Saiyaara Movie Review in Telugu: సైయారా మూవీ రివ్యూ : లోతైన భావోద్వేగంతో ప్రేమ కిక్కు!

Saiyaara Movie Review in Telugu
Spread the love

చూడాల్సిన సినిమా : సైయారా

ఈ తరానికి ప్రేమలు తెలియవు. అందం ఆకర్షణ ప్రేమ అనుకునే తరం. సెంటిమెంట్ తెలియదు. ర్యాంకులు సాధించడం లేదా ఆవారా బ్యాచ్ లుగా ఎంజాయ్ చేయడం మాత్రమే తెలుసు. అందుకేనేమో,’ సైయారా’కు బాగా కనెక్ట్ అయ్యారు. వీరి వెనుక తరం నుంచి పెద్ద తరం వరకు ప్రేమ లోతు ఏంటో తెలుసు. ప్రేమ అనుభవం తెలుసు. అందుకే ఆ తరాలు కూడా ‘సైయారా’కు కనెక్ట్ అయ్యారు. ఈతరం తెలియక, ఆ తరాలు తెలిసి మొత్తానికి సినిమా హృదయాలను టచ్ చేసింది. ఎంతగా అంటే సినిమా చూస్తూ చూస్తూ ఏడ్చేంతగా… సినిమా పూర్తి అయ్యాక థియేటర్ సిబ్బంది వచ్చి సినిమా అయిపోయింది అని సాగనంపేంత వరకు ఆ సీట్లలో అలా వేదనతో కూర్చుండి పోయే అంతగా కనెక్ట్ అయిపోయారు. 40 కోట్ల బడ్జెట్ తో యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు తీసిన సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ లలో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 45 బహు భాషా సినిమాల్లో టాప్ 7లో ‘సైయారా’ బాలీవుడ్ మూవీ నిలిచి రికార్డు సృష్టించింది. లవ్ స్టోరీలను సహజంగా తెరకిక్కించి ప్రేమికులకు కిక్ ఇచ్చే మోహిత్ సూరి దర్శకత్వంలో జూలై 18న ఈ ‘సైయారా’ విడుదలైంది. సూపర్ డూపర్ హిట్ గా సంచలనం సృష్టిస్తోంది.
సహజంగా మన తెలుగు సినిమాలకు మల్లే ఆడియో, వీడియో రిలీజ్, ప్రి రిలీజ్ ఇలా ప్రచార ఈవెంట్లు ఉండవు కొన్ని బాలీవుడ్ సినిమాలకు. సైలెంట్ గా హిట్ కొట్టేస్తాయి. పైగా ఈ సినిమాలో ఇద్దరూ కొత్తవాళ్లే.. హీరో అహన్ పాండే.. అనన్య పాండే తమ్ముడు. హీరోగా అతని డెబ్యూ ఫిలిం. హీరోయిన్ అనీత్ పద్దా. ఆమెకూ ఇది అరంగేట్రమే. ఇద్దరూ ఆయా పాత్రల్లో ఒదిగిపోయి సహజంగా జీవించేసారు. నటన ఎక్కడా కనిపించలేదు. నిజ జీవితాల్లా కనిపిస్తాయి. మన జీవితాల్లా అనిపిస్తాయి. ఎలాంటి ఎక్స్పె క్టింగ్ లేకుండా వెళ్లి ఊహించని గొప్ప సినిమాను చూసినంత ఆనందం కలుగుతుంది. అందుకే చూసిన వాళ్లే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
2024లో విడుదలయిన కొరియన్ సినిమా మూమెంట్ టు రిమెంబర్ కు కాస్త కాపీ అనిపిస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో వస్తున్న ది రొమాంటిక్ వెబ్ సిరీస్ గుర్తుకొస్తుంది. అవి చూసి వున్నాను కాబట్టి నాకు గుర్తుకు వచ్చి ఉండొచ్చు. కానీ, మోహిత్ సూరి ఆ రెండూ క్లబ్ చేసి అంతకు మించిన మ్యూజికల్ లవ్ స్టోరీ పొట్లం అందించాడు. హీరో క్రిష్ కపూర్ మంచి స్టేజ్ సింగర్. హీరోయిన్ వాణి బత్రా ఒక వెబ్ సైట్లో పని చేసే రిపోర్టర్. ఆమె బ్రేకప్ లవర్. తన ప్రేమను డైరీ లో రాసుకునే కవయిత్రి. మహేష్ పెళ్ళి చేసుకుంటానని చెప్పి రిజిస్ట్రార్ ఆఫీస్ కు డుమ్మా కొట్టినప్పుడు డిప్రెషన్ లోకి వెళుతుంది. ఒక మ్యూజిక్ షో లో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన వాణి ని చూసి క్రిష్ ప్రేమలో పడిపోతాడు. ఆమె రాసే కవితలను పాటలుగా మలచి పాడుతుంటాడు. ఒక అపురూప ప్రేమికులుగా మారిపోతారు. అనుకోకుండా వాణి ఎల్జీమర్స్ వ్యాధికి గురై అన్నీ మరచిపోతుంటుంది. ఆమె కోసం తన సింగింగ్ కెరీర్ పక్కన పెడుతున్నాడని తెలుసుకుని చెప్పకుండా దూరంగా వెళ్ళిపోతుంది. ఆమెను వెతుక్కుంటూ ఆమె రాసిన సైయారా పాట ప్రతి ఊర్లో వినిపిస్తూ చివరకు మనీలాలో ఒక ఆశ్రమంలో ఉన్నట్లు తెలుసుకుని ఇద్దరూ ఒక్కటవుతారు. ఇదీ సినిమా!
ఎన్నో మలుపులు తిప్పుతూ మోహిత్ సూరి చూపించిన కథనం అద్భుతం. కన్ఫ్యూజన్ కాంఫిడెన్స్ ఇన్నోసెంట్ వాణి బత్రా పాత్రలో అనీత్ పద్దా జీవించి ఏడ్పించింది. అమర ప్రేమికుడు క్రిష్ పాత్రలో అహన్ పాండే రాణించి మెప్పించాడు. ఇంకా చెప్పుకోదగిన పాత్రల్లో చాలామంది నటించినప్పటికి మనకు ఆద్యంతం వీళ్ళు ఇద్దరే కనిపిస్తారు.
సంగీతం సూపర్బ్ అని చెప్పాలి. 7 పాటలు వేటికవే వెంటాడుతూ ఉంటాయి. మళ్ళీ వినాలనిపిస్తూనే ఉంటాయి. జాన్ స్టీవర్ట్ ఎడూరి ఇచ్చిన బిజిఎమ్ స్కోర్ ఈ సినిమాకు ప్రాణం పోసింది. అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ సూపర్ హిట్స్ ఇచ్చారు. మిథున్, తనిష్క బాగ్చి, సాచెట్ పరంపర, విశాల్ మిశ్రా, ఫహీం అబ్దుల్లా, అరస్లాన్ నిజామి ఇలా ఒక్కో పాటను ఒక్కొక్కరికి ఇచ్చి స్వరపరచడం రొటీన్ కు భిన్నంగా కొత్తదనాన్ని అద్ధినట్లు ఆకట్టుకున్నాయి. లోతైన భావోద్వేగాన్ని ప్రేమ కిక్కు ను ఎక్కించడంలో మోహిత్ సూరి సక్సెస్ అయ్యారు. చూడాల్సిన సినిమా ‘సైయారా’!

– డా. మహ్మద్ రఫీ

Related posts

Leave a Comment