసారి పరిశీలిస్తే-అరవయ్యో దశకం సినిమా ప్రచారం ఇప్పటి జనరేషన్‌కు అర్థమయ్యేలా చెప్పాలంటే ‘పక్కా నాటు’ అంటే సరిపోతుందేమో. జట్కా బండికో, జోడెద్దుల గూడుబండికో పోస్టర్లు అంటించి, కరపత్రాలు పంచుతూ సినిమా ప్రమోషన్ సాగేది. పల్లెల్లో జరిపే ప్రచారంతో పాటు తెరలపై సినిమాలూ ప్రదర్శించేవారు. 70వ దశకం వచ్చేసరికి ప్రమోషన్ కాస్త మారింది. పూర్తిగా వాల్‌పోస్టర్లు వచ్చేశాయి. రిక్షాలు ప్రచార సాధనాలయ్యాయి. ప్రత్యేక సినిమా పోస్టర్ల విడుదల, పాటల వేడుకలు, విజయోత్సవ సభలు, యాభై రోజుల వేడుక, శతదినోత్సవ పండుగ, వన్‌ఫిఫ్టీ డేస్, వన్ సెవెంటీఫైవ్ డేస్ అన్న కొలమానాలు ప్రమోషన్‌లో భాగమయ్యాయి. 80వ దశకం వచ్చేసరికి -సినిమా ప్రెస్‌మీట్ల వ్యవహారం వచ్చింది. ఇంటర్వ్యూలు, లొకేషన్ షూటింగ్ కవరేజ్‌లు.. ఆడియో వేడుక, ప్లాటినం డిస్క్ వేడుకలు, సినిమా విడుదలకు ముందు టూర్లులాంటి పరిణామాలు వచ్చాయి. 90వ దశకం వచ్చేసరికి -పోస్టర్లలో అధునాతన పోకడ వచ్చింది. ఫస్ట్‌లుక్ పోస్టర్ అంటూ ఒకటి బయటికి వదిలేవారు. లొకేషన్ షూటింగ్ కవరేజ్‌లు బలోపేతమయ్యాయి. ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూలు, ఆడియో వేడుకల బలం పెరిగింది. మిలీనియం ముగింపునకు వచ్చేసరికి -సినిమాపై సాంకేతిక ప్రభావం పెరిగింది. అప్పుడే అందుబాటులోకి వచ్చే టెక్నాలజీని ప్రధాన ప్రచార సాధనం చేసుకుంటూ -సంప్రదాయబద్ధంగా వస్తోన్న ప్రచార విధి విధానాలను అమలు చేసేవి చిత్రబృందాలు. మిలీనియం దాటి దశాబ్దం గడిచేసరికి -సాంకేతికత పూర్తిగా విస్తరించేసింది. గోడ పోస్టర్లు కాస్తా స్క్రీన్ పోస్టర్లైన దశ మొదలైంది. అంతేకాకుండా -సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ను ప్రమోషన్‌కు ఉపయోగించే మ్యాజిక్ మొదలైంది. టీజర్ లాంచ్.. పోస్టర్ లాంచ్.. ప్రీ లుక్, ఫస్ట్ లుక్, ట్రైలర్ లాంచ్, సక్సెస్ మీట్, టీం థియేటర్ విజిట్స్.. ఇలా రకరకాల పేర్లతో సినిమాను ప్రమోట్ చేయడం మొదలైంది. ఈ దశలోనే సినిమా ఎక్కువ రోజులు థియేటర్‌లో నిలబడే పరిస్థితి క్రమంగా తగ్గడం మొదలైంది. లెటెస్ట్ ప్రమోషన్స్ స్టయిల్ అనేక రూపాలు తీసుకుంటోంది. విస్తరించిన టెక్నాలజీతో ప్రపంచం పూర్తిగా అరచేతిలోకి ఇమిడిపోతున్న ఈ రోజుల్లో -సినిమాకు ప్రధాన గ్లామరైన హీరో హీరోయిన్ల హంగామాను విడుదలకు ముందే ‘లైవ్’ షోస్‌తో చూపించటం మొదలైంది. ఇలా సినిమా ప్రమోషన్‌ను చర్చించుకోడానికి సవాలక్ష కోణాలు. కాకపోతే -ప్రచారమంతా సినిమాను ఆడియన్స్ వద్దకు తీసుకెళ్లడానికే. థియేటర్‌లో బొమ్మపడిన తరువాత -జడ్జిమెంట్ మాత్రం ఆడియన్స్ చేతుల్లోనే! అదీ..సంగతీ!!

Related posts

Leave a Comment