తెలుగు, హిందీ భాషల్లో ‘స్ట్రీట్ లైట్’

street lighjt movie producer mamidala srinivas interview
Spread the love

ప్రముఖ చిత్ర నిర్మాత, ఫిలిం మేకర్ మామిడాల శ్రీనివాస్ తో ‘ఫేస్ 2 ఫేస్’

“తెలంగాణలో గొప్ప కథలున్నాయి, సంగీతం ఉంది. భాషా సంస్కృతులున్నాయి. ఎలాగైతే బెంగాల్ లో, కేరళలో రీజినల్ సినిమా ఎదిగిందో అలాగే తెలంగాణ సినిమాకి కూడా విస్తృతంగా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కుకునే శక్తి సామర్ధ్యాలున్నాయి. అయితే తెలంగాణ సినిమా తనదైన ప్రాంతీయ లక్షణాల్ని పుణికి పుచ్చుకోవాల్సివుంది. కథల పరంగాను.. కళాత్మకంగాను తెలంగాణ ముందున్నప్పటికీ.. సినిమా సాంకేతికత తోడైన కళ గనుక తెలంగాణ యువత ఫిలిం టెక్నాలజీలో ఉన్నతస్థాయి శిక్షణ పొందాల్సి ఉంది. అప్పుడే తెలంగాణ సినిమా ఎల్లలు దాటి ముందుకు వెళ్లగలుగుతుంది. అలాగే కొత్త ఆలోచనలకు, కొత్త భావాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం కూడా ఉంది. వ్యాపార సినిమాకి వున్న మూసకట్టు సూత్రాలకు భిన్నంగా తెలంగాణ చలన చిత్రకారులు ఆలోచించాల్సి ఉంది” అంటున్నారు ప్రముఖ చిత్ర నిర్మాత, ఫిలిం మేకర్, ప్రొడక్షన్ డిస్ట్రి బ్యూషన్ అండ్ ఎగ్జిబిటర్ మామిడాల శ్రీనివాస్. 4 సినిమాలకు నిర్మాతగా, 25 సినిమాలకు డిస్ట్రి బ్యూటర్ గా వ్యవహరించిన అనుభవం ఆయనది. అంతే కాదు.. మూవీ మాక్స్ కంపెనీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్సుగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఇతర రాష్ట్రమైన కర్ణాటకలో సైతం చాలా స్క్రీన్ లు ఉండడం విశేషంగా చెప్పుకోవాలి.
మూవీ మేకర్స్ బ్యానర్ సమర్పణలో మామిడాల శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో తాజాగా తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘స్ట్రీట్ లైట్’. ఈ చిత్రానికి విశ్వ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి తాన్యా దేశాయ్ ప్రధాన భూమికను పోషించింది. మరో ముఖ్యమైన పాత్రలో హీరో వినోద్ కుమార్ నటించారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి, థియేటర్లలో ‘స్ట్రీట్ లైట్’ వెలుగులు విరజిమ్మడానికి మామిడాల శ్రీనివాస్ అన్ని విధాలా తుఫాన్ వేగంతో దూసుకొస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మామిడాల శ్రీనివాస్ కు ఫిలిం మేకర్ గానే గాక, మంచి మనసున్ననిర్మాతగా, ప్రొడక్షన్ డిస్ట్రి బ్యూషన్ అండ్ ఎగ్జిబిటర్ గా ప్రత్యేకమైన పేరుంది. సినిమాను అమితంగా ప్రేమించే ఆయన అంతే ఇష్టంగా సినిమాలే ప్రాణంగా నమ్ముకున్న వారిని సైతం ప్రోత్సహిస్తుంటారు. వివిధ రంగాల్లో రాణించాలనుకుంటున్న వారికి తనదైన పంథాలో మార్గాన్ని చూపుతుంటారు. అదే మనసున్న మామిడాల శ్రీనివాస్ ప్రత్యేకత. ఫిలిం మేకర్ గానే గాక, 1994లో ప్రాంప్టు కంప్యూటర్ టెక్నాలజీని స్థాపించి ఫౌండర్ గా పేరు ప్రఖ్యాతులు గడించారు. గత 26 ఏళ్లుగా గొప్ప బిజినెస్ మ్యాన్ గానూ సాఫ్ట్ వేర్ అండ్ హార్డ్ వేర్ కన్సల్టెంట్, ట్రైనింగ్ అండ్ డెవలప్ మెంట్ లో ముందంజలో ఉన్నారు. 2001, 2002లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ప్రభుత్వాల చేత అవార్డులు సైతం అందుకున్నారు. జనవరి, 2004 నుంచి ఇప్పటివరకు శ్రీ రాజేశ్వరి ఫిలింస్ ద్వారా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూటర్ గా తెలుగు, హిందీ సినిమాలను విడుదల చేశారు. టెలివిజన్ సీరియల్స్ లో పాలుపంచుకున్నారు. ఇలా విభిన్న రంగాల్లో అడుగులు వేసి తన ప్రతిభను చాటుకున్న మామిడాల శ్రీనివాస్ స్వతహాగా 2017లో మూవీ మాక్స్ ను స్థాపించి.. ఆ విధంగా ఓ విభిన్నతను సంతరించుకున్నారు. ప్రొడక్షన్ అండ్ డిస్ట్రీ బ్యూటర్ గా ఎన్నో చిత్రాలను అందించారు. వాటిలోకి ఓ సారి తొంగి చూస్తే.. సారీ..నాకు పెళ్లైంది, లేడీస్ టైలర్, మారో, శివపుత్రుడు, పోతురాజు, చంద్రముఖి, అపరిచితుడు, అబద్ధం, అమృతవర్షం, ఖతర్నాక్ , సమర్ధుడు, కుబేరులు, సూర్య సన్నాఫ్ కృష్ణన్, హేట్ స్టోరీ-2, లవ్వాట, గీతా ఛలో, ఊరంతా అనుకుంటున్నారు, మిఠాయి, తెనాలి రామకృష్ణ, రాగల 24 గంటల్లో ఉన్నాయి. ఇలా.. విభిన్నరంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటున్న మామిడాల శ్రీనివాస్ తో.. ‘ఫేస్ 2 ఫేస్’ మీకోసం..

