వందలాది విలక్షణమైన పాత్రలకు తన సలక్షణమైన అభినయంతో ప్రాణం పోశారు కోట శ్రీనివాసరావు. అందువల్ల కోట తీరే వేరుగా నిలిచింది. అలా ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు కోట. కోట శ్రీనివాసరావు ఇక లేరు అన్న వార్త తెలుగువారిని విషాదంతో ముంచెత్తింది. కోట విలక్షణమైన అభినయాన్ని తలచుకొని కొందరు ఆయనను మరో నాగభూషణంగా అభివర్ణించారు. కొందరు రావు గోపాలరావుతోనూ, మరికొందరు నూతన్ ప్రసాద్ తోనూ పోల్చారు. నిస్సందేహంగా కోటతో పోల్చిన వారందరూ ప్రతిభావంతులే. బహుశా, కోట కొన్ని చిత్రాలలో అంతకు ముందు వారు ధరించిన తరహా పాత్రలు పోషించి ఉండవచ్చు. అందువల్ల జనం ఆ మహానటులతో కోటనూ పోల్చారేమో అనిపిస్తుంది. పలువురిని అనుసరించినా, కోట తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీని ఏర్పరచుకున్నారు. నాగభూషణం లాగా కామెడీని మిళితం చేసి పలు చిత్రాలలో కోట విలన్ గా మెప్పించారు. ఆయన లాగే కొన్ని సినిమాల్లో లేడీ గెటప్ లోనూ మురిపించారు కోట. అయితే ‘రెండిళ్ళ పూజారి’లో థర్డ్ జెండర్ గా నటించి కోట అలరించిన తీరును ఎవరూ మరచిపోలేరు. రావు గోపాలరావు లాగా కూడా సీరియస్ గా కొన్నిసార్లు, కామెడీతో మరికొన్ని మార్లు ప్రతినాయక పాత్రలు ధరించి ఉండవచ్చు. కానీ, తన గాత్రంతో వైవిధ్యం ప్రదర్శించారు కోట. నూతన్ ప్రసాద్ లాగా వాచికాభినయంతో కోట కూడా మైమరపించారు. అయితే తెలుగునేలపైని యాసలన్నిటినీ అచ్చు ఆ ప్రాంతాల్లోని వారు మాట్లాడే తీరునే వల్లించి జనం మనసులు గెలిచారు కోట. ‘సెగట్రీ…’ అంటూ రావు గోపాలరావులాగే కోట అభినయించిన దాఖలాలూ ఉన్నాయి. రావు గోపాలరావుకు మల్లె రాజకీయాల్లోనూ రాణించిన వైనమూ కోటలో కనిపిస్తుంది. అయితే ఎవరిని అనుసరించినా, వారి పంథాను మాత్రం అనుకరించకుండా తనకంటూ ఓ ప్రత్యేక బాణీ ఏర్పరచుకున్నారు. అందువల్లే కోట ఇకలేరన్న వార్త తెలియగానే ఇంతమంది మహానటులను గుర్తు చేసుకోవలసి వచ్చింది. వారి సరసన కూర్చోదగ్గ మేటి నటుడు కోట. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ‘ప్రతిఘటన’లో కాశయ్య పాత్రలో కోట అభినయం చూసి, కొందరు నటులు గుర్తుకు రావచ్చు. అయితే ‘‘హై కమాండ్ నడిగి చెబుతా…’’ అని తనదైన వాచకంతో సాగిన కోట నటన … కాదు ఇతను ప్రత్యేకం అనిపించక మానదు. పిసినారి పాత్రల్లో పైన పేర్కొన్న నటులందరూ అలరించారు. కానీ, గుమ్మానికి కోడిని వేలాడ దీసి ‘చికెన్ బిర్యానీ’ తింటున్నంత ఎక్స్ ప్రెషన్ ఇచ్చారే – ఆ సీన్ లో ఆయనకంటే సీనియర్ గా జంధ్యాల సినిమాల్లో కనిపించిన సుత్తి వీరభద్రరావును సైతం పక్కకు నెట్టి మార్కులు పట్టేసిన తీరును