సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ రివ్యూ …రొటీన్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్!

Spread the love

హీరో శివాజీ – లయ కాంబినేషన్ మన టాలీవుడ్ హిట్ జంటల్లో ఒకటిగా బాగా గుర్తింపు పొందింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తాజా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. మొదట ఓటిటికి ప్లాన్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం (మార్చి 6, 2026) థియేటర్స్ లోకి అడుగు పెట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? తెలుసుకుందాం…
కథ: శ్రీరామ్ అన్నమయ్య జిల్లా కొత్తపేటలో పంచాయితీ సెక్రటరీగా పనిచేస్తుంటాడు. అతడు నీతి, నిజాయితీకి మారుపేరు. లంచాలు, అవినీతికి ఆమడ దూరంలో ఉంటాడు. అయితే భార్య ఉత్తర (లయ) మాత్రం అక్రమ సంపాదన కోసం భర్త శ్రీరామ్‌ను వేధిస్తుంటుంది. కొడుకు మిట్టు (రోషన్) తుంటరి పనులు చేస్తూ హింసకు పాల్పడుతుంటాడు. భార్య, కొడుకులతో వేగలేకపోతున్న సమయంలో విక్రమ్ వాసుదేవ్ (ప్రిన్స్) అనే ఇన్స్‌పెక్టర్‌ తన ఇంట్లోనే హత్యకు గురవుతాడు. దాంతో గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని దాచేయాలని శ్రీరామ్ కుటుంబం ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఇంతలో ఎమ్మెల్యే (శరత్ లోహితాశ్వ) వర్గం శ్రీరామ్ ఫ్యామిలీని వెంటాడుతుంది. శ్రీరామ్ ఇంట్లో ఇన్స్‌పెక్టర్ విక్రమ్ వాసుదేవ్ ఎలా హత్యకు గురయ్యాడు? శవాన్ని మాయం చేయడానికి శ్రీరామ్ ఫ్యామిలీ ఎలాంటి ప్రయత్నాలు చేసింది? ఎమ్మెల్యే వర్గం శ్రీరామ్ ఫ్యామిలీని ఎందుకు వెంటాడింది? విక్రమ్ వాసుదేవ్ హత్యకు కారణం ఏమిటి? ఈ హత్య నుంచి శ్రీరామ్ ఫ్యామిలీ ఎలా తప్పించుకొన్నది? నిజాయితీపరుడైన శ్రీరామ్‌కు వృత్తిపరంగా ఎలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి? భార్య, కొడుకుల వేధింపులు శ్రీరామ్‌కు ఏ రేంజ్‌లో ఉన్నాయి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.
విశ్లేషణ: ఈ సినిమా కథలో సరైన డెవలప్ మెంట్ లేదు. అలాగే స్క్రీన్ ప్లే ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంలో విఫలమైంది. అవసరం లేని సన్నివేశాలు.. పాత్రలు కథనాన్ని మరింత డల్ గా మార్చేసి విసుగు తెప్పిస్తాయి. ఉపయోగం లేని పాత్రలు కూడా ఈ చిత్రంలో చాలానే కనిపిస్తాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే పాత్ర.. ఆ పాత్ర చుట్టూ డిజైన్ చేసిన సన్నివేశాలు ఏమాత్రం పొంతన లేకుండా బోరింగ్ గా అనిపిస్తాయి. ధనరాజ్ పాత్రను చాలా సాధారణంగా పరిచయం చేసి, చివర్లో అతని క్యారెక్టరైజేషన్‌లో చూపించిన సడెన్ ఛేంజ్ అంత నాచురల్ గా అనిపించదు. మర్డర్ మిస్టరీ చుట్టూ అల్లుకొన్న ఫన్, కామెడీ డ్రామా. ఈ సినిమాకు సస్పెన్స్ ఎలిమెంట్ సపోర్టుగా నిలిచింది. ఫస్టాఫ్‌లో రొటీన్ సీన్లు, రెగ్యులర్ డ్రామాతో సాగదీసినట్టు ఉంటుంది. కథలో ఊహించని ట్విస్టులు లేకపోవడం రొటీన్ సినిమానే ఫన్ సీన్లతో కొత్త ఫ్లేవర్‌తో చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే దర్శకుడు సుధీర్ సెకండాఫ్‌ను అంటే ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు బాగా ప్లాన్ చేసుకొని.. ఫస్టాఫ్‌లో కలిగిన అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్‌ను డీల్ చేసిన విధానమే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. మరో ప్రధాన లోపం ఏమిటంటే, సినిమాలో ఒక శవాన్ని మాయం చేయడమనే సీరియస్ నేపథ్యంలో సాగే కథ అయినప్పటికీ, పాత్రలు చూపే ప్రవర్తన మాత్రం వాస్తవానికి దూరంగా ఉంటుంది. ఉదాహరణకు, శవాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కూడా హీరోయిన్ పాత్ర అతిగా ఉత్సాహం ప్రదర్శిస్తూ కనిపిస్తుంది. ఒక డార్క్ కామెడీలో టెన్షన్ నుండే హాస్యం పుట్టాలి, కానీ ఇక్కడ ఆ సీరియస్‌నెస్ లోపించింది. కామెడీ బలవంతంగా ఇరికించినట్లుగా ఉంది. అలాగే అలీ ఎపిసోడ్ ప్రధాన కథకు ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం రన్‌టైమ్ పెంచడానికే పెట్టినట్లుగా ఉంది. ఇలానే చాలా సన్నివేశాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా అతికించినట్లుగా అనిపిస్తాయి తప్ప, కథలో ఒక ఫ్లోలో ఉన్నట్టు అనిపించవు.
నటీనటులు పెర్ఫార్మెన్స్ : శివాజీ, లయ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అనుభవంతో వారి పాత్రల ద్వారా సినిమాకు అత్యంత బలంగా మారారు. ఇలాంటి క్యారెక్టర్లకు సిట్యుయేషన్, స్పాంటేనిటి అవసరం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తమ రోల్స్‌ను స్టోరీ డిమాండ్ మేరకు డ్రైవ్ చేశారు. రోషన్‌ ఉన్నంతలో బాగా చేశాడు. ఇంకా కొన్ని సీన్లు పడితే బాగుండు అనే ఫీలింగ్ కలిగింది. ధన్ రాజ్, ప్రిన్స్, శరత్, తదితరులు తమ పాత్రలకు పరిధి మేరకు ఓకే అనిపించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్లస్ పాయింట్. రిత్విక్ రెడ్డి కెమెరా మదనపల్లి, చిత్తూరు, హార్సిలీ హిల్స్ అందాలను చక్కగా బంధించింది. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే ఫన్ డ్రామాకు కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను రంజిన్ రాజ్ పర్‌ఫెక్ట్‌గా డెలివరీ చేశాడు. పాయా పాటను ఎండ్ టైటిల్‌కు కాకుండా మధ్యలో పడితే ఆడియెన్స్‌కు మరింత జోష్ కలిగించేలా ఉంటుంది. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ అనుసరించిన నిర్మాణ విలువలు ఉన్నత ప్రమాణాలను చాటాయి. శివాజీ, లయ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని రూపొందిన ఫన్‌ బేస్‌గా సాగే మర్డర్ మిస్టరీ. దర్శకుడు ఎంచుకొన్న పాయింట్ బాగుంది. ఇంకా బెటర్‌గా ప్రజెంట్ చేసి ఉంటే ఇంకా బెటర్‌ రిజల్డ్ రావడానికి అవకాశం ఉండేది. శివాజీ, రోహన్ లు కొన్ని సీన్స్ లో షైన్ అయ్యారు. కానీ కథ, కథనాల్లో మాత్రం కొత్తదనం పెద్దగా లేదు, అవుట్ డేటెడ్ రచన కొన్ని ఫోర్స్డ్ సన్నివేశాలతో బోర్ కలిగిస్తుంది. (రేటింగ్ 2.5/5)

Related posts