ఈ శుక్రవారం థియేటర్స్‌లోకి చాలా సినిమాలు వచ్చాయి. అందులో అందరి ఫోకస్ ఉన్నది మాత్రం అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ మీదే. ముఖ్యంగా అఖిల్ కెరీర్‌లో ఇది అత్యంత కీలకమైన చిత్రంగా భావించడంతో సినీ అభిమానుల దృష్టి మొత్తం ఈ సినిమాపైనే నిలిచింది. అక్కినేని నట వారసుడిగా ఎంతో గ్రాండ్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్, సరైన కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ‘సిసింద్రీ’గా బాలనటుడిగానే ప్రేక్షకుల మనసు దోచుకున్న అఖిల్, ‘మనం’లో క్యామియోతో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య తన పేరుతోనే ‘అఖిల్’ అనే చిత్రాన్ని చేసి హీరోగా పరిచయం అయ్యాడు. యాక్షన్, కమర్షియల్ హంగులతో వచ్చిన ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాలు కూడా కెరీర్‌కు పెద్దగా ప్లస్ కాలేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కాస్త ఊరటనిచ్చినా, ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ ‘ఏజెంట్’ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో, తన కెరీర్‌ను మలుపు తిప్పే ఒక సాలిడ్ హిట్ కోసం అఖిల్ ఇప్పుడు ‘లెనిన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. లవ్ అండ్ ఎమోషనల్ రూరల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ చూసినప్పుడు అఖిల్‌కు ఈసారి పక్కాగా బ్లాక్ బస్టర్ హిట్ పడే అవకాశాలు స్పష్టంగా కనిపించాయి. సినిమా విడుదలకు ముందే ‘ఈ సారి గట్టిగా కొడుతున్నాం.. సినిమా అద్భుతంగా వచ్చింది’ అని నాగార్జున స్వయంగా ప్రకటించడం అభిమానుల్లో మరింత జోష్ నింపింది. చాలా కాలం గ్యాప్ తర్వాత అఖిల్ నటిస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ద్వారా మేకర్స్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశారు. టైటిల్ ప్రకటించిన నాటి నుంచీ అఖిల్ ‘లెనిన్’ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. అఖిల్ రగ్గడ్ గెటప్, కథా నేపథ్యం, ప్రచార చిత్రాలు, విడుదలైన పాటలు.. ఇవన్నీ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు కావడంతో కచ్ఛితంగా సినిమా బావుంటుందని ఆడియన్స్ ఫిక్సయిపోయారు. అఖిల్ కెరీర్‌లో ‘లెనిన్’కి వచ్చినంత హైప్ మరే సినిమాకూ రాలేదన్నది నిజం. అభిమానులు, తెలుగు సినిమా ప్రేమికుల సుదీర్ఘ నిరీక్షణకి తెరదించుతూ అఖిల్ అక్కినేని ఈ శుక్రవారం (10, జూలై 2026)’లెనిన్’తో సెల్యులాయిడ్ పై అడుగుపెట్టాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అందరి అంచనాలనూ ‘లెనిన్’ నిజం చేశాడా? ఈ సారైనా అఖిల్‌కి సరైన విజయం దక్కిందా? సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది రివ్యూలో చూద్దాం…
కథ: లెనిన్ (అక్కినేని అఖిల్) ఓ అనాథ..మంచితనంతో పాటు ఎలాంటి కల్మషం లేని యువకుడు. చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామానికి చేరుకున్న అతను, ఓ జాతరలో ఆ ఊరి పెద్ద కుటుంబానికి దగ్గరవుతాడు. ఆ ఊరు మొత్తానికి తలలో నాలుకలా వ్యవహరిస్తూ అందరి అభిమానాన్ని పొందుతాడు. ఈ క్రమంలోనే ఒక జాతర సందర్భంగా అతను భారతి (భాగ్యశ్రీ బోర్సే)తో ప్రేమలో పడతాడు. అయితే, లెనిన్‌ని పెంచి పెద్ద చేసిన కుటుంబానికి చెందిన