హైదరాబాద్ , డిసెంబర్ 21: హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ రెండో హాల్‌లో ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ బహుమతి ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. శనివారం ప్రారంభమైన ఈ టోర్నమెంట్ పోటీలలో విజేత లుగా నిలిచిన చెన్నై కి చెందిన అన్యానప్ప 5 లక్షల ప్రైజ్ మనీతో మొదటి బహుమతి దక్కించు కోగా, రెండవ బహుమతి కింద 3 లక్షల రూపాయలు మిత్రోబకు, మూడవ బహుమతిగా హరికృష్ణకు లక్ష రూపాయలు అలాగే వివిధ క్యాటగిరిలు, ర్యాంకింగ్ ల ప్రకారం మిగతా మొత్తం అంటే 13 లక్షల 22 వేల 222 రూపాయలను బహుమతులు పొందిన వారికి అందజేశారు. ఈ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి నాంపల్లి కాంటెస్టెడ్ శాసనసభ్యులు ఫెరోజ్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. పిల్లల్లో ఏకాగ్రతను, మేధాశక్తిని పెంపొందించడంలో, చెస్ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. ఈ క్రీడలో ఎదగాలంటే కష్టపడి సాధన చేయాల్సిందేనని, నిరంతర శ్రమే విజయానికి మార్గమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఆటలో గెలుపు–ఓటములుసహజమని, గెలిచినా ఓడినా మళ్లీ మళ్లీ ఆడుతూ ముందుకు సాగితే ఒక రోజు తప్పకుండా విజయం వారిని వరిస్తుందన్నారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్ మాట్లాడుతూ ..పిల్లలలో ఉన్న ఆసక్తిని తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో ఏకాగ్ర అకాడమీలో శిక్షణ పొంది ఫిడే రేటింగ్ సాధించిన హైదరాబాద్‌కు చెందిన కవలలు అమాయ అగర్వాల్, అనయ్ అగర్వాల్‌లను నిర్వాహకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కవలల ద్వారా తమ అకాడమీకి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని పేర్కొంటూ వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీనటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ తెలంగాణలో రూ.22,22,222 భారీ ప్రైజ్ మనీతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందకరమని.. ఈ వాతావరణం చూశాక తన పిల్లలకు కూడా చెస్ నేర్పించాలి అనే ఆలోచన కలిగిందన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్‌మాస్టర్లు దీపెన్, సేతురామన్, అంతర్జాతీయ మాస్టర్లు, కోచ్‌లు, పిల్లల తల్లిదండ్రులతో పాటు అకాడమీ చైర్మన్ పానషా, ఆమె భర్త వరుణ్ అగర్వాల్, సీనియర్ జర్నలిస్ట్ అంజలి, ఏకగ్రా డైరెక్టర్లు సందీప్ నాయుడు, చైతన్య నాయుడు, గిరీష్ రెడ్డి,నితిన్, సౌజన్య జాను తదితరులు పాల్గొన్నారు.
హైటెక్స్‌లో ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ బహుమతి ప్రదానోత్సవం
