తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది బాలరాజు ఆవేదన వ్యక్తంచేశారు. జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్టును నిరసిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ చౌరస్తాలో జర్నలిస్టులు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో నియంతృత్వ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం లో తమ బతుకులు మారుతాయని నాడు జర్నలిస్ట్లు ఉద్యమంలో ముందుండి పోరాటం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చాక విలేకరుల సంక్షేమం మాటేమో గానీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తాజాగా రఘు అరెస్టుతో రిపోర్టర్ ల పట్ల ప్రభుత్వ వైఖరి తేటతెల్లం అయింది అన్నారు. ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకొని జర్నలిస్టుల పట్ల కక్ష్యసాధింపులను మానుకోవాలని హితవు పలికారు. అక్రమంగా అరెస్టు చేసిన రఘును భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి సుధీర్ మంకల మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు రవీందర్ రెడ్డి, దయాకర్ రెడ్డి,. కృష్ణ రెడ్డి. లక్ష్మణ్, భాస్కర్ రెడ్డి. సంతోష్ రెడ్డి. అశోక్, కృష్ణ పంతులు, దత్తు, ప్రవీణ్, నవీన్. మూర్తి, మహేష్. సందీప్. ఉపేందర్. సంతోష్, వెంకటేష్. నవీన్.తదితరులు పాల్గొన్నారు.