కొత్త జీఓతో జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగదు : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి

Journalists will not suffer any loss with the new GO: Telangana Media Academy Chairman K. Srinivas Reddy
Spread the love

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రెడిటేషన్ మార్గదర్శకాలు వృత్తిపరమైన జర్నలిస్టులను నష్టపర్చవని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసారు. సంక్షేమ చర్యలు ఎలాంటి వివక్షత లేకుండా అందరికీ వర్తించడంతో పాటు ఇంకా మెరుగైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు యోచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వపు అక్రెడిటేషన్ ఉత్తర్వులు ఉర్దూ జర్నలిస్టుల పట్ల అనుసరించిన వివక్షతను, చిన్న పత్రికల పట్ల చూపిన చిన్న చూపును తెలంగాణ హైకోర్టు కొట్టి వేసిన అంశాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసారు. ఈ నేపథ్యంలోనే వాటిని కొత్త జీఓలో మార్పు చేసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. నూతన జీఓపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా అవాస్తవాలను వెల్లడిస్తూ, వక్రీకరిస్తూ సంక్షేమ చర్యలు విలేకరులకు మాత్రమే వర్తిస్తాయని చెబుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేసారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. వృత్తిపరమైన జర్నలిస్టులందరికీ ఇవి వర్తిస్తాయని ఆయన స్పష్టం చేసారు. ఈ విషయాలపై అవసరమైతే వివరణ కొరవచ్చని ఆయన సూచించారు. జర్నలిస్టుల సంక్షేమ చర్యల పట్ల ముఖ్యమంత్రితో, సమాచార శాఖ మంత్రితో ఎప్పుడైనా మాట్లాడడానికి అవకాశాలు ఎలాగూ ఉంటాయన్నారు. ఇందుకు విరుద్ధంగా ఓ రాజకీయ ఎత్తుగడతో కొన్ని శక్తులు ఆందోళన చేయాలని తలపెట్టడం అత్యంత విచారకరమని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల పట్ల, వారి సమస్యల పట్ల రేవంత్ రెడ్డి నాయకత్వాన ఉన్న ప్రజా ప్రభుత్వం సానుకూల పరిష్కారానికి వెళ్తుంది తప్పా, గత ప్రభుత్వం మాదిరిగా వివక్షత చూపే అవకాశమే లేదని ఆయన తెలిపారు. నూతన జిఓపై పనిగట్టుకొని కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని విశ్వసించరాదని వర్కింగ్ జర్నలిస్టులకు శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేసారు.

Related posts