మరచిపోగలమా? ‘శ్రీకనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్’లో యెల్లా పాపారావు పాత్రలోనూ కొందరిలా కనిపిస్తారు. కానీ, వారందరికంటే భిన్నంగా వాగ్దాటితో తన బాణీ వేరని తేల్చి పారేస్తారు. ‘శివ’లో కితకితలు పెట్టకుండానే మాచిరాజు పాత్రను రక్తి కట్టించారే – అది చూడగానే అది కదా విలక్షణమంటే అనిపించక మానదు. జంధ్యాల ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో సినిమా పిచ్చి పటేల్ గా నటించిన కోటను చూశాక అసలు నిన్ను ఇతరులతో పోల్చలేమయ్యా అని అంగీకరించేస్తారు. ఇక తెలుగునాట ‘దెబ్బలతో అబ్బా’ అనిపించేలా నవ్వించారు కోట. ఆయనను హీరోలు కొట్టినప్పుడు నవ్వులు పూసేవి. అలాగే కోట, బాబూ మోహన్ కలసి ‘తన్నుల’తో టన్నుల కొద్ది హాస్యాన్ని తెలుగువారి సొంతం చేసిన తీరునూ మరచిపోగలమా? అంతకు ముందు కొందరు మహానటులు మాయల ఫకీర్లుగా రక్తి కట్టించారు. వారి వికృత వేషధారణ చూసి జనం జడుసుకున్నారు కూడా! అంత కంటే విలక్షణంగా ‘గణేశ్’ చిత్రంలో వికృతరూపంతో విలనీని పండిరచిన కోటకు జనం జేజేలు కొట్టకుండా ఉండలేకపోయారు. కాసులకోసం ఏమైనా చేసే కక్కుర్తి వెధవల పాత్రల్లోనూ కోట అలరించిన తీరు అనితరసాధ్యమే అనిపిస్తుంది. ‘ఆమె’లో అలాంటి పాత్రతోనే విధవరాలయిన కొడుకు భార్యనే డబ్బుల కోసం సొంతం చేసుకోవాలని చూసే పాత్రలోనూ కోట మెప్పించారు. ఆ పాత్రలో కోట మెప్పించక పోతే, కట్టుకున్న పెళ్ళామే అతడిని నరికి పారేస్తుంటే ‘అలా జరగాల్సిందే… ‘అని జనం కసిగా అనేవారు కారు. కేవలం కితకితలు పెట్టి నవ్వించడం వల్లో, భయపెట్టి ప్రతినాయక పాత్రలు ధరించడం వల్లో కోటను మహానటుడు అంటే అది కొంతే అవుతుంది. ఆయనలోని మరోకోణం పలు చిత్రాలలో కన్నీరూ పెట్టించింది. ‘‘లిటిల్ సోల్జర్స్, ఆ నలుగురు’’ సినిమాలు అందుకు నిదర్శనం. కోటలోని విలక్షణానికి రంకెలు వేస్తూ ‘నంది’ ఆయన ఇంట ఎనిమిది సార్లు వచ్చి చేరింది. నాలుగు సార్లు బెస్ట్ విలన్ గా, మూడు సార్లు బెస్ట్ కేరెక్టర్ యాక్టర్ గా, ఓ సారి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డులను సొంతం చేసుకున్నారు కోట. ఆయన ఇక లేరు అన్న వార్త అభిమానులను ఆవేదనతో ముంచెత్తక మానదు. కానీ, ఆ నటనల కోట ఏనాడూ బీటలు వారదు. భవిష్యత్ లోనూ చెక్కుచెదరని దుర్గంలా నిలిచే ఉంటుంది. శ్రీనివాసరావు ధరించిన వందలాది విలక్షణమైన పాత్రలు ఆ కోటను పరిరక్షిస్తూనే ఉంటాయి.
