15న రవీంద్రభారతి ప్రాంగణంలో బాలు విగ్రహావిష్కరణ

Unveiling of Balu's statue at Rabindra Bharathi campus on the 15th
Spread the love

– ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు
– సాయంత్రం సినీ సంగీత దర్శకులు, గాయకులచే బాలు సంగీత స్వర నీరాజనం

ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాన గాంధర్వుడు పద్మవిభూషణ్ డాక్టర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ ఈనెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు ఎన్. అచ్యుత రామరాజు, కార్యదర్శి బి. ఎస్. కృష్ణమూర్తి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, భారత పూర్వ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పాల్గొని బాలు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే దానం నాగేందర్, సంగీత నాటక అకాడమి చైర్ పర్సన్ డాక్టర్ అలేఖ్య పుంజాల, సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ గుమ్మడి వెన్నెల, కార్పొరేటర్ పి. విజయారెడ్డి తదితరులు పాల్గొంటారు. బాలు విగ్రహావిష్కరణ అనంతరం రవీంద్రభారతిలో జరిగే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభృతులు ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు పాడుతా తీయగా బాలు నివాళిగా సినీ సంగీత స్వర నీరాజనం ప్రారంభమవుతుంది. ప్రముఖ సినీ సంగీత దర్శకులు కీరవాణి, తమన్, సినీ నేపథ్య గాయకులు, బాలు కుటుంబ సభ్యులు పాల్గొంటారు. మ్యూజిక్ గ్రూప్ సంస్థ 1982లో డాక్టర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా చేతుల మీదుగా ప్రారంభమైందని బి. ఎస్. కృష్ణమూర్తి తెలిపారు. ఎన్నో వందల కార్యక్రమాలు, వందల మంది సంగీత కళాకారులతో దశాబ్దాలుగా స్వర ప్రస్థానం చేస్తున్నదని వారు వివరించారు. నాలుగు దశాబ్దాలుగా బాలుతో అనుబంధం కలిగి దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి బాలు నీడలో వృక్షంలా ఎదిగిందని వారు వివరించారు. రవీంద్రభారతిలో బాలు స్థాపించిన ఘంటసాల మాస్టర్ విగ్రహం పక్కన తన విగ్రహం కూడా ఉండాలని ఆయన పలు మార్లు చెప్పారని, అందుకే కొన్నేళ్లుగా తమ సంస్థ అక్కడ విగ్రహం నెలకొల్పడానికి కృషి చేసిందని చెప్పారు. ఆ ప్రయత్నం ఇన్నాళ్లకు ఫలించిందని సంతృప్తి వ్యక్తం చేశారు. బాలు విగ్రహాన్ని తమ సంస్థ తయారు చేయించిందని, రవీంద్రభారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. బాలు జ్ఞాపకాలు పాటలతో రవీంద్రభారతి వేదిక అవుతుందని, మ్యూజిక్ సంస్థ బాలుకు సగర్వంగా సమర్పిస్తున్న స్వర వనం అని ఎన్.అచ్యుత రామరాజు, బి. ఎస్.కృష్ణమూర్తి తెలిపారు. హాజరు కావాలనుకునే కళాభిమానులు సంగీత ప్రియులు ఎంట్రీ పాసుల కోసం 14వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి రవీంద్రభారతిలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Related posts