‘సైక్ సిద్ధార్థ’ మూవీ రివ్యూ : మెచ్చుకునే ప్రయోగమే…

'Psych Siddhartha' Movie Review: A commendable experiment...
Spread the love

తెలుగు చిత్రసీమలో నటుడిగా పందొమ్మిదేళ్ళ ప్రయాణం పూర్తి చేసుకున్న శ్రీనందుకు ఒక్కటంటే ఒక్కటి హిట్టు దొరక్క ఎంతగానో తపించి పోయాడు. ఇప్పటివరకు సరైన ప్రాజెక్ట్ పడక.. హీరోగా గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు. అందుకే తనను తాను అప్డేట్ చేసుకుని, హీరోగా నటిస్తూనే స్వీయ నిర్మాణంలో డార్క్ కామెడీ డ్రామాతో ‘సైక్ సిద్ధార్థ’ను నిర్మించాడు. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సినిమాకు విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ అయితే జనాల దృష్టిని బాగా ఆకర్షించింది. ఈ చిత్రానికి హీరోగా మాత్రమే కాకుండా సహ రచయితగా, నిర్మాతగా కూడా వ్యవహరించడంతో హిట్టు కోసం నందు పడ్డ కసి కనిపించింది. న్యూ ఇయర్ స్పెషల్‌గా విడుదలైన ఈ సినిమా, చాలా సింపుల్ కథను గట్టిగా, క్విర్కీగా, కొంచెం సైకో టోన్‌లో చెప్పే ప్రయత్నం చేసింది. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలించింది? సినిమా ఆడియన్స్‌ని ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం….
కథ: సిద్ధార్థ (శ్రీనందు) గర్ల్‌ఫ్రెండ్ త్రిష, తన బిజినెస్ పార్ట్నర్స్ అయిన మన్సూర్ వల్ల మూడు కోట్ల రూపాయలు ఆర్థికంగా నష్టపోతాడు. చేతిలో చిల్లిగవ్వ లేక, అద్దెలు కట్టలేక రోడ్డున పడి బస్తీలో తలదాచుకుంటాడు. మోసం చేసిన మన్సూర్ మీద సిద్ధార్థ లీగల్ కేసు వేస్తే.. మన్సూర్ ఫ్రెండ్ రేవంత్ సెటిల్మెంట్ కోసం ట్రై చేస్తుంటాడు. మరోవైపు త్రిష ఇటు సిద్ధార్థ, అటు మన్సూర్ మధ్య ఊగిసలాడుతుంటుంది. జీవితం ఇలా వాష్ అవుట్ అయిన సమయంలో సిద్ధార్థకు శ్రావ్య (యామిని భాస్కర్) పరిచయమవుతుంది. భర్త చేతిలో హింస అనుభవిస్తున్న డాన్సర్ ఆమె. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సిద్ధార్థ లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది? ఏ దిశగా వెళ్లింది? సమస్యల సుడిగుండం నుంచి అతడు ఎలా బయటపడ్డాడు? అనేది తెరపై చూడాల్సిందే..
విశ్లేషణ: ఏ సినిమాకైనా కథలు రొటీన్ గానే అనిపిస్తాయి. కథనంలోనే మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. అలాంటి మ్యాజిక్కే ‘సైక్ సిద్ధార్ధ’లో ట్రై చేశారు మేకర్స్. లైఫ్ ని ఒక గేమ్ లా చూసే సిద్ధార్థ మెంటాలిటీని, అతని బ్రెయిన్‌లో జరిగే సంఘర్షణను చూపించే ప్రయత్నం బేషుగ్గానే ఉంది. కానీ ఆ కాన్సెప్ట్ కు తగ్గ డెప్త్ రైటింగ్‌లో కూడా ఉండుంటే సినిమా నెక్ట్స్ లెవల్‌లో ఉండేది. రొటీన్ కథే అయినప్పటికీ ఎడిటింగ్ ప్యాట్రన్ కొత్తగా ఉండటం ఈ సినిమాకు కొంత మేర కలిసొచ్చే విషయం. కామెడీ సీన్స్ కొంతమేర నవ్వించినా అలాంటివి ఉన్నవి చాలా తక్కువే. సింపుల్ సీన్స్ కూడా తన నటన ప్లస్ ఎడిటింగ్‌తో కొత్తగా మార్చేసాడు నందు. సిద్ధార్థ క్యారెక్టర్ ద్వారా సినిమాను నడిపించాలని చూసినా.. అతనికి సరైన బ్యాక్ స్టోరీ లేకపోవడంతో ప్రేక్షకులు ఎమోషనల్‌‌గా అంతగా కనెక్ట్ కాలేకపోయారు. ప్రతీది కామిక్ దారిలోనే చెప్పాలని చూసాడు దర్శకుడు వరుణ్ రెడ్డి. అతడిలో కొత్తగా, కూల్ గా చూపించాలనే తాపత్రయం మాత్రం ఈ సినిమాలో కనిపించింది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ పర్లేదు.. ఎమోషనల్‌గానూ బాగానే ఉంది. సైక్ సిద్ధార్థ ఒక ప్రయోగాత్మక చిత్రం. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ‘న్యూ ఏజ్ ‘ మేకింగ్‌తో తీసిన సినిమా ఇది. నందు నటన, కొన్ని క్రేజీ మూమెంట్స్ బాగున్నాయి. అయితే లోతైన కథనం లేకపోవడం, ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం మైనస్. ఫస్ట్ హాఫ్ పేస్ బాగున్నా సరైన బిల్డప్ లేదు. సెకండ్ హాఫ్ కూడా అదే రిథమ్‌లో సాగుతుంది. హీరోలో మార్పు వచ్చినా కథ ఎమోషనల్‌గా లోతుగా వెళ్లదు. సినిమా స్మూత్‌గా నడిచినా, బయటకు వచ్చాక బలమైన ఫీలింగ్ మిగలదు.