తెరపై తెలుగులోని అన్ని యాసలను మాట్లాడి అలరించిన కోట శ్రీనివాసరావు, సినిమా టైటిల్స్ పైనా తనదైన పంథాలో ‘కాయిన్’ చేసేవారు. అలా ఎన్నో సినిమా టైటిల్స్ విషయంలో తనదైన బాణీ పలికించారు. కొందరు నొచ్చుకున్నారు. మరికొందరు మెచ్చుకున్నారు. కోట శ్రీనివాసరావు తమ సినిమాలపైనే సెటైర్స్ వేసినా ఎంజాయ్ చేసిన వారున్నారు. అలాంటివారిలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, విజయబాపినీడు, ఇ.వి.వి. సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి వారున్నారు. వీరి సినిమాల్లో విలక్షణమైన పాత్రల్లో అలరించిన కోట శ్రీనివాసరావు, వారి సినిమా టైటిల్స్ పై చేసిన కామెంట్స్ ఎంతగానో అలరించాయి. మచ్చుకు కొన్ని…
‘మాయలోడు’ సినిమాకు ‘మాయ’ లోడ్ చేసిన కృష్ణారెడ్డి – అందుకే అంత పెద్ద హిట్టయింది’ ‘యమలీల’- ‘యమ్.’అలీ’ల’ – ఈ సినిమాతోనే అలీ హీరో అయ్యాడు – దాంతో అలా పేర్చారన్న మాట. ఆ సినిమా బిగ్ హిట్ అయ్యాక ‘అలీ లీల’అనీ కామెంట్ చేశారు కోట. ‘వినోదం’ నిర్మాతకు ప్రమోదం’, ‘రాజేంద్రుడు- గజేంద్రుడు’- ‘రాజు’ ఇంద్రుడు- ‘గజం’ ఇంద్రుడు- శ్లేష మీరే అర్థం చేసుకోండి….’, ‘గన్ షాట్’ – ‘టైటిల్ జస్టిఫికేషన్ చేసిన మూవీ’, ‘మనసులో మాట’- ‘‘సరిగా చెప్పుకోలేక పోయారు’’, ‘ఆ ఒక్కటీ అడక్కు’ – ‘‘ఆ ఒక్కటీ కడక్కు’’, ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ – ‘ట్యాబ్లెట్ వేసుకోండి’, ‘ఆయనకి ఇద్దరు’ – ‘‘అందుకే … ఆయనకు నిద్దర్లేదు’’, ‘అల్లుడా మజాకా’- ‘‘అల్లం.. మడతకాజా…’’, ‘అక్కడ అమ్మాయి… ఇక్కడ అబ్బాయి’ – ‘మద్రాసులో కూర్చొని పెట్టిన టైటిల్’ (అప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మద్రాసులో ఉండేవారు… అందులో హీరోయిన్ గా నటించిన సుప్రియ హైదరాబాద్ లో ఉన్నారు…), ‘చిలక్కొట్టుడు’ – ‘‘లక్ కొట్టేసింది’’, ‘వీడెక్కడి మొగుడండి!?’ – ‘‘వీడెక్కని మొగుడండి’’ (సినిమా జనానికి ఎక్కలేదని అర్థం), ‘గ్యాంగ్ లీడర్’ – ‘బ్యాంగ్’ లీడర్’, ‘బిగ్ బాస్’ – ‘బిగ్ లాస్’, ‘కొడుకులు’ – తీసింది బాపినీడు ‘కూతుళ్ళు’, ‘వాలు జడ – తోలు బెల్టు’ – రెండూ పైకి లేవలేవు… శ్లేష అర్థం చేసుకోండి, ‘ఘరానా బుల్లోడు’ – ‘‘ఘర్ ఆనా బుల్లోడా’’, ‘పెళ్ళిసందడి’ – ‘పెళ్ళి’ సందులో ‘ఢీ’, ‘బొంబాయి ప్రియుడు’ – ‘రంభ’కు మరో పేరు’బొంబాయి’. ఈ సినిమాలో రంభ హీరోయిన్. అలాగే అప్పట్లో రంభ హిందీ సినిమాల్లో బిజీగా ఉండేది, ‘పరదేశి’ – రాఘవేంద్రరావు ‘ప్యారడైజ్’, ‘శ్రీమతి వెళ్ళొస్తా’- ‘‘మళ్ళీ వస్తే మక్కెలిరగదంతా’’, ‘మూడు ముక్కలాట’ – ‘మూడ్ ఉంటేనేగా ‘ఆట’ (ఈ సినిమా పరాజయంపాలయింది). ‘పెళ్ళివారమండి’ – ‘పెళ్ళి’ వారమే నండి!, ‘ఒక్కడే’ – థియేటర్ లో ‘ఒక్క’ డే (ఒకరోజు) అని, ‘ఒక్కడు చాలు’ – ‘ఆ ఇద్దరికీ ‘ఒక్కడు చాలు’ – రాజశేఖర్ హీరోగా రూపొందిన ‘ఒక్కడు చాలు’ సినిమాలో రంభ, సంఘవి ఇద్దరు హీరోయిన్లు.
ఏదైనా రాసి పెట్టి ఉంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కచ్చితంగా జరుగుతుంది అని పెద్దలు చెప్తారు. ఇది అందరికీ వర్తిస్తుంది. అన్ని విషయాల్లో కూడా వర్తిస్తుంది. పండే ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసి ఉన్నట్టే.. సినిమాలో కనిపించే ప్రతి పాత్రపై కూడా నటించేవారి పేరు రాసి ఉంటుంది. అలా రాసి ఉంది కాబట్టే తెలుగు ఇండస్ట్రీ బతికి ఉన్నన్నినాళ్లు లక్ష్మీపతి బతికే ఉంటాడు. ఎవరీ లక్ష్మీపతి అని అంటారా.. ? పిసినారి లక్ష్మీపతి తెలియదా.. ? అరగుండు వెధవను పక్కన పెట్టుకొని వాడితో అడ్డమైన పనులు చేయించుకొని పావలా కూడా ఇవ్వని లక్ష్మీపతి. అహ నా పెళ్ళంట సినిమాలో జంధ్యాల ఏరికోరి ఎంచుకున్న లక్ష్మీపతి.. కోటా శ్రీనివాసరావు. కోటా కెరీర్ లో ఎన్ని పాత్రలు చేసినా కూడా ఇండస్ట్రీకి ఆయన ఎవరో తెలిసింది మాత్రం ఈ లక్ష్మీపతి పాత్రవలనే. అసలు ఎవరు ఆయన్ను ఇలాంటి పాత్రలో ఊహించుకోలేదు. కానీ, జంధ్యాల ఆ సాహసం చేశారు. రామానాయుడు వద్దు అని పట్టుబట్టినా కూడా ఆయన మాటను తోసిపుచ్చి ఈ పాత్రలో కేవలం కోటానే బావుంటాడని చెప్పి మరీ ఈ సినిమాను తెరకెక్కించాడట. మొదట ఈ పాత్ర కోసం రామానాయుడు అప్పటి స్టార్ నటుడు రావు గోపాలరావును అనుకున్నారట. కానీ, ఆ పాత్ర తన కోసం రాసిపెట్టి ఉందని, అందుకే పిసినారి లక్ష్మీపతి పాత్ర తన వద్దకు వచ్చిందని కోటా ఒకసారి చెప్పుకొచ్చారు.
‘మండలాధీశుడు సినిమా తరువాత ఒకరోజు చెన్నై విమానాశ్రయంలో కూర్చున్నాను. అప్పటికే రామానాయుడు గారు వచ్చి కూర్చున్నారు. ఇటు రావయ్యా అని అన్నారు. ఆరోజుల్లో నాలాంటి నటుడు ఆయన ముందు కూర్చొని మాట్లాడడమే గొప్ప విషయం. ఆయన పిలిచారని వెళ్లి కూర్చున్నాను. నేను జంధ్యాలతో ఒక సినిమా చేస్తున్నాను. ఈరోజే ఫైనల్ అయ్యింది. అందులో ఒక పాత్ర ఉంది. ఆ క్యారెక్టర్ కనుక బాగా పండితే మంచిగా ఆడుతుంది. లేకపోతే ఏవరేజ్ గా ఆడుతుంది. నేనేమో ఆ పాత్రకి రావు గోపాలరావును తీసుకుందామంటున్నా.. జంధ్యాల ఏమో నువ్వే కావాలని పట్టుబడుతున్నాడు. నేను సరే అన్నా.. నీవొక 20 రోజులు డేట్స్ కావాలి అని అన్నారు. తప్పకుండా సార్ అని చెప్పి షూట్ ఫినిష్ చేశా. ఆ సినిమా నాకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది’ అని కోటా చెప్పుకొచ్చారు. నిజం చెప్పాలంటే.. ఆ పాత్రలో కోటాను తప్ప ఇంకొకరిని ఊహించలేము అంటే అతిశయోక్తి కాదు. చిరిగినా జుబ్బా.. ఒక అద్దం పగిలిన కళ్ళజోడు.. వెకిలి నవ్వు.. డబ్బు మీద ఆశ.. అసలు పిసినారి అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే లక్ష్మీపతి అని చెప్పొచ్చు అనేలా కనిపించాడు. కోడికి దారం కట్టి ఉత్తి అన్నం తినడం, ఒంటికి పేపర్లు చుట్టుకొని పడుకోవడం.. అబ్బో ఇలా ఒకటేమిటి ఇప్పటికీ పిసినారి అని ఎవరినైనా చెప్పాలన్నా.. చూపించాలన్నా.. వీడొక పిసినారి లక్ష్మీపతి అని చెప్పుకొస్తారు. ఎంత రాసిపెట్టి ఉంటే ఈ పాత్ర కోటాకు దక్కిందో కదా..
ఇక కోటాకు సంబంధించిన ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఆయన చివరి రోజుల్లో చెప్పిన మాటలు అభిమానులను కంటనీరు తెప్పిస్తున్నాయి. సోషల్ మీడియా వచ్చాక వ్యూస్ కోసం, లైక్స్ కోసం బతికున్నవారిని చంపేస్తున్నారు కొంతమంది. కొన్నిరోజులు సోషల్ మీడియాలో కనిపించకపోవడం ఆలస్యం..వారు అందరి దృష్టిలో చంపేస్తున్నారు. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు బయటకు వచ్చి తాము బతికే ఉన్నాము మహాప్రభో అని చెప్పుకొస్తారు. స్టార్ కమెడియన్ వేణు మాధవ్ సైతం మమ్మల్ని బతికి ఉన్నప్పుడే చంపకండి.. అంటూ వేడుకున్నాడు. ఇక కోటా కూడా చివరి అంకంలో ఇలానే ప్రాధేయపడ్డారు. బతికి ఉన్నవారిని చంపి ఏం సాధిస్తారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం కోటా శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ రాసుకొచ్చాయి. ఆ వార్తలపై కోటా స్పందిస్తూ వీడియో పెట్టారు. అదే ఆయన చివరి వీడియో అని చెప్పొచ్చు. ఆ వీడియోలో కోటా మాట్లాడుతూ.. ‘ ప్రతి ఆర్టిస్ట్ కు ఒక టైమ్ అనేది వస్తుంది. ఆ టైమ్ వచ్చినప్పుడు నీకు టైమ్ ఉండనట్టే. అప్పుడే నువ్వు అన్ని సర్దుకోవాలి. ముందే జాగ్రత్త పడాలి. జీవితంలో టైమ్ బావుండాలి అంటే ముందు నీ ప్రవర్తన బావుండాలి. అది బావుంటే అన్ని బావుంటాయ్. లేకపోతే చివరకు అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆస్తులు పోగొట్టుకొని అలా దీన పరిస్థితిబీలో ఉన్నవారిని ఎంతమందిని చూడలేదు. దేవుడి దయవలన నేను అలా లేను. టైమ్ వస్తే వెళ్ళిపోతాను. వాడెవడో నేను బతికుండగానే చచ్చిపోయానని రాసాడు. ఆరోగ్యం బాగోలేక మరణించాడు అన్నాడు. ఆరోగ్యం బాగోలేకపోతే నేనే చెప్తా కదా. వయస్సు మీద పడుతుండడంతో అనారోగ్య సమస్యలు ఉంటాయి. అంతమాత్రాన బతికి ఉన్న మనిషిని చంపేస్తారా.. ? నా గురించి రాసినవాడిని పిలిపించి అరిచాను. అలా ఎలా రాస్తావయ్యా. తప్పు కదా. మీ నాన్న వయస్సు కదా నాకు. మీ నాన్నకు కాళ్ల నొప్పులు రావా..? అలాగే నాకు వచ్చాయి. నేను మనిషిని కాదా.. ? నా చావు వార్త రాసి రూపాయి సంపాదిస్తున్నావా.. ? అది దారుణం. ఇంకెప్పుడు అలా చేయకు అని చెప్పా. నేను బతికేవున్నాను’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఓల్డ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
స్టార్స్ తో కోట అనుభవాలు… అనుబంధాలు…
ఈ నాటికీ టాలీవుడ్ టాప్ స్టార్స్ అనగానే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ నే గుర్తు చేసుకుంటున్నారు సినీ ఫ్యాన్స్. ఈ నలుగురు హీరోలతోనూ కోట శ్రీనివాసరావుకు ప్రత్యేక బంధం ఉంది. వారి బ్లాక్ బస్టర్ హిట్స్ లోనూ కోట శ్రీనివాసరావు నటించి అలరించారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ తో తన అనుబంధాన్ని పదే పదే చెప్పుకొనేవారు కోట. 2015లో ‘పద్మశ్రీ’ అందుకున్న తరువాత కోట ప్రత్యేకంగా టాప్ స్టార్స్ తో తనకున్న అనుభవాలను, అనుబంధాలను పలువురు మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు.
చిరంజీవితో చనువు…
మెగాస్టార్ చిరంజీవితో తనకు చనువు ఎక్కువగా ఉందని కోట శ్రీనివాసరావు గుర్తు చేసుకొనేవారు. చిరంజీవి, కోట ఇద్దరూ కె.వాసు దర్శకత్వంలో క్రాంతికుమార్ నిర్మించిన ‘ప్రాణం ఖరీదు’ (1978)తోనే తొలిసారి తెరపై కనిపించారు. ఆ తరువాత చిరంజీవి టాప్ స్టార్ అయ్యాక కూడా ఆయన తననెంతో అభిమానంగా చూసుకొనేవారని చెప్పేవారు కోట. చిరంజీవితో తాను నటించిన ‘‘యముడికి మొగుడు, ఖైదీ నంబర్ 786, రౌడీ అల్లుడు, అల్లుడా మజాకా, బావగారూ బాగున్నారా, అన్నయ్య, ఠాగూర్’’ చిత్రాలు బిగ్ హిట్స్ గా నిలిచాయని ఆనందంగా గుర్తు చేసుకొనేవారు. చిరంజీవి తమ్ముడు నాగబాబు నిర్మించిన చిత్రాల్లోనూ తనకు మంచి పాత్రలే ఇచ్చి గౌరవించారనీ చెప్పారు. పవన్ కళ్యాణ్ తొలిచిత్రం ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’లో మెయిన్ లవ్ స్టోరీకి ప్యారలల్ ఓ కామెడీ ట్రాక్ ఉంటుందని ఆ కామెడీ లవ్ స్టోరీలో తాను లవర్ గా నటించడం తలచుకుంటే గిలిగింతలు పెట్టినట్టవుతుందని అనేవారు.
బాలయ్య అంటే భయం…
నటసింహ బాలకృష్ణతో తనకు ఓ ప్రత్యేకమైన బంధం ఉందనీ చెప్పేవారు కోట. బాలయ్య హీరోగా జంధ్యాల తెరకెక్కించిన ‘బాబాయ్ -అబ్బాయ్’లో కోట ఓ చిన్న పాత్ర పోషించారు. ఆ తరువాత గుర్తింపు తెచ్చుకోవడానికి పలు పాట్లు పాడుతున్న సమయంలో ‘ప్రతిఘటన’లోని కాశయ్య పాత్ర ఆదుకుందని అనేవారు. కాశయ్య పాత్ర కారణంగానే తనకు అప్పట్లో హీరో కృష్ణ వర్గంగా పేరొందిన డాక్టర్ యమ్. ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్ లో రూపొందిన ‘మండలాధీశుడు’లో యన్టీఆర్ ను పోలిన ‘భీమారావు’ పాత్ర దక్కిందని, అన్నగారి పాత్రలో సెటైర్ గా నటిస్తే అందరూ మెచ్చుకుంటారని భావించానే కానీ, ఆ మహానటుణ్ణి తక్కువ చేసేంత వాడిని కానని కోట పదే పదే చెప్పేవారు. ఆ సినిమాలో నటించడంవల్ల తెలుగుదేశం వారు తనపై కక్ష కట్టి, వారికి సంబంధించిన సినిమాల్లో అవకాశాల్లేకుండా చేశారనీ, అలాగే బాలయ్య బాబు కూడా దూరం పెట్టారనీ గుర్తు చేసుకొనేవారు. ఓ సారి ఓ హోటల్ లో తాను లిఫ్ట్ ఎక్కబోతూండగా, అదే లిఫ్ట్ లో నుండి బయటకు వచ్చిన బాలయ్య తనపై ‘ఛీ…’ అంటూ ఉమ్మేశారనీ గుర్తు చేసుకొనేవారు. అందులో ఏ మాత్రం తప్పులేదనీ కోటనే అనేవారు. ‘‘ఎందుకంటే యన్టీఆర్ ఎందరికో దైవం… ఆయన సొంతకొడుకు కాబట్టి బాలయ్యకు మరెంతో భక్తిప్రపత్తులున్నాయి. అందువల్ల బాలయ్య కోపగించుకోవడంలో తప్పులేదని భావించాను. అయితే ఎలాగైనా బాలయ్య సినిమాల్లోనూ తాను నటించాలని ఆశించేవాణ్ణి. ఓ మిత్రుని సలహాతో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న యన్టీఆర్ ను ఓ రోజు ఉదయాన్నే కలుసుకొని ‘‘సార్… ఏదో పొట్ట కూటి కోసం వేసిన పాత్ర అది… అంతేకానీ, మిమ్మల్ని కిండల్ చేసేంత గొప్పవాణ్ణి కాను…’’ అని చెప్పాను. అందుకు యన్టీఆర్ ‘‘ఆర్టిస్ట్ అన్న తరువాత ఏ పాత్ర వచ్చినా చేయాలి…అందులో మీ తప్పేముంది బ్రదర్…’’ అన్నారని చెప్పారు కోట. తరువాత బాలయ్య తనను దూరం పెడుతున్న విషయం పెద్దాయనకు చెప్పడంతో, ‘నో…నో… వీ ఆర్ ఆర్టిస్ట్స్… వీ ఆర్ ఫ్యామిలీ…’’ అని అన్నారని గుర్తుచేసుకొనేవారు. యన్టీఆర్ బాలయ్యకు చెప్పడం వల్లే తరువాతి రోజుల్లో ఆయన హీరోగా నటించిన చిత్రాల్లో అవకాశాలు వచ్చాయనీ తెలిపారు కోట. ఆ తరువాత నుంచీ బాలయ్య ఎంతో బాగా చూసుకొనేవారని, నిజం చెప్పాలంటే ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం అని అనేవారు కోట. ఏదేమైనా బాలయ్య అంటే తనకు భయమనీ చెప్పేవారు. బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘‘వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, సింహా’’ వంటి బ్లాక్ బస్టర్స్ లో కోట కీలక పాత్రలు ధరించారు. బాలయ్య సోదరులు నిర్మించిన ‘‘పెద్దన్నయ్య, గొప్పింటల్లుడు’’ చిత్రాల్లోనూ కోట నటించారు. ఆ సమయంలో బాలయ్య, ఆయన తమ్ముడు రామకృష్ణ తననెంతో గౌరవంగా చూసుకొనేవారనీ కోట చెప్పేవారు.
మా ‘శివ’… నాగార్జున…
కింగ్ నాగార్జున కెరీర్ లో బంపర్ హిట్స్ గా నిలచిన చిత్రాలలో నటించడం ఓ అదృష్టంగా భావించేవారు కోట. అంతకు ముందు కొన్ని చిత్రాలలో నాగ్ తో కలసి నటించినా, టాలీవుడ్ లోనే ఓ కొత్త ట్రెండ్ సృష్టించిన ‘శివ’లో నటించడం తనకెంతో ఆనందం కలిగించిందని అనేవారు కోట. ‘శివ’ తరువాత నాగ్ ను కొన్ని పరాజయాలు పలకరించాయని ఆ పై వచ్చిన బంపర్ హిట్ ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’లోనూ దూపం వేసే నాదముని పాత్ర తనకు మంచిపేరు సంపాదించి పెట్టిందనీ చెప్పేవారు. ఇక నాగ్ డ్యుయల్ రోల్ పోషించిన సూపర్ డూపర్ హిట్ మూవీ ‘హలో…బ్రదర్’లో ఎస్‌ఐ తాడి మట్టయ్య పాత్ర ఓ మరపురాని అనుభూతిని కలిగించిందనీ అనేవారు కోట. నటునిగా నాగార్జునకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టిన ‘అన్నమయ్య’లో మంత్రిగా నటించానని, నాగ్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలచిన ‘నువ్వు వస్తావని’లోనూ కీలక పాత్ర పోషించాననీ గుర్తుచేసుకొనేవారు కోట.
వెంకటేశ్‌తో అవార్డులు… రివార్డులు…
విక్టరీ వెంకటేశ్ తో తనకు మరింత ప్రత్యేక బంధం ఉందనేవారు కోట. వెంకటేశ్ ఫస్ట్ బంపర్ హిట్ మూవీ ‘బొబ్బిలి రాజా’లోనూ, తరువాత వెంకీ మంచి పేరు సంపాదించి పెట్టిన ‘శత్రువు’లోనూ కోట ధరించిన పాత్రలు ఎంతో పేరు సంపాదించి పెట్టాయి. ‘శత్రువు’లో కోట పోషించిన వెంకటరత్నం పాత్ర ఆయనపై ప్రశంసల జల్లులు కురిపించింది. ఇక ‘గణేశ్’లో వెంకటేశ్ హీరోగా, కోట విలన్ గా పోటీ పడి నటించారు. ‘గణేశ్’తో కోటకు బెస్ట్ విలన్ గా నంది అవార్డు అందుకున్నారు. ఇదే చిత్రంతో వెంకటేశ్ కూడా బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు సొంతం చేసుకోవడం విశేషం! ఇక వెంకటేశ్ తండ్రిగా కోట నటించిన ‘ఇంట్లో ఇల్లాలు – వంటింట్లో ప్రియురాలు’ సినిమా కోటకు నటునిగా మంచి మార్కులే పోగేసింది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో తన నటన ఎంతో సంతృప్తి నిచ్చిందని, ఆ సీన్ లో హీరోకంటే తనకే ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయని, అందుకు వెంకటేశ్ ప్రోత్సాహం కూడా కారణమని గుర్తు చేసుకొని ఆనందించేవారు కోట. తరువాతి తరం టాప్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, జూ.యన్టీఆర్, రవితేజ, అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాల్లోనూ కోట మరపురాని పాత్రలు ధరించి ఆకట్టుకున్నారు.
1942 జులై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం నటించారు. మాజీ రాజకీయవేత్తగా, శ్రీనివాసరావు 1999 నుండి 2004 వరకు భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. అతను 1978లో ‘ప్రాణం ఖరీదు’ అనే తెలుగు సినిమాతో తన అరంగేట్రం చేసారు. 750కి పైగా చలన చిత్రాలలో నటించిన ఆయన ప్రతినాయకుడు, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో నటించి తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నారు. 2012లో ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రానికి గానూ సైమా అవార్డును అందుకున్నారు. 2015లో, అతను భారతీయ సినిమాకి చేసిన కృషికి భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. సన్నాఫ్ సత్యమూర్తి (2015), అత్తారింటికి దారేది (2013), రక్త చరిత్ర (2010), లీడర్ (2010), రెడీ (2008), పెళ్లైన కొత్తలో (2006), సర్కార్ (2006) వంటి చిత్రాలలో తన విభిన్న పాత్రలకు విస్తృత విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు., బొమ్మరిల్లు (2006), ఛత్రపతి (2005), అతడు (2005), ఆ నలుగురు (2004), మల్లీశ్వరి (2004), ఇడియట్ (2002), పృధ్వి నారాయణ (2002), చిన్నా (2000), గణేష్ (1998), అనగనగా ఒక రోజు (1997), లిటిల్ సోల్జర్స్ (1996), ఆమె (1994), హలో బ్రదర్ (1994), తీర్పు (1994), గోవింద గోవింద (1993), గాయం (1993), డబ్బు (1993), శత్రువు (1990), శివ (1989), అహ నా పెళ్లంట (1987), ప్రతిఘటన (1986),, రేపాటి పౌరులు (1986).%ళి8రి% 2003లో, అతను సామితో తమిళ పరిశ్రమలో ఒక విలన్‌గా అరంగేట్రం చేశారు.
కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో వైద్యుడు. కోట 1942, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. 1966లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు. సినిమా నటుడైన అతని కుమారుడు కోట ప్రసాద్ (1969-2010) 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ప్రసాద్ జె.డి.చక్రవర్తి దర్శకత్వంలోని సినిమా ‘సిద్ధం’లో నటించాడు. 2010లో గాయం – 2 లో తన తండ్రితో పాటు నటించాడు. నటనారంగాగంలోనే కాకా కోటశ్రీనివాసరావుకు రాజకీయ రంగంలోనూ ప్రవేశముంది. విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 2015 లో కొరకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఐదు నంది పురస్కారాలు అందుకున్నారాయన. కోటశ్రీనివాసరావు సోదరుడు కోటశంకరరావు కూడా సినిమా నటుడే. ఆయన జాతీయ బ్యాంకులో పనిచేసేవాడు. సోప్ ఒపేరాస్ లో కూడా నటించారాయన.
సినీరంగ ప్రవేశం : బాల్యం నుండి నాటకరంగములో ఆసక్తి ఉన్న కోట సినిమాలలో రంగప్రవేశము చేసేనాటికి రంగస్థలముపై 20 యేళ్ళ అనుభవం గడిరచాడు. 1978-79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. మర్యాద పూర్వకముగా ఆ నాటకములో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీరంగ ప్రవేశం జరిగింది. అంతవరకు ఎప్పుడూ సినీ నటుడవ్వాలని ప్రయత్నించని కోట 1986 వరకు సినిమాలను సీరియస్ తీసుకోలేదు. ‘అహ నా పెళ్ళంట’ సినిమాలో కథానాయిక తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర చాలా పేరు తెచ్చింది. యోగి సినిమాలో ప్రతినాయక పాత్ర పోషించారు. తరువాత వెంకటేష్ హీరోగా నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ తండ్రిగా నటించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాలో ఎన్టీఆర్ కు తాతగా నటించారు. మరొక సినిమా బృందావనంలో కూడా ఎన్టీఆర్ కు తాతగా నటించారు. కోట శ్రీనివాసరావు గబ్బర్ సింగ్ లో శ్రుతిహాసన్ కు తండ్రిగా నటించారు. కోట శ్రీనివాసరావు బాబు మోహన్ తో కలిసి చాలా సినిమాలలో జోడిగా నటించారు. కోట శ్రీనివాసరావు రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటించిన ఆ నలుగురు సినిమాలో కోట శ్రీనివాసరావు కీలకపాత్రలో నటించారు. కోటా శ్రీనివాసరావు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లులో ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు. కోట ప్రజాదరణ పొందిన కోట డైలాగులను ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. ఈ డెవడ్రా బాబూ… నాకేంటి ..మరి నాకేంటి. మరదేనమ్మా నా స్పెషల్. అయ్య నరకాసుర. కోట శ్రీనివాసరావు. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
నంది పురస్కారాలు : ఉత్తమ విలన్- గణేష్ (1998), ఉత్తమ విలన్ – చిన్న (2000), ఉత్తమ సహాయ నటుడు- పృథ్వీ నారాయణ (2002), ఉత్తమ సహాయ నటుడు – ఆ నలుగురు (2004) , ఉత్తమ సహాయ నటుడు – పెళ్లైన కొత్తలో (2006).
విలక్షణ నటనకు మారుపేరు కోట