వసంత్, భారతిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ, భారతి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను లెనిన్‌ని ఇష్టపడుతున్నానని చెబుతుంది. దీంతో వసంత్ దగ్గరుండి లెనిన్, భారతి ఇద్దరికీ పెళ్లి చేస్తాడు. అయితే, ఆ తర్వాత ఏం జరిగింది? లెనిన్ ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? ఇందులో భారతి పాత్ర ఏమిటి? మరి ఎలాంటి నెగిటివ్ క్యారక్టర్ లేని ఈ కథలో అసలు విలన్ ఎవరు? వారి వల్ల లెనిన్ కి ఏమైనా అన్యాయం జరిగిందా? జరిగితే ఎలాంటి అన్యాయం? అందుకు లెనిన్ ఏం చేసాడు? ద్రౌపది మాత కన్నీటి బొట్టుకి, లెనిన్ ఉన్న సంబంధమేంటి? ఎతిరాజులు (శివాజీ) పాత్ర ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: ఇదొక విభిన్నమైన స్క్రీన్‌ప్లే. పరువు, ప్రేమ, స్నేహం, నమ్మకద్రోహం నేపథ్యంలో సాగే కథ. కథకుడు, దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరి ఈ కథను నడిపించిన తీరు బావుంది. ప్రథమార్థం ఇదేదో పరువు కోసం ప్రాణాలు తీసే వ్యక్తుల చుట్టూ తిరిగే కథగానే అంతా భావిస్తారు. కానీ సెకండాఫ్‌లో ఈర్ష్యా, ద్వేషం, నమ్మకద్రోహం కోణాలు కథలో బహిర్గతమవుతాయి. ఈర్ష్యా, ద్వేషం అనేవి పవిత్రమైన స్నేహాన్ని సైతం నిర్వీర్యం చేస్తాయని ఈ కథ ద్వారా దర్శకుడు తెలిపారు. ‘లెనిన్’ గురించి సింపుల్‌గా చెప్పుకోవాలంటే పక్కా కమర్షియల్ టెంప్లేట్‌లో సాగిన సినిమా. సాంగ్స్, ఫైట్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని షాకింగ్ ట్విస్టులు కూడా ఉన్నాయి. హీరో పక్కన ఉండే పాత్రల్లో కాస్త పేరున్న నటీనటుల్ని పెట్టారంటే వీళ్లతో ఏదో ట్విస్ట్ ప్లాన్ చేశారని ముందు నుంచి అనిపిస్తుంది. అందుకు తగ్గట్లే ట్విస్టులు ఉంటాయి. సినిమా ప్రారంభమైనప్పటి నుంచే సినిమాలో కీలకమైన ఎపిసోడ్స్‌గా భావించిన కొన్ని సీన్లు ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలానే ఉన్నాయి. ముఖ్యంగా అనాథగా ఓ కుర్రాడు ఓ గ్రామానికి రావడం, అక్కడ వారందరితో కలిసిపోవడం బాగుంది. అయితే కొద్దిసేపటికి, పెరిగి పెద్దవాడైన అతను జైలు నుంచి బయటకు రావడం, ఆ తర్వాత అతని క్రేజ్ చూస్తూ జైలర్ అండ్ టీమ్ వెనుక పడటం లాంటి ఎలివేషన్స్ కొంత వర్కౌట్ అయ్యాయి. ఇక ఆ తర్వాత కథ ఎందుకో రొటీన్ ఫార్మాట్‌లో సాగుతున్న ఫీలింగ్ కలిగించినా, కథను ఊహించలేకుండా ముందుకు నడిపించడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. సినిమా మొదలైన తొలి గంట వరకు ఇదివరకే ఎన్నో సినిమాల్లో చూసేసిన సీన్లు మళ్లీ చూస్తున్నట్లు అనిపిస్తుంది. జైలు నుంచి హీరో విడుదలవడం, ఓ వ్యక్తితో తన కథంతా చెప్పడం, కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్.. హీరో ఒరిజినల్ ఎంట్రీ, ఆపై పాట, హీరోయిన్‌తో ప్రేమలో పడటం, ఓ రెండు డ్యూయెట్స్.. ఇలా అంతా రొటీన్‌గా సాగుతుంది. కానీ ఆ తర్వాత ట్విస్టులు మొదలవుతాయి. అక్కడి నుంచి మధ్యమధ్యలో కాస్త మూవీ డౌన్ అయినప్పటికీ చివరకు హీరో, విలన్‌ని చంపే సీన్‌తో సినిమా ముగుస్తుంది. ఈ సినిమాకి ఉన్న అతిపెద్ద ఆకర్షణల్లో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఒకటి. అక్కినేని, నందమూరి కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం మరోసారి ఈ సినిమా ద్వారా బయటపడింది. ఎన్టీఆర్ తన గంభీరమైన వాయిస్‌తో