మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘బరి’. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను శనివారం నాడు నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాత రాజీవ్ రెడ్డి ఎదుగురు స్క్రిప్ట్ అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం యూనిట్ చిత్రానికి సంబంధించిన విశేషాల్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో..
వరుణ్ తేజ్ మాట్లాడుతూ .. ‘నా ‘ముకుంద’ సినిమా తరువాత మళ్లీ మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు ‘బరి’ చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆయన చేతుల మీదుగా సినిమా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. నిహారిక నిర్మాతగా నేను హీరోగా చేస్తుండం ఎంతో స్పెషల్‌గా అనిపిస్తుంది. మేం ఇద్దరం కలిసి ఇలా ఒక సినిమా చేయాలనే ఆలోచన ఉండేది కాదు. కానీ వంశీ తెచ్చిన స్క్రిప్ట్ మా ఇద్దరిని ఇలా కలిపింది. వంశీ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ టీం మీద ఉన్న నమ్మకంతోనే సినిమాకి ఓకే చెప్పాను. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. నేను కూడా వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. వచ్చే సంక్రాంతికి ‘బరి’ సినిమాని బరిలోకి దించబోతోన్నాం’ అని అన్నారు.
నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘మా నాన్న ఫ్యామిలీ మెంబర్లతో సినిమాలు తీశాడు. వాళ్ల అన్నయ్య, తమ్ముడితో సినిమాలు తీశారు. అలా ఫ్యామిలీ మెంబర్లతో చిత్రాలు నిర్మిస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు ఈ రోజు తెలుస్తుంది. మా అన్న వరుణ్‌తో మూవీని ఈ రోజు ప్రారంభించడం నాకు చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది. మా మూవీ ప్రారంభోత్సవానికి మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతోన్నాం. విలేజ్ డ్రామాగా, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వంశీ ఈ సారి మరో అద్భుతమైన స్టోరీని చెప్పబోతోన్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ టీంతో మళ్లీ ఇలా సినిమా చేస్తుండటం నాకు ఆనందంగా ఉంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరు పోస్టర్ మీద కనిపిస్తే.. ఈ మూవీ కచ్చితంగా చూడాలి.. కచ్చితంగా బాగుంటుంది అని ఆడియెన్స్‌కి అనిపించేలా చేయడమే నా లక్ష్యం. ఈ సినిమా అందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది.’ అని అన్నారు.
యదు వంశీ మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు’ తరువాత ఓ కథను పట్టుకుని ఏడాది తిరిగా. అది వర్కౌట్ కాలేదు. మధ్యలో నాకు వాలీబాల్ బ్యాక్ డ్రాప్‌తో ఓ ఐడియా వచ్చింది. కొంత కథ రెడీ చేసుకున్నా. వాలీబాల్ అని అనుకోవడంతోనే నాకు వరుణ్ గారు మైండ్‌లోకి వచ్చారు. అలా కొంత కథ అయ్యాక మళ్లీ తిరిగి నిహారిక వద్దకే వెళ్లాను. ఆమెకు ఈ కథను నెరేట్ చేసి వరుణ్ గారు కావాలని అడిగాను. పూర్తి కథ సిద్దం చేసిన తరువాత వరుణ్ అన్న దగ్గరకు వెళ్దామని నిహారిక గారు అన్నారు. అలా మూడు నెలల్లో పూర్తి కథను రెడీ చేసి వరుణ్ గారికి వినిపించాం. ఆయనకి కథ చాలా నచ్చింది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాం. షూటింగ్ కూడా త్వరగా ఫినిష్ చేసి వచ్చే సంక్రాంతికి మా ‘బరి’ మూవీని బరిలోకి దించుతాం. నిన్న రాత్రి నాకు వరుణ్ గారు ఫోన్ చేశారు. ఓ గెస్ట్ రాబోతోన్నారు అని నన్ను సర్ ప్రైజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పగానే నేను షాక్ అయ్యాను. ఈ రోజు ఆయన ఇలా వచ్చి మాలాంటి యంగ్ టీంని ప్రోత్సహించడం, మా వెనుక వరుణ్ గారు, నిహారిక వంటి వారు నిల
బడటం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.
అనుదీప్ దేవ్ మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు’ కంటే పది రెట్లు ప్రభావం చూపేలా ‘బరి’లోని మ్యూజిక్ ఉంటుంది. వంశీ గారికి కూడా మ్యూజిక్ పట్ల మంచి టేస్ట్ ఉంది. ఈ చిత్రంలోనూ మ్యూజిక్‌కి చాలా స్కోప్ ఉంది. చాలా అద్బుతమైన మ్యూజిక్ రాబోతోంది’ అని అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ చిన్నా మాట్లాడుతూ .. ‘‘బరి’ సినిమాలో నేనొక్కడినే సీనియర్ అనుకుంటా. మిగిలిన వారంతా యంగ్ టీం. నిహారిక గారు చాలా మంచి ప్రొడ్యూసర్. వరుణ్ గారితో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. వంశీ గారి స్టోరీ, ఆయన కాన్ఫిడెంట్ అద్భుతంగా ఉంది. వచ్చే సంక్రాంతికి ‘బరి’ పెద్ద హిట్ అవుతుంది’ అని అన్నారు.




