మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకులముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రం నుంచి చిరంజీవి, రెజీనాలపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం ‘కల్లోలం కల్లోలం.. ఊరు వాడా కల్లోలం’ అనే పాటని మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ.. చూసేవాళ్ల కళ్లు కాకులెత్తుకు పోనీ..’ అంటూ జోరుగా ఎంతో హుషారుగా సాగిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించగా, రేవంత్, గీతామాధురి ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ నృత్యరీతులు సమకూర్చారు. నైట్ ఎఫెక్ట్‌లో పాటని చిత్రీకరించిన విధానం, బీట్‌కి తగ్గట్లుగా మెగాస్టార్ వేసిన హుషారైన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేవాదాయ శాఖలోని అవినీతి నేపథ్యం చుట్టు అల్లుకున్న కథతో ఈ చిత్రం రూపొందినట్లు సమాచారం. ఈ సినిమా కోసం ధర్మస్థలి అనే ఓ భారీ ఊరి సెట్‌ను వేశారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించగా.. రామ్ చరణ్‌కు జోడీగా క్రేజీ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఆడిపాడింది. ఈ చిత్రం విడుదల కోసం మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు!!
అదిరిపోయే ‘ఆచార్య’ స్టెప్పులు!