సినిమాను ప్రారంభిస్తారు. కథా నేపథ్యమైన ‘శ్రీరామపురం’ ఊరిని, అలాగే హీరో ‘లెనిన్’ పాత్రను తారక్ వాయిస్‌తో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతే, ఒక అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్ వస్తుంది. అలాగే, కథానాయిక భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ ఏకంగా సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్‌తో ఉండటం ఇందులో మరో ఆకర్షణీయమైన అంశం. ప్రస్తుతం టాలీవుడ్‌లో రూరల్, రస్టిక్ కథల ట్రెండ్ నడుస్తోంది. అఖిల్ కూడా తొలిసారిగా అలాంటి పూర్తిస్థాయి ఊరమాస్ రోల్ చేశాడు. సినిమా అంతా శ్రీరామపురంలో జరిగే ఓ జాతర చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో ఆధిపత్యం చెలాయించే ఒక పెద్ద మనిషికి, ఆయన చేసే తప్పులను ఎదిరించే క్రమంలో హీరోకు మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా. ఊరి కట్టుబాట్లను సైతం లెక్కచేయకుండా, న్యాయం కోసం హీరో తిరగబడటం వల్ల జరిగే మారణహోమం, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ఊర్లో గొడవలు కామన్ అయినా, తలలు లేవాల్సిందే అనే పట్టుదలకు పోవడం వల్లే అసలు కథ రసవత్తరంగా మారుతుంది. మొదటి పావు గంట వచ్చే కథనం నార్మల్ గానే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో ప్రతి సీన్ నడవడంతో పాటు లెనిన్, భారతి మధ్య వచ్చిన లవ్ సీన్స్ ఫ్రెష్ గా ఉన్నాయి. యతిరాజు సీన్స్ తో పాటు జయంతి, వసంత్ సీన్స్ బాగుండటంతో పాటు వాళ్ల తాలూకు క్యారక్టర్ డిజైన్ తో నెక్స్ట్ ఏదో జరగబోతుందనే విషయం అర్దమవడంతో పాటు ఆసక్తిని కలిగిస్తాయి. ముఖ్యంగా భారతి సిస్టర్ వైదేహి ఎపిసోడ్ బాగా పేలింది. ఫస్ట్ హాఫ్ కి బలంగా నిలిచింది కూడా. సెకండ్ హాఫ్ లో లెనిన్, భారతి మ్యారేజ్ ఎపిసోడ్ తో పాటు యతిరాజు, వసంత్ క్యారక్టర్ లు టర్న్ తీసుకోవడం, ఆ సందర్భంగా వచ్చే సీన్స్ గూస్ బంప్స్ వస్తాయి. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు వచ్చే సీన్స్ , అందుకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ రోమాలు నిక్కబరుచుకునేలా చేస్తాయి. ఎవరు ఊహించని విధంగా సన్నివేశాలు రావడంతో పాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. టోటల్ గా సెకండ్ హాఫ్ లెనిన్ కి అతి పెద్ద ఎసెట్ గా నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొత్త కథ అని చెప్పలేం. ఎప్పటినుంచో మనం చూస్తున్న తెలుగు సినిమాల్లోని కథలానే అనిపిస్తుంది. కానీ.. కొన్ని ట్విస్టులు మాత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా రాసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కాకపోతే, రొటీన్ ఫీలింగ్ కలగడం కొంత ఇబ్బందికర అంశం. ఈ సినిమాని మహాభారతంలోని రిఫరెన్స్‌లు చూపించిన తీరు, వాటిని ఎలివేషన్స్ కోసం ఉపయోగించుకోవడం బాగానే ఉంది. లెనిన్ ఒక్కడినే మూవీ అంతా చూపించాలని కాకుండా వసంత్, జయంతి, భారతి, యతిరాజులు పాత్రలని కూడా కథక తగ్గట్లు ఉపయోగించుకున్న తీరు కమర్షియల్‌గా వర్కౌట్ అయింది. ‘కూతురు కనిపించకపోతే కూతుర్ని వెతకాలి గానీ మీరు పరువుని వెతుక్కున్నారు నాన్న’, ‘లెనిన్ నా గుండెల్లో ఉన్నాడు అయినా సరే నువ్వు నా గుండెల మీద పడుకుంటానంటే చెప్పు’ లాంటి డైలాగ్స్ సరిగ్గా పడ్డాయి. లెనిన్ అసలు