  • మీ తాజా చిత్రం ‘స్ట్రీట్ లైట్’ గురించి చెప్పండి…?
  • కరోనా నిబంధనలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ఆరోగ్య శాఖ నిబంధనలకు లోబడి ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి రూపొందించాం. ఇందుకోసం ఓ భారీ స్ట్రీట్ లైట్ సెట్ ను వేసి, ప్యాండమిక్ టైమ్ లో కూడా కేవలం రెండు షెడ్యూల్ లో 45 వర్కింగ్ రోజుల్లో చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేశాం. ఈ చిత్రం మొత్తం పూర్తి కావడానికి మా యూనిట్ సభ్యులు అహో రాత్రులు శ్రమించారు. అందుకు వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి ప్యాండమిక్ టైమ్ లోయూనిట్ సభ్యుల సహకారాలు మరువలేనిది. అంతేగాక, డాక్టర్ పరమ హంస గారు మా చిత్ర నిర్మాణంలో, కథా గమనంలో తనవంతు సహాయ సహకారాలు అందించి మాకు అన్ని విధాలా అండగా నిలిచి ఈ చిత్ర విలువల్ని మరింత పెంచారు. చిత్ర దర్శకుడు విశ్వ చిత్ర నిర్మాణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించి చిత్రం చక్కగా తెరకెక్కడానికి కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా తనవంతు పాత్రని విజయవంతంగా పోషించారు.
  • ‘స్ట్రీట్ లైట్’ చిత్ర కథ ఎలా ఉండబోతోంది…?
  • హ్యూమన్ బిహేవియర్ ఇన్ డార్క్ నెస్ .. చీకటి పడ్డ తర్వాత మనుషుల ప్రవర్తనలు ఎలా మారి పోతాయి? అన్న విభిన్న కోణంలో ‘స్ట్రీట్ లైట్’ కింద ఒక రాత్రి జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాను రూపొందించాం. చిత్రాన్ని సహజంగా చూపిస్తూనే , మా ‘స్ట్రీట్ లైట్’ సినిమాలో ప్రతి ప్రేక్షకుడిని థ్రిల్ కి గురి చేస్తూనే పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ ని కూడా జోడించాం. ఈ ‘స్ట్రీట్ లైట్’ సినిమా అందర్నీ వెలుగులోకి తీసుకెళ్లి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుందన్న గట్టి నమ్మకం మాకుంది.
  • ఈ ‘స్ట్రీట్ లైట్’ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతికత వివరాలు చెబుతారా..?
  • షకలక శంకర్, చిత్రం శ్రీను, ధన్ రాజ్, డాక్టర్ పరమహంస, అంకిత రాజ్, వైభవ్, కావ్యారెడ్డి, బాలాజీ జాగలింగం తదితరులు నటించారు. ఆయా పాత్రల్లో వారు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశారు. ఈ ‘స్ట్రీట్ లైట్’ చిత్రానికి సంగీతం: యు.ఎల్.వి ప్రద్యోదన్, డైరెక్టర్ ఆఫ్ ఫోటో గ్రఫీ: రవికుమార్ నీర్ల, మాటలు-పాటలు: విష్ణు శర్మ, ఎడిటింగ్: శివ వై. ప్రసాద్.
  • తెలంగాణ సినిమా గురించి మీ అభి ప్రాయం..?
  • ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటయి విజయవంతంగా ముందుకు సాగుతున్నది. అనేక విజయాలు వివిధ కోణాల్లోంచి ఎన్నో ఆటంకాలూ ఎదురవుతున్నా తెలంగాణ తన దారిలో తాను ముందుకు సాగుతూనే వుంది. ఈ నేపథ్యంలో భిన్నమైన అంశాలతో పాటు, తెలంగాణ సాంస్కృతిక రంగం వైపు కూడా కృషి జరుగుతున్నది. ఇది ఎంతో మంచి పరిణామం. ఇంకా సాగవలసి వుంది. సంస్కృతిలో కానీ, సాంస్కృతిక రంగంలోకానీ తెలంగాణది విలక్షణమైన ఒరవడి. సాంస్కృతిక రంగంలో మిగతావాటి కంటే సినిమాది ప్రత్యేకమైన స్థానం. అది అత్యంత ప్రభావంతమయింది. సామాన్య ప్రజల్లో విస్తృతంగా ఆదరణ పొందింది. అందుకే తెలంగాణ సినిమా దాని దశ-దిశ గురించి చర్చ జరగాల్సి ఉంది.
