•కంటోన్మెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ జివి.వెన్నెల గద్దర్
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, మార్చి 03 : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి గడిచిన 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కంటోన్మెంట్ బోర్డు టీపీటీ నిధులను ఇటీవల రాష్ట్ర సీఎం ఎ.రేవంత్ రెడ్డి విడుదల చేయడం హర్షనీయమని కంటోన్మెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ జివి.వెన్నెల గద్దర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన విజ్ఞప్తి మేరకు సీఎం ఎ.రేవంత్ రెడ్డి పెండింగ్ లో ఉన్న రూ.48 కోట్ల 50 లక్షలు విడుదల చేయడం జరిగిందని గుర్తు చేశారు. దీనికి కంటోన్మెంట్ బోర్డు తరపున ఆమె సీఎం ఎ.రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.కంటోన్మెంట్ బోర్డు టీపీటీ నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వ జమలోకి వేసుకుని, 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉంచడం జరిగిందన్నారు. ఈ విషయంలో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ విన్నపం మేరకు వెంటనే స్పందించడం జరిగిందన్నారు. విడుదల చేసిన నిధుల ద్వారా కంటోన్మెంట్ బోర్డు ఎంప్లాయిస్ కి జీతాలు చెల్లించడం జరిగిందన్నారు. ఎస్ఎన్ డీపీ కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల నాలాలను తీసుకొచ్చి కంటోన్మెంట్ బోర్డులో వదిలేయడం జరిగిందని, దీంతో కంటోన్మెంట్ నాలాలను నిర్లక్ష్యం చేయడం జరిగిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లు నుంచి సర్వీస్ టాక్స్ రూ.800 కోట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం విడుదల చేసిన 33 ఎకరాల భూమిని ఎలాంటి విలువ కట్టకుండా ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మర్రి అమరేందర్ రెడ్డి, జయప్రకాష్, కానుగంటి రవి తదితరులు పాల్గొన్నారు.