‘పోకిరి’ రీ-రిలీజ్‌ లేనట్టేనా?

Is there no re-release of 'Pokiri'?
Spread the love

హీరోల మేనరిజాన్ని మార్చాలన్నా, వెండితెరపై మాస్ డైలాగులతో మంటలు పుట్టించాలన్నా టాలీవుడ్‌ డైరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా పూరీ జగన్నాథ్ కే సాధ్యం. అతి తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేసి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే డైరెక్టర్‌గా ఆయన పేరుగాంచారు. ఆయనలాంటి సీన్స్, డైలాగులు రాసే దర్శకుడు ఇండియాలోనే లేరు అని సాక్షాత్తూ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశంసించారంటే పూరీ ‘పెన్ పవర్’ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ప్రస్తుతం అదే పూరీ జగన్నాథ్ తన కెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు పూరీ సినిమా వస్తుందంటే ట్రేడ్ వర్గాల్లో హాట్ కేక్‌లా అమ్ముడయ్యేది. ‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పూరీ ఆ తర్వాత విజయ్ దేవరకొండతో తీసిన ‘లైగర్’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా ఘోర పరాజయం పాలై బయ్యర్లను కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ తర్వాత వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా అదే బాట పట్టడంతో నష్టాలు రెట్టింపయ్యాయి. ‘లైగర్’ సమయంలో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం చెల్లిస్తానని పూరీ హామీ ఇచ్చినా, ఇప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. పైగా ఆయన ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో పంపిణీదారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు హీరోగా పూరీ తెరకెక్కించిన ఇండస్ట్రీ హిట్ ‘పోకిరి’ని మే నెలలో భారీ ఎత్తున రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఓవర్సీస్ రైట్స్ కూడా ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయ్యాయి. అయితే పూరీ పాత బకాయిలు చెల్లించే వరకు ఆయనకు సంబంధించిన ఏ సినిమాను థియేటర్లలో ప్రదర్శించకూడదని డిస్ట్రిబ్యూటర్ల యూనియన్ నిర్ణయించింది. ప్రముఖ పంపిణీదారుడు సునీల్ నారంగ్ నేతృత్వంలో ఫిలిం ఛాంబర్ ద్వారా ఈ ఒత్తిడి పెరుగుతోంది. పూరీ నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో ‘పోకిరి’ రీ-రిలీజ్‌ను నిలిపివేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా మహేష్ బాబు నటించిన మరో చిత్రం ‘అతిథి’ని విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి రావాలని ఆయన పట్టుదలగా ఉన్నప్పటికీ ‘అనధికార నిషేధం’ పెద్ద అడ్డంకిగా మారింది. బకాయిలు సెటిల్ చేయకుండా ఈ సినిమాను విడుదల కానివ్వబోమని డిస్ట్రిబ్యూటర్లు తెగేసి చెబుతున్నారు. ఒకవేళ పూరీ వెంటనే స్పందించి బయ్యర్ల సమస్యను పరిష్కరించకపోతే, ఆయన రాబోయే ప్రాజెక్టులన్నీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Related posts