పథకం ప్రకారమే మహిళా జర్నలిస్టులపై అసభ్యకర పోస్టులు

Indecent posts against female journalists are planned
Spread the love

-మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన ప్రతినిధి బృందం
-కఠినచర్యలు తప్పవు కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదా

మహిళా జర్నలిస్టులపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న బెదిరింపులు, అసభ్యకర పోస్టులు, దుర్భాషలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వీటిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదా హామీ ఇచ్చారు. మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీతో పాటు మహిళా జర్నలిస్టుల ప్రతినిధి బృందం కమిషన్ చైర్ పర్సన్ ను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న నిరంతర ట్రోలింగ్‌, వేధింపులు, బెదిరింపులు, అసభ్య దాడుల వివరాలను వారు అందించారు. ఈ సందర్బంగా జర్నలిస్టుల ప్రతినిధి బృందం ట్రోలింగ్ స్వరూపాన్ని చూపించే అనేక వీడియోలను చైర్ పర్సన్ కు ప్లే చేసి చూపించింది. పలు సోషల్ మీడియా హ్యాండిల్లు నిరంతరం విద్వేష వ్యాఖ్యలు, అసభ్య పోస్టులు, దాడులు చేస్తూ మహిళా జర్నలిస్టులను అవమానించాలని, భయపెట్టాలని చూస్తున్నాయని వారు తెలిపారు.
తమపై “క్రమబద్ధమైన ఆన్‌లైన్ వేధింపుల ధోరణి” కొనసాగుతోందని తెలిపారు. కొన్ని హ్యాండిల్లు, ఉద్దేశపూర్వకంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు, ప్రాణహానికర బెదిరింపులు, అవహేళనాత్మక పోస్టులు, వీడియోలు షేర్ చేస్తున్నాయని చెప్పారు.ఈ ట్రోలింగ్‌ భయం కలిగించడం, తమ వృత్తిపరమైన పనిని అడ్డుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోందని వారు పేర్కొన్నారు. విద్వేషపూరిత, మతపరమైన ఉద్రిక్తత కలిగించే కంటెంట్‌ను కూడా ఈ హ్యాండిల్లు విస్తృతంగా పోస్ట్ చేస్తున్నాయని తెలిపారు.
సంబంధిత హ్యాండిల్లు, వ్యక్తులపై దర్యాప్తు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఆన్‌లైన్‌–భౌతిక రక్షణను కల్పించాలని కోరారు. ఈ వేధింపులు మీడియా స్వేచ్ఛపై దాడి మాత్రమేనని, మహిళా జర్నలిస్టుల గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని చెప్పారు.

Related posts

Leave a Comment