జైలుకి ఎందుకు వెళ్లాడు? అనే పాయింట్ మాత్రం సరిగా ఎష్టాబ్లిష్ చేయలేదు. అప్పటివరకు తన చుట్టూరా మందితో బలంగా కనిపించిన విలన్.. హీరో వేసిన ఒక్క దెబ్బకే చనిపోవడం కూడా ఏదో కృతకంగా అనిపించింది. కనీసం ఇద్దరి మధ్య కాస్త ఫైట్ లాంటిది నడిపించకుండానే చంపేయడం సింపుల్‌గా అనిపించింది. అనాధగా ఆ ఊరు వచ్చిన లెనిన్ ‘నా’ అనుకున్న వారందర్నీ సంపాదించుకున్నానని భ్రమ పడతాడు. తాను ఎప్పటికీ అనాథనేనని తెలుసుకుకోవడంతో కథ ముగుస్తుంది. స్నేహానికీ, ప్రేమకీ లొంగిపోయే లెనిన్ నమ్మకద్రోహానికి బలైపోయాడు. అదే ఈ సినిమా కథ. చాలా సీరియస్ సబ్జెక్ట్ ఇది. క్షణక్షణానికి మారుతున్న వ్యక్తులు మనస్తత్వాలను ఈ సినిమాలో చూడొచ్చు. మంచి వాళ్లుగా కనిపిస్తున్న మేకవన్నె పులుల మధ్య జీవితాన్ని సాగించి, సర్వం కోల్పోయిన లెనిన్‌ని ఈ సినిమాలో చూడొచ్చు. ప్రథమార్ధం చివరి ఇరవై నిమిషాల్లో సినిమాలోని అసలు కథ మొదలైంది. కథలోకి వెళ్లడం ఆలస్యం కావడం వల్ల కథనం నిదానించినట్టు అనిపిస్తుంది. ద్వితీయార్ధం ఆద్యంతం ఊహించని మలుపులతో ఆసక్తికరంగా సినిమా సాగింది. మొత్తంగా దర్శకుడు మురళీకిశోర్ వైవిధ్యమైన కథనంతో ఈ కథను నడిపించి సినిమాను నిలబెట్టారు. ఈ చిత్ర దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. మహాభారతం స్ఫూర్తితో సాగే సన్నివేశాలు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తాయి. సినిమా మొదలైనప్పటి నుండి ఇంటర్వెల్ వరకు కథా గమనం ఒక ఎత్తు అయితే.. సెకండాఫ్‌లో సినిమాను నడిపించిన తీరు మరో ఎత్తు. దర్శకుడు ప్రతి పాత్రను చాలా లోతుగా మలిచాడు. కథలో వచ్చే ప్రతి క్యారెక్టర్ కు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం పాత పల్లెటూరి పగలు, ప్రతీకారాల సినిమాలను చూస్తున్న భావన కలుగుతుంది. మహాభారతం నేపథ్యాన్ని కథకు ముడిపెట్టడం అనేది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. అలాగే హీరో అసలు జైలుకు ఎందుకు వెళ్ళాడనే విషయంపై దర్శకుడు మరింత స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో హీరోపై వచ్చే ఒక కీలకమైన మలుపు కాస్త అతకనట్టుగా అనిపిస్తుంది. ఆ ప్రత్యేకమైన యాక్షన్ ఎపిసోడ్‌లో లాజిక్ మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ, ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేలా చేయడంలో దర్శకుడి ప్రతిభ అద్భుతంగా పనిచేసింది. ఎక్కడా బోర్ కొట్టకుండా, ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఉత్కంఠభరితంగా మలచడంలో ఆయన సఫలమయ్యాడు. అనవసరమైన అంశాలను పక్కన పెడితే, సినిమాలోని భావోద్వేగాలు నేరుగా హృదయానికి హత్తుకుంటాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో అఖిల్, భాగ్యశ్రీ మధ్య వచ్చే లవ్ సీన్స్ పరిధి మేరకు ఉన్నాయి. ఎక్కడా కథను పక్కదారి పట్టించుకండా అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కించారు మురళీ కిషోర్. పైగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాల్లో అఖిల్ నటన కూడా సినిమా రేంజ్‌ను పెంచేసింది. కొన్ని పాత సినిమాల రిఫరెన్సులు కనిపించినా కూడా లెనిన్ ప్రత్యేకత లెనిన్‌కు ఉంది. ఈ సినిమాకి అప్పటివరకూ ఉన్న బజ్ వేరు ట్రైలర్ కట్ తర్వాత జెనరేట్ అయ్యిన బజ్ వేరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటికే పలు వాయిదాలు లెనిన్ విషయంలో కొంచెం నిరాశ కలిగించాయి కానీ మహా భారతం రిఫరెన్స్ తో వచ్చిన ట్రైలర్ కట్ అందరిలో మంచి ఆసక్తి రేకెత్తించింది. ఇదే ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రెజెంట్ చేస్తూ సినిమాలో కూడా అనేక అంశాలు ఆడియెన్స్ ని మెప్పిస్తాయి. దర్శకుడు ప్లాన్ చేసుకున్న కథనం ఇందులో బలంగా నిలుస్తుంది. ముఖ్యంగా సెకాండఫ్ ని తీసుకెళ్లిన తీరు మెప్పిస్తుంది. కథనం, పాత్రలు వాటిలో లేయర్స్ ఎంగేజింగ్ గా అనిపిస్తాయి. దాదాపు సినిమాలో కనిపించిన ప్రతీ పాత్ర సినిమాకి బలాన్ని చేకూర్చింది. అలానే కొన్ని ట్విస్ట్ లు కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ మాత్రం ఒకింత రొటీన్ గా అనిపిస్తాయి. ఇది వరకు వచ్చిన కొన్ని రూరల్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కూడా ఇందులో గుర్తొస్తాయి. వీటి అన్నిటి కంటే క్లైమాక్స్ పోర్షన్ లో అఖిల్ మీద రివీల్ అయ్యే కీలక ట్విస్ట్, దానికి అనుగుణంగా డిజైన్ చేసుకున్న సీక్వెన్స్ ని ఇంక బలంగా ప్లాన్ చేసుకోవాల్సింది. ఇక్కడ కొంచెం లాజిక్ మిస్ చేశారు అనుకోవాలి. అలానే అఖిల్ రోల్ ఎందుకు జైలుకి వెళ్ళింది అనేది కూడా అంత క్లియర్ గా లేదు.
ఎవరెలా చేశారంటే…ఇప్పటి వరకు మనం స్క్రీన్ మీద చూసిన అఖిల్ వేరు.. ‘లెనిన్’లో చూసిన అఖిల్ వేరు. ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. ఇప్పటిదాకా ఎవరూ ఊహించని రీతిలో లెనిన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ముఖ్యంగా సినిమా చివర్లో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో తనలోని అసలైన నట విశ్వరూపాన్ని బయటపెట్టాడు. ‘లెనిన్’గా కొత్త అఖిల్‌ని ఈ సినిమాలో చూస్తారు. ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాలన్నీ ఒకెత్తూ, ‘లెనిన్’ ఒకెత్తు. అమాయకత్వం, మంచితనం, మూర్ఖత్వం కలగలిసిన ఈ పాత్రలో అఖిల్ జీవించాడనే చెప్పాలి. అతనిలోని పరిపూర్ణమైన నటుడ్ని ‘లెనిన్’లో చూడొచ్చు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో అఖిల్ అద్భుతంగా నటించాడు. అతని కెరీర్‌లో బెస్ట్ పెర్‌ఫార్మెన్స్‌గా ‘లెనిన్’ని చెప్పొచ్చు. ఫైట్స్, ఎమోషన్స్ పరంగా ఇంప్రూవ్ అయ్యాడు. ప్రమోషన్స్ లో మేకర్స్ చెప్పినట్టుగానే అఖిల్ కనపడలేదు. లెనిన్ క్యారక్టర్ మాత్రమే కనపడింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో అఖిల్ పెర్ఫార్మ్ నభూతో న భవిష్యత్. ఎంటైర్ తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా అఖిల్ కెరీర్ లో ‘లెనిన్’ నిలిచిపోతుంది. లవ్, యాక్షన్ సన్నివేశాల్లో ఒక రేంజ్ పెర్ఫార్మ్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాకే కీలకమైన భారతి పాత్రలో భాగ్యశ్రీ ఆకట్టుకుంది. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, కథకు అవసరమైనంత బరువును తన భుజాలపై మోసింది. హీరోకు స్నేహితుడిగా, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌లో ప్రమోద్ పంజు అంచనాలకు మించి నటించాడు. ఒక రేంజ్ పెర్ఫార్మ్ చేసాడు. తన పాత్రలోని వైవిధ్యమైన కోణాలను అద్భుతంగా ఆవిష్కరించాడు. ఇక శివాజీకి ఒక బలమైన పాత్ర దక్కింది. బ్రహ్మాజీ, శత్రు, ఈశ్వరీ రావు తదితరులు తమ తమ పరిధుల మేర చక్కని నటనను కనబరిచారు.
