* ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన నటి
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ఎంతోమందిని నవ్వించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి పావలా శ్యామల ఇక లేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున 1.52 నిమిషాలకు గుండెపోటు రావడంతో మరణించినట్లు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. కూతురి దీనస్థితి.. పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో జీవన పోరాటం సాగిస్తున్నారు. ఆమెతో పాటే ఉన్న ఆమె కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పూయించిన నటి, చివరి రోజుల్లో ఇంతటి దయనీయ స్థితిలో కన్నుమూయడం చిత్ర పరిశ్రమను, అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. 1984లో చిరంజీవి ఛాలెంజ్ సినిమాతో తెరంగేట్రం చేసిన పావలా శ్యామల సుమారు 100 వరకు సినిమాల్లో నటించగా చివరగా 2019లో వచ్చిన ‘మత్తు వదలరా’ చిత్రంలో కనిపించారు. 2014 నుంచి తీవ్ర అర్థిక, వృద్దాప్య సమస్యలతో సతమతమవుతున్న ఆమె ఆపై కూతురితో కలిసి ధీన స్థితిలో కాలం వెళ్ల దీశారు. ఈ విషయం పత్రికల ద్వారా తెలుసుకున్న నాటి తెలంగాణ సీఎం తక్షణ సాయం కింద రూ.20 వేలు ఆర్ధిక సాయం అందించడంతో పాటు నెల నెలా ఫించన్ అందేలా చూశారు. కానీ మరలా నాలుగైదేండ్లకే పరిస్థితి మొదటికి రావడంతో సినీ నటులు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్, దిల్ రాజు వంటి వారు సాయం చేస్తూ వచ్చారు.
సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
