మరో చిత్రం ప్రకటించిన పవన్ కల్యాణ్

pawan kalyan movie in sithara entertainments announced
Spread the love

టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు అధికారికంగా, విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రతిభావంతమైన యువ దర్శకుడు సాగర్.కె. చంద్రను దర్శకునిగా ఎంపిక చేసుకున్నారు. ఇదే విషయాన్ని వివరంగా పొందుపరుస్తూ వినూత్నంగా ఓ వీడియో రూపంలో ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తొలిసారి తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు..’గబ్బర్ సింగ్’ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన నటనతో అశేష ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్ మరోమారు పోలీస్ పాత్రలో ఈ చిత్రం ద్వారా రక్తి కట్టించనున్నారు.

కాగా ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక నిపుణులుగా సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న సంగీత దర్శకుడు థమన్.ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సమున్నత ప్రతిభావంతులైన ‘ప్రసాద్ మూరెళ్ళ’ ఛాయాగ్రాహకునిగా, ఎడిటర్‌గా ‘నవీన్ నూలి’, కళా దర్శకునిగా ‘ఏ.ఎస్.ప్రకాష్‌లు ఎంపిక అయ్యారు అని తెలిపారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ.

పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమయ్యేది, చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరన్న వివరాలు, విశేషాలు మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చెబుతూ మీడియా వారికి, అభిమానులకు, ప్రేక్షకులకు, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ.

Related posts

Leave a Comment