టెక్నికల్ విషయాలకొస్తే.. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. లియోన్ బ్రిట్టో కెమెరా వర్క్ చాలా బాగుంది. ఆర్ట్ వర్క్ కూడా సినిమాకు బలం. 90ల కాలాన్ని బాగా చూపించారు. భారీ సెట్టింగ్స్ వేసి చిత్రీకరించినప్పటికీ, ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. సినిమా టెక్నికల్ గా చాలా బలంగా కనిపిస్తుంది. భారీ సెట్టింగ్స్ నడుమ ఈ సినిమాని తీసినప్పటికీ ఎక్కడా ఇది సెట్స్ లో తీసిన సినిమాలా అనిపించలేదు. చాలా నాచురల్ గా మంచి కెమెరా వర్క్ తో సాలిడ్ రూరల్ అండ్ రస్టిక్ డ్రామాగా తెరకెక్కించారు. థమన్ ఈ సినిమాకు హీరో.. పాటల సంగతి ఎలా ఉన్నా నేపథ్య సంగీతం మాత్రం అదరగొట్టాడు. పాటలు పెద్దగా గుర్తుపెట్టుకునేలా ఉండవు గానీ బ్యాక్ గ్రౌండ్ మాత్రం చెవుల్ని హోరెత్తించింది. ముఖ్యంగా క్లైమాక్స్, ఇంటర్వెల్‌లో వచ్చే ఆర్ఆర్ అదిరిపోయింది. నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తను అనుకున్న కథను, తన మనసులోని ఆలోచనలను తెరపై ఎంతో అద్భుతంగా ఆవిష్కరించాడు. నాగార్జున, నాగవంశీ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు విషయానికి వస్తే.. తన సబ్జెక్ట్ పరంగా తనకి ఉన్న క్లియర్ విజన్ ని నీట్ గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ‘లెనిన్’ తో మనోడు వచ్చి కొట్టేసాడు అని చెప్పడంలో డౌట్ లేదు. ఓవరాల్ గా అఖిల్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్, దర్శకుడు విజన్ తెరకెక్కించిన తీరు, ఎమోషన్స్ ఇందులో హైలైట్ గా నిలిచాయి.
చిత్రం : లెనిన్
నటీనటులు: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, ప్రమోద్ పంజు, శివాజీ, రాజీవ్ కనకాల, ప్రవీణ్, బ్రహ్మాజీ, రాంకీ, ఈశ్వరిరావు, శత్రు, సునీల్ తదితరులు
సంగీతం: థమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: లియోన్ బ్రిట్టో
ఎడిటింగ్: నవీన్ నూలి
రచన,దర్శకత్వం: మురళి కిషోర్ అబ్బూరు
నిర్మాతలు: నాగార్జున- సూర్యదేవర నాగవంశీ
బ్యానర్స్ : మనం ఎంటర్ ప్రైజెస్, సితార ఎంటర్ టైన్ మెంట్
విడుదల : జూలై 10 , 2026
(రేటింగ్ : 3/5)
Lenin Movie Review: యాక్షన్ ఎంటర్‌టైనర్!
