అనిల్ రావిపూడి మల్టీస్టారర్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Regular shooting of Anil Ravipudi's multi-starrer begins.
Spread the love

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో మోస్ట్ ఎవైటెడ్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన,  జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. వెంకటేష్ ,  కళ్యాణ్ రామ్ సరసన కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటివలే  ఘనంగా జరిగిన పూజా కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా, హైదరాబాద్‌లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని ఒక ఫన్ వీడియో ద్వారా వెల్లడించారు. సినీ పరిశ్రమలో ప్రమోషన్ల విషయంలో కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి, మరోసారి తన క్రియేటివిటీని చాటుకున్నారు. ప్రతి అప్డేట్‌ను సరదాగా, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన, ఈసారి కూడా అలాంటి కాన్సెప్ట్‌తోనే ముందుకొచ్చారు. వీడియోలో అనిల్ రావిపూడి తన టీమ్‌తో మాట్లాడుతూ, అభిమానులు తన ప్రమోషన్లను ఎంతగా ఇష్టపడతారో సరదాగా గుర్తుచేసుకున్న్నారు. అంతేకాదు, ప్రమోషన్లలో తాను మాస్టర్ అని ప్రశంసిస్తూ అభిమానులు తనకు ఖడ్గం, వీరతిలకం బహూకరించారంటూ ఫన్నీగా చెబుతారు. అయితే ఆ తర్వాత కథలో ఊహించని ట్విస్ట్ వస్తుంది. వెంకటేష్ ఆ ఖడ్గంతో అనిల్ రావిపూడి బొటనవేలికి చిన్న గాటు పెట్టి ఆయనకు ‘వీర తిలకం’ దిద్దుతారు. అనంతరం కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి, సంగీత దర్శకుడు జీ.వి. ప్రకాష్ కుమార్ కూడా అదే విధంగా చేస్తారు. సరదాగా సాగిన ఈ వీడియో చిత్ర బృందం తమ ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించిందనే సంకేతాన్ని అందించింది. ఈ వీడియోలో మరో ఆసక్తికర విషయం కూడా వెల్లడైంది. సినిమా కథ రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని, అయితే పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక బృందం పనిచేస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్,  ఎ.ఎస్. ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్  నిర్వహిస్తున్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి 2027 సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: సాహు గారపాటి
సమర్పకులు: సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, శ్రీమతి అర్చన
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: సమీర్ రెడ్డి
ఎడిటర్: తమ్మిరాజు
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Related posts