18న రవీంద్రభారతిలో టియస్సార్ పుట్టినరోజు వేడుకలు

TSR's birthday celebrations at Ravindra Bharathi on the 18th
Spread the love

వాసురావు, కసిరెడ్డి, గుమ్మడి, ప్రధాన అర్చకులకు సత్కారాలు
ప్రముఖ రాజకీయవేత్త కళాబంధు డా. టి. సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఈనెల 18వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు టియస్ఆర్ ఆధ్యాత్మిక కళా పరిషత్ కార్యనిర్వాహణా కార్యదర్శి డాక్టర్ ఎం.కె.రాము తెలిపారు. టి. సుబ్బరామిరెడ్డి ఆధ్యాత్మిక కళాపరిషత్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని ఆదివారం ఆయన వివరించారు. పూర్వ రాజ్యసభ సభ్యులు టిఎస్సార్ పుట్టినరోజు వేడుకలను ఆధ్యాత్మిక సాంస్కృతికోత్సవం గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టియస్సార్ పుట్టినరోజు సందర్భంగా గత కొన్నేళ్లుగా వందలాది ప్రముఖులను సత్కరించిన ఆయన ఈసారి సంగీత రంగం నుంచి ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి వాసురావు (చెన్నై), సాహిత్య రంగం నుంచి ఆచార్య డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి, రంగస్థలం నుంచి కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ లను ప్రత్యేకంగా సత్కరిస్తున్నట్లు వివరించారు. అలాగే ఆధ్యాత్మిక స్ఫూర్తిని ఇచ్చేందుకు భారతదేశంలోని ప్రధాన దేవాలయాలు తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, సింహాచలం, మధుర, షిరిడి తదితర దేవాలయాల ప్రధాన పురోహిత అర్చకులను సన్మానించనున్నారు. ఈ సందర్భంగా శాస్త్రీయ సంగీత దర్శకుడు వై.శ్రీనివాస్ యాదవ్ బృందం అన్నమాచార్య కీర్తనలు, కూచిపూడి నాట్య గురువు రేణుకా ప్రభాకర్ శిష్యుల నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో ప్రముఖ సినీ నటులు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం, జయసుధ తదితరులు పాల్గొంటారు. ఉచిత ప్రవేశం అని, కళాభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనాలని డాక్టర్ ఎం.కె.రాము ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్బంగా గుమ్మడి గోపాలకృష్ణ శ్రీకృష్ణుడు ఏకపాత్రాభినయం ప్రదర్శించనున్నారు.

Related posts