* ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ హవా
* ఉపాధ్యక్షులుగా నాగవంశీ, భరత్ చౌదరి
* ట్రెజరర్‌గా ముత్యాల రాందాస్, జనరల్ సెక్రటరీగా అశోక్ కుమార్
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో నిర్మాత సురేష్‌బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో ఆయన విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో మన ప్యానల్ పేరిట చిన్న నిర్మాతలు, ప్రోగ్రెసివ్ ప్యానల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తన బలాన్ని నిరూపించుకుంది. మొత్తం 48 మంది కార్యవర్గానికి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 31, మన ప్యానెల్ నుంచి 17 మంది గెలుపొందారు. కార్యదర్శిగా అశోక్ కుమార్, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ, కోశాధికారిగా ముత్యాల రామదాసు, జాయింట్ సెక్రటరీలుగా మోహన్ వడ్లపట్ల, విజయేందర్ రెడ్డి గెలుపొందారు. తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌లో మొత్తం 3,355 మంది సభ్యులున్నారు. ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగనుంది. ప్రొడ్యూసర్స్ సెక్టార్ ఈసి మెంబర్స్ గా ఆశోక్ కుమార్ , సి కల్యాణ్ , వై వి ఎస్ చౌదరి , ప్రసన్న కుమార్ , దిల్ రాజు , నాగవంశీ, దామోదర్ ప్రసాద్, మోహన్ వడ్లపట్ల, రామసత్యనాతాయణ, కె.ఎస్ రామారావు, అమ్మిరాజు , చదలవాడ శ్రీనివాసరావు ఎన్నికవ్వగా, ప్రోగ్రసివ్ ప్యానల్ నుంచి ఐదుగురు, మన ప్యానెల్ నుంచి ఏడుగురు గెలుపొందారు. స్టూడియో సెక్టార్‌లో మన ప్యానెల్ ముగ్గురు, ప్రొగ్రెసివ్ ఒక్కరు రాగా, ఎగ్జిబిటర్స్ సెక్టార్‌లో గెలిచిన వారిలో 14 మంది ప్రోగ్రెసివ్ ప్యానల్ సభ్యులు కాగా, మన ప్యానెల్ నుంచి ఇద్దరు సభ్యులు, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో 12 ఈసి మెంబర్స్‌కు గానూ, ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 8 మంది.. మన ప్యానెల్ నుంచి 3 సభ్యులు గెలుపొందారు. ప్రస్తుతానికి టై అయింది. ఛాంబర్‌లో 3,355 మంది సభ్యులున్నారు. 3287 మందికి ఓటు వేసే అర్హత ఉంది. అయితే 40 శాతం అంటే 1417 ఓట్లు పోలయ్యాయి. ప్రొడ్యూసర్స్ సెక్టార్ నుంచి 805 ఓట్లు, స్టూడియో సెక్టార్ 66, డిస్ర్టిబ్యూటర్స్ సెక్టార్ 374, ఎగ్జిబిటర్స్ సెక్టార్ 172 ఓట్లు పోల్ అయ్యాయి. పరిశ్రమ సమస్యల పరిష్కారం, థియేటర్ల వ్యవస్థ మరియు నిర్మాణ రంగంలోని సవాళ్లపై ఈ కొత్త కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రసవత్తరంగా ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు
హైదరాబాద్ సినీ వర్గాల్లో ఉత్కంఠ రేపిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చిత్ర పరిశ్రమలోని వివిధ వర్గాల ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఫిల్మ్ నగర్ సందడిగా మారింది. ఆదివారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. సభ్యులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటును వేశారు. మన ప్యానల్ పేరిట చిన్న నిర్మాతలు, ప్రొగ్రెసివ్ ప్యానల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. చాలా విరామం తర్వాత ఈ ఎలక్షన్లు జరుగుతున్న క్రమంలో టాలీవుడ్‌లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ప్రారంభమైన ఫిలిం ఛాంబర్ ఎన్నికల పోలింగ్ మందకొడిగా కొనసాగింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ , స్డూడియో సెక్టార్ సభ్యులు అంతా స్వచ్ఛందంగా పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సమయంలో ఇరు ప్యానెళ్ల సభ్యుల మధ్య కొంత వాగ్వాదం నెలకొంది. అయితే.. ఈ క్రమంలో ఇరు ప్యానెల్స్ సభ్యులు యలమంచి రవి చంద్, అశోక్ కుమార్‌ల నడుమ కొంత వాగ్వాదం సైతం చోటు చేసుకుంది. పోగ్రెసివ్ ప్యానెల్ నుంచి అశోక్ కుమార్ గుర్తింపు లేని, చనిపోయిన ప్రొడ్యూసర్ల ఓట్లను మన ప్యానెల్ వారు వినియోగించు కుంటున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంగా ఓటు రాజకీయాలు కాదు సినిమాలు తీస్తే తెలుస్తుందంటూ అశోక్ కుమార్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో దిల్ రాజు వారిని సముదాయించారు. ఈసారి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల బరిలో రెండు ప్రధాన ప్యానళ్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. పరిశ్రమలోని అగ్ర నిర్మాతలంతా ఏకమై ‘ప్రొగ్రెసివ్ ప్యానల్’ తరపున అదృష్టాన్ని పరీక్షించుకోగా.. చిన్న నిర్మాతల గళాన్ని వినిపిస్తూ వారి సమస్యలే ప్రధాన ఎజెండాగా ‘మన ప్యానల్’ పోటీకి దిగింది. పెద్ద నిర్మాతల ఆధిపత్యం ఒకవైపు, చిన్న సినిమాల మనుగడ కోసం పోరాడుతున్న నిర్మాతలు మరోవైపు నిలవడంతో ఈ ఎన్నికల ఫలితాలు ఇండస్ట్రీలో ఎవరి బలాన్ని చాటుతాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
44 స్థానాల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్-28, మన ప్యానల్-15 మంది విజయం
ప్రొడ్యూసర్స్ సెక్టార్ – మన ప్యానల్ నుంచి ఏడుగురు గెలుపు
ప్రొడ్యూసర్స్ సెక్టార్ – ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి ఐదుగురు విజయం
ఎగ్జిబిటర్స్ సెక్టార్ – ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 14 మంది గెలుపు
ఎగ్జిబిటర్స్ సెక్టార్ – మన ప్యానెల్ నుంచి ఇద్దరు విజయం
స్టూడియో సెక్టార్‌లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఒకరు విజయం
స్టూడియో సెక్టార్‌లో మన ప్యానెల్ నుంచి ముగ్గురు గెలుపు
డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ – ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 8 మంది విజయం
డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ – మన ప్యానెల్ నుంచి ముగ్గురు గెలుపు
ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్‌బాబు