ఎవరెలా చేశారంటే… శ్రీనందు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. తన ఇమేజ్ చట్రాలన్నీ బ్రేక్ చేశాడనే చెప్పాలి. అమాయకంగా కనిపిస్తూనే, డేంజరస్‌గా ప్రవర్తించే పాత్రలో జీవించాడు. పాత్ర డిమాండ్ మేరకు ఎక్కడా వెనక్కి తగ్గకుండా పూర్తి ఎఫర్ట్ పెట్టాడు. అతని బాడీ లాంగ్వేజ్ కానీ, ఫిజికల్ అపీరియన్స్ కోసం కానీ చాలా కష్టపడినట్లుగా తెలుస్తుంది. ఇది పూర్తిగా తన సత్తా చూపించే పాత్ర. ఇప్పటివరకు సాఫ్ట్‌, ఫ్రెండ్లీ క్యారెక్టర్స్‌కే పరిమితమైన అతను, ఇక్కడ పూర్తిగా విరిగిపోయిన, కొంచెం పిచ్చి స్వభావం ఉన్న పాత్రలో పెద్ద రిస్క్ తీసుకున్నాడు. ఆ రిస్క్ అతని నటనలో స్పష్టంగా కనిపిస్తుంది. చాలా సన్నివేశాల్లో అతని ఫ్రస్ట్రేషన్, మెంటల్ కన్ఫ్యూజన్ బాగా వర్క్ అయ్యాయి. సెకండ్ హాఫ్‌లో యామిని భాస్కర్‌తో వచ్చే కాంబినేషన్ సీన్స్‌లో కొన్ని జెన్యూన్‌గా నవ్వించే మోమెంట్స్ ఉన్నాయి. కథకు కొంత రిలీఫ్ అందిస్తాయి. యామిని భాస్కర్ కూడా శ్రావ్య పాత్రలో చాలా క్యూట్‌గా కనిపించింది. ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఈ సినిమాకి, కథకి హీరో అని చెప్పాలి. ఆమె పాత్రను దర్శకుడు వరుణ్ డిజైన్ చేసిన తీరు, ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానం బాగున్నాయి. ముఖ్యంగా తనకి ఇంటిమసీ అంటే ఎంతో తెలియదు అని బాధపడే సన్నివేశంలో ఎంతో మెచ్యూర్డ్ గా నటించింది. సిద్ధార్థ చిన్ననాటి స్నేహితుడు రేవంత్‌గా నటించిన సింహా ఎక్కడ కనిపించినా ఎనర్జీ పెంచాడు. అతని ఎక్స్‌ప్రెషన్స్‌, బాడీ లాంగ్వేజ్‌, షార్ప్ డైలాగ్ పంచ్‌లు సినిమాకి మంచి టెంపో తీసుకొచ్చాయి.
త్రిషగా కనిపించిన ప్రియాంక కూడా బాగా నటించింది.
టెక్నీకల్ విషయానికొస్తే… కె. ప్రకాష్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమా మూడ్‌కు సరిగ్గా సరిపోయింది. విజువల్స్ క్లీన్‌గా ఉన్నాయి. వర్క్ ఇండీ మేకింగ్ ను తలపిస్తుంది. చాలా సీన్స్ గెరిల్లా ఫార్మాట్ లో షూట్ చేశారు. స్మరణ్ సాయి మ్యూజిక్ సినిమా నరేషన్‌కు మంచి ఫ్లేవర్ జోడించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథను బాగా మోయగలిగింది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్. ప్రతీక్ నూటి ఎడిటింగ్ చాలా చోట్ల షార్ప్‌గా ఉంది. నిర్మాణ విలువలు చిత్రస్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. డైరెక్టర్ తాను చేయాలనుకున్న సినిమా విషయంలో చాలా క్లియర్‌గా ఉన్నాడు. వింత కట్స్‌, సౌండ్ ఎఫెక్ట్స్‌తో కథ చెప్పే ఐడియా కొత్తగా ఉన్నా, మరింత స్ట్రాంగ్ రైటింగ్‌, కంట్రోల్ ఉంటే ఫలితం ఇంకా బాగుండేది. మొత్తం మీద ఈ ప్రయోగాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.
(చిత్రం: సైక్ సిద్ధార్థ, రేటింగ్ : 2.25/5, విడుదల: 1 జనవరి 2026, దర్శకత్వం: వరుణ్ రెడ్డి, నటీనటులు: శ్రీ నందు, యామిని భాస్కర్, నరసింహ ఎస్, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సుకేష్ తదితరులు. సంగీతం: స్మరణ్ సాయి, సినిమాటోగ్రఫీ: కె. ప్రకాష్ రెడ్డి, ఎడిటర్ : ప్రతీక్ నూటి, నిర్మాతలు: శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి)

Related posts