ఘనంగా తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ప్రెసిడెంట్‌గా వి. వి. సుమలతా దేవి ప్రమాణస్వీకారోత్సవం

Grand Swearing-in Ceremony of Smt. V. V. Sumalatha Devi as President of the Telugu Film and TV Dancers and Dance Directors Association (TFTDDA)
Grand Swearing-in Ceremony of Smt. V. V. Sumalatha Devi as President of the Telugu Film and TV Dancers and Dance Directors Association (TFTDDA)
Spread the love

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ప్రెసిడెంట్‌గా ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శ్రీమతి, వి. వి. సుమలతా దేవి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రమాణ స్వీకారోత్సవాన్ని గురువారం నాడు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీశైలం యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథులు గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో..
జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ .. ‘‘ఈ యూనియన్‌కు మొట్టమొదటి సారిగా మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికవ్వడం ఆనందంగా ఉంది. సుమలత గారి విజయం యూనియన్‌కు కొత్త రూపుని తీసుకు వస్తుందని నమ్ముతున్నాను. జానీ మాస్టర్ గారు దేశ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. చిన్న స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగిన జానీ మాస్టర్ గారు, ఆయన సతీమణి సుమలత గారి మీద నమ్మకంతో వారిని ఎన్నుకున్నారు. మా ఫ్యామిలీని తమ ఫ్యామిలీగా చూసుకునే సినీ కార్మికులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను ఈ యూనియన్‌కు ఎప్పుడూ అండగా ఉంటాను” అని అన్నారు.
వి.వి. సుమలతా దేవి మాట్లాడుతూ .. ‘‘నా ఈ విజయానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ, ఓటు వేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. యూనియన్‌లో ఉన్న ప్రతీ ఒక్క సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నా” అన్నారు.
శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ .. “ఎన్నికల్లో గెలిచిన సుమలతా దేవి గారికి కంగ్రాట్స్. యూనియన్‌లో చిన్న చిన్న సమస్యలున్నాయి. వాటిని మనలో మనమే పరిష