అందరి దృష్టి ‘ఆదిపురుష్’పైనే!

అందరి దృష్టి 'ఆదిపురుష్’పైనే!
Spread the love

‘బాహుబలి’ చిత్రం తర్వాత నుంచి పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నారు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ తో పాటు ప్రాజెక్ట్ కె, సలార్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అంటూ మరో మూడు సినిమాలను చేస్తూ ఆయన యమ బిజీగా ఉన్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రం భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్యాన్ వరల్డ్ స్థాయిలో భారీగా విడుదలకు శరవేగంగా సిద్ధమవుతోంది. సాహో, రాధేశ్యామ్ చిత్రాల తర్వాత ప్రభాస్ చేస్తోన్న సినిమా ‘ఆదిపురుష్’ కావడంతో ఈ చిత్రంపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని రిట్రో ఫైల్స్ సంస్థతో కలిసి టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లంకేశ్‌గా సైఫ్ ఆలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్ , హనుమంతుడిగా దేవ్ దత్త నటించారు. రూ. 400 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైనప్పుడు ‘ఆదిపురుష్’ టీమ్ అభిమానుల నుండి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే! దీంతో ఈ సినిమాలోని మొత్తం గ్రాఫిక్స్ వర్క్‌ను మార్చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘ఆదిపురుష్’ విడుదల వాయిదా పడింది. ఇదిలా ఉండగా ‘ఆదిపురుష్’నుండి మరో కొత్త సమాచారం తెలిసింది. శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్రం నుండి మరో అప్ డేట్ రానుందని యూనిట్ చెప్పుకుంటున్నారు. మరో టీజర్‌ను ప్రేక్షకుల్లోకి వదలనున్నట్లు తెలుస్తోంది. అందుకు రంగం మొత్తం రెడీ అయిందట. అంతేకాదు.. ఈ చిత్రానికి సంబంధించి మెరుగైన గ్రాఫిక్స్ కోసం ఈ ప్రాజెక్ట్‌పై ‘ఆదిపురుష్’ టీమ్ రీవర్క్ చేస్తుందట. అందుకోసం సుమారు 100 -150 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. రామాయణ కథా కావ్యానికి దృశ్య రూపంగా రానున్న ‘ఆదిపురుష్’ చిత్రాన్ని పూర్తిగా గ్రీన్‌ మ్యాట్ పైనే చిత్రీకరించారు దర్శకుడు ఓమ్ రౌత్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ శరవేగంగా జరుగుతుందట. అయితే.. ఈ ‘ఆదిపురుష్’ కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని జోరుగా టాక్ వినిపిస్తోంది. ఒకవేళా ఇదే నిజమైతే.. భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ప్రభాస్ ఒకరని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రభాస్ వరల్డ్ మార్కెట్ పై ఎంతో పోకస్ చేస్తున్నారు. అందులో భాగంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న “ప్రాజెక్ట్ కే” భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్‌లో కూడా విడుదల కానుంది. ఆదిపురుష్, సలార్ సినిమాలు కూడా అదే బాటలో వస్తున్నాయి.
ఇక ప్రభాస్ ‘సలార్’ విషయానికి వస్తే.. ఈ సినిమాకు కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చిందని తెలుస్తోంది. అయితే.. ఈ సినిమా పాన్ ఇండియా కాదట, పాన్ వరల్డ్ సినిమా అని తెలుస్తోంది. అందులో భాగంగా ఈసినిమా ఇంగ్లీష్‌లో కూడా విడుదలకానుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతి హాసన్ నటిస్తోంది. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. యాక్షన్ సిక్వెన్స్‌ను హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ను కొరియోగ్రఫి చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా విడుదలకానుంది. ఈ చిత్రానికి సంబంధించి శాటిలైట్ హక్కులు భారీ మొత్తం చెల్లించి స్టార్ మా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కెజీయఫ్ సినిమాలకు సంగీతం అందించిన రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. హోంబళే ఫిలిమ్స్ నిర్మిస్తోంది.. ‘సలార్’​ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇక ప్రభాస్ నటిస్తోన్న మరో ప్యాన్ ఇండియా సినిమా రాజా డీలక్స్ (పరిశీలనలో ఉన్న పేరు). మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. హార్రర్ కామెడీ జానర్‌లో వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి శరవేగంగా షూట్ జరుగుతోంది. ఈ సినిమాలో ఎక్కువ భాగం ఓ ఇంట్లోనే జరుగునుందట.. ఆ ఇంటి సెట్ కోసమే దాదాపు 6 కోట్ల వరకు ఖర్చు చేశారని సమాచారం. హార్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కొత్తగా కనిపించనున్నారట. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్టు సమాచారం. హీరోయిన్స్‌గా శ్రీలీల, మాళవిక మోహనన్, రిద్ధి కూమార్ ఖరారు అయ్యారు. మారుతి స్టైల్‌లో ఇది చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటుందట. ప్రభాస్ తన బిజీ షెడ్యూల్‌లో కూడా ప్రతి నెలా ఈ చిత్రానికి కొన్ని రోజులు కేటాయించి వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారట. థమన్ సంగీతం సమకూర్చనున్నారు. ముందుగా ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కబోతున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని.. వచ్చిన తర్వాత లాభాల్లో వాటా తీసుకోవాలని చూస్తున్నారు. సినిమాను 50 కోట్ల బడ్జెట్‌లోనే పూర్తి చేయాలనుకుంటున్నారు. వరుసగా పాన్ ఇండియన్ సినిమాలతో జోరు చూపిస్తున్న రెబల్ స్టార్.. కాస్త రిలీఫ్ కోసం కామెడీ జోనర్ ట్రై చేయబోతున్నాడు. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. దానికి కారణం ప్రభాస్ రెగ్యులర్ సినిమా చేసి చాలా కాలం కావడమే! అతి త్వరగా సినిమా విడుదల చేయాలని మారుతి కూడా గట్టి ప్లాన్ వేసుకుంటున్నాడు. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లాంటి సినిమాల్లో ప్రభాస్ చేసిన కామెడీ సూపర్‌గా వర్కవుట్ అయింది. కానీ సినిమాలే హిట్ అవ్వలేదు. కానీ మారుతి సినిమాతో హిట్ కొట్టాలనే కసితో కనిపిస్తున్నాడు రెబల్ స్టార్.
ప్రభాస్ చేస్తోన్న మరో భారీ సినిమా ప్రాజెక్ట్ కే . నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్‌ వరల్డ్‌ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం రెండు భాగాలుగా వస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని మరోవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ సినిమా కేవలం ఒక భాగమేనని సమాచారం. ఇక ఇప్పటికే దాదాపుగా 80 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించుకుని 2024లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్‌ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా నైజాం హక్కులను ఏషియన్ సంస్థ 70 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా భారతీయ ఇతిహాసం మహాభారతం స్పూర్తితో మూడో ప్రపంచ యుద్దం నేపథ్యంలో వస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిని పోలిన పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో సుదీర్ఘమైన ఐదు యాక్షన్‌ బ్లాకులు ఉన్నాయట. ఈ యాక్షన్ సీన్స్‌ను ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడని రీతిలో తెరకెక్కిస్తున్నారట నాగ్ అశ్విన్. ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్న హిందీ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్ రోల్ మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను పోలి ఉంటుందని అంటున్నారు. ‘ప్రాజెక్ట్ కే’ సినిమా పూర్తిగా బ్లూ మ్యాట్‌లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని అశ్వినిదత్ రూ.500 కోట్లు పైగా బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌లో వస్తున్న ఈ చిత్రం 2024లో విడుదలకానుంది.ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించనున్నారు.
ఇలా వరుస సినిమాలతో మన ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వేగాన్ని పెంచారు. చూడాలి మరి.. ఈ వేగం ఆయన కెరీర్ లో ఏ విధంగా పరుగులు పెడుతుందో…!

Related posts

Leave a Comment