మద్రాసులో నట జీవితాన్ని ప్రారంభించిన నందమూరి తారక రామారావు మహానటుడుగా, మహోన్నత నాయకుడిగా భావితరాలకు స్ఫూర్తిని కలిగించారని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్.టి.ఆర్. సెంటినరీ కమిటీ చెన్నైలోని ఆంధ్రాక్లబ్ లో సమాలోచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చైర్మన్ టి.డి. జనార్థన్ మాట్లాడుతూ రామారావుగారి స్ఫూర్తితో తాను రాజకీయ రంగంలో ఎదిగానని, ఆయన తెలుగు జీవితంలో కొత్త వెలుగులు నింపారని ఎంతోమందికి రాజకీయ అవకాశాలను కల్పించారని, పేదవారి అభ్యున్నతికి పాటుపడ్డారని, మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారని తెలిపారు. రామారావు గారు భావితరాలకు స్ఫూర్తి కావాలనే ఉద్దేశంతో తాను కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటీ ఎన్.టి.ఆర్. అసెంబ్లీ ప్రసంగాలు, ఎన్.టి.ఆర్. చారిత్రక ప్రసంగాలు, శకపురుషుడు అన్న గ్రంథాలను వెలువరించిందని, జై ఎన్.టి.ఆర్. అన్న వెబ్ సైట్ ను కూడా ప్రారంభించామని తెలిపారు.…