  • తెలుగు సినిమాల్లోతెలంగాణాకి ఏ విధమైన గుర్తింపు వచ్చిందనుకుంటున్నారు..?
  • తెలుగు సినిమాల్లో తెలంగాణాకి గత ఎనిమిది దశాబ్దాల్లో ఏనాడూ అందవలసిన స్థానం గాని, గుర్తింపు గానీ రాలేదు. ఎక్కడైనా వచ్చినా అది హాస్యానికో, ఎగతాళికో తప్ప సరైన స్థానం లభించలేదు. వర్తమాన తెలుగు సినిమా రంగం ఈ రోజు కేవలం టెక్నాలజీపైన ఆధారపడి వ్యాపారం కోసమే మనుగడ సాగిస్తున్నది. సినిమా ఒక కళ. దానికో సామాజిక కోణం ఉందన్న సంగతి ఎప్పుడో మర్చిపోయింది. అలాగని ఆర్ధికంగా ఎంత మేర బాగుందన్నది వేరే చర్చ. పెట్టుబడి తిరిగిరాని సినిమాలు, విజయాల్లేక హీరోలు అల్లాడుతున్నారు. కేవలం పది శాతం మాత్రమే ఆర్ధిక విజయాలు అందుకుంటున్నాయి.
  • తెలంగాణ గడ్డమీద సినిమా సంగతి ఎలా వుందని మీరనుకుంటున్నారు…?
  • తెలంగాణ గడ్డమీద సినిమా సంగతి ఎలా వుందని ఆలోచించినప్పుడు ముంబై తర్వాత అధికంగా చిత్రాల నిర్మాణం జరుగుతున్న కేంద్రంగా హైదరాబాద్ కు పేరుంది. లెక్కలు తీసుకుంటే ఒక సందర్భంలో ఇక్కడే అధిక సంఖ్యలో నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కేవలం తెలుగు మాత్రమే గాకుండా, హిందీతో పాటు, అనేక భారతీయ భాష చిత్రాలు, కొన్ని హాలీవుడ్ చిత్రాలు కూడా ఇక్కడ నిర్మాణమవుతుండడం గొప్ప విషయమే. అంతలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ సమకూరింది. ఆర్థికంగా ఇది తెలంగాణకు బలమే. సినిమా అద్భుతమయిన అత్యంత ప్రభావవంతమైన మాధ్యమం. అన్ని సృజనాత్మక కళారూపాల్లో సినిమా వయసు రీత్యా చిన్నది. కానీ దాని ప్రభావం చాలా విస్తృతమైంది. సినిమా మనిషి మనోభావాల పైన, రాజకీయాలపైన తనదైన ముద్రను కలిగిఉంది. దేశం మొత్తం మీద హిందీ తర్వాత సంఖ్యాపరంగా అధిక సినిమాలు నిర్మిస్తున్న తెలుగు సినిమా రంగం గత ఎనిమిది దశాబ్దాలుగా తెలుగు ప్రజల జీవితాలతో విడదీయరాని బంధాన్ని కలిగి వుంది. ఇలా అనేక రకాలుగా వినూతనంగానూ , విలక్షణంగాను ముందుకు సాగుతున్న ప్రభుత్వం తెలంగాణ సినిమా దశ-దిశను మార్చాల్సిన అవసరం ఉంది. తెలంగాణాలో బంగారు సినిమా రూపొందడానికి తక్షణమే నడుం బిగించాల్సిన తరుణం ఆసన్నమయింది.
  • మీ తదుపరి ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి…?
  • తదుపరి ప్రాజెక్ట్స్ గురించి చెప్పాలంటే… తెలుగు, హిందీ భాషల్లో ఐదుగురు హీరోలతో ఒక బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ తో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. పరమహంస గారి దర్శకత్వంలో పురుడు పోసుకోనున్న ఈ సినిమాకు సంబంధించి మార్చి 18న షూటింగ్ ప్రారంభించబోతున్నాం

Related posts

Leave a Comment