రేటింగ్: 3/5
పరిచయం: కులమతాలకు అతీతంగా మానవులందరూ సమానమేనని చాటిచెప్పిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు. ఆయన జీవితంలో ఎదురైన సవాళ్లు, ఆధ్యాత్మిక ప్రయాణం, సమాజానికి అందించిన సందేశాన్ని వెండితెరపై చూపించే ప్రయత్నమే ‘జయహో రామానుజ’. లయన్ డా. సాయి వెంకట్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్‌పై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మించారు. జో శర్మ కథానాయికగా నటించగా, సుమన్, గురురాజ్, ప్రవళ్లిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ ఆధ్యాత్మిక చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలేంటి? సినిమా ఎలా సాగింది? తెలుసుకుందాం.
కథా కమామీషు: 11వ శతాబ్దంలో కులమత భేదాలు సమాజాన్ని విభజిస్తున్న సమయంలో, అందరూ సమానమేననే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్రీరామానుజాచార్యులు తమ జీవితాన్ని అంకితం చేస్తారు. చిన్నతనం నుంచే వేదవిద్యను అభ్యసించిన ఆయన, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తారు.
కంచిలో యాదవ ప్రకాశుల వద్ద విద్యను అభ్యసించే క్రమంలో ఆయన జీవితంలో అనేక మలుపులు చోటుచేసుకుంటాయి. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి, అందరికీ సమాన గౌరవం దక్కాలనే ఆశయంతో ఆయన సాగించిన ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఆ అడ్డంకులను అధిగమిస్తూ తన సిద్ధాంతాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారు? తన ఆశయాన్ని ఎలా ముందుకు నడిపించారు? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.
విశ్లేషణ: మహనీయుల జీవితాలను తెరపై చూపించడం అంటే వారి వ్యక్తిత్వాన్ని, ఆశయాలను ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఆవిష్కరించడం. ఈ విషయంలో దర్శకుడు సాయి వెంకట్ తనదైన ప్రయత్నం చేశారు. శ్రీరామానుజాచార్యుల జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను ఎంచుకుని, వాటికి ఆధ్యాత్మికతను జోడిస్తూ కథను నడిపించారు.
సినిమాలో కంచి రాజకుమార్తెను దుష్టశక్తి నుంచి రక్షించే సన్నివేశం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ఘట్టానికి ఉపయోగించిన గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. శ్రీమహావిష్ణువు దశావతారాలను చూపించిన విధానం కూడా ఆధ్యాత్మిక భావనను పెంచుతుంది.
ప్రీ క్లైమాక్స్‌లో చంద్రగిరి మహారాజు సమక్షంలో శ్రీవైష్ణవులు, శివభక్తుల మధ్య జరిగే వాదన మరో ప్రధాన ఆకర్షణ. అష్టాదశ పురాణాల ప్రస్తావనతో శ్రీవేంకటేశ్వరస్వామి గురించి చర్చించే ఈ ఘట్టాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఇలాంటి సన్నివేశాలు ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి ఉన్న ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంది.
శ్రీరామానుజాచార్యుల జీవితంలోని ముఖ్య ఘట్టాలను నేటి తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశం సినిమాలో కనిపిస్తుంది. కులమత భేదాలను పక్కనపెట్టి మానవత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలనే సందేశం ఈ కథకు ప్రధాన బలం. అయితే, కొన్ని సన్నివేశాల్లో కథనం నెమ్మదిగా సాగుతుంది. మరింత బిగువైన స్క్రీన్‌ప్లే, మెరుగైన ఎడిటింగ్ ఉంటే సినిమా ప్రభావం ఇంకాస్త పెరిగేది.
నటీనటుల నటన : ప్రధాన పాత్రలో లయన్ డా. సాయి వెంకట్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. శ్రీరామానుజాచార్యుల పాత్రకు తగిన ఆధ్యాత్మిక గంభీరతను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. శ్రీమహావిష్ణువు పాత్రలోనూ కనిపిస్తూ దశావతారాల సన్నివేశాల్లో మెప్పించారు.
జో శర్మ తన పాత్ర పరిధి మేరకు నటించారు. ఢిల్లీ సుల్తాన్ పాత్రలో సుమన్ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ప్రవళ్లిక పలు పాత్రల్లో కనిపించి కథకు తోడ్పడ్డారు. గురురాజ్ కీలక పాత్రలో నటించారు. ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం: సినిమాలో పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. శ్రీరామానుజాచార్యుల గొప్పతనాన్ని తెలియజేసేలా రూపొందించిన పాటలు కథలోని ఆధ్యాత్మిక భావాన్ని మరింత పెంచుతాయి. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలకు అనుగుణంగా సాగుతుంది.
సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా గ్రాఫిక్స్ ఉపయోగించిన సన్నివేశాలు తెరపై ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాణ విలువల విషయంలో దర్శకుడు తన ఆలోచనలను తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే, ఎడిటింగ్‌లో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే కథనం మరింత వేగంగా, ఆసక్తికరంగా సాగేది.
చివర్లో ‘అవతార్ రామానుజ 2’ పేరుతో సీక్వెల్‌కు సంబంధించిన సూచన ఇవ్వడం ఆసక్తిని కలిగిస్తుంది.
చివరగా…
‘జయహో రామానుజ’ ఒక మహనీయుడి జీవితాన్ని, సమానత్వ సిద్ధాంతాలను ప్రేక్షకులకు పరిచయం చేసే ఆధ్యాత్మిక చిత్రం. గ్రాఫిక్స్‌తో కూడిన కొన్ని సన్నివేశాలు, దశావతారాల చిత్రీకరణ, సందేశాత్మక పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణలు.
నటి ప్రవల్లిక కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు.
ఆధ్యాత్మిక చిత్రాలను ఇష్టపడేవారు, శ్రీరామానుజాచార్యుల జీవిత విశేషాలను తెలుసుకోవాలనుకునేవారు ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు.
రేటింగ్: 3.25/5
మూవీ రివ్యూ: జయహో రామానుజ – సమాజానికి సమానత్వ పాఠాలు చెప్పిన ఆధ్యాత్మిక యోధుడి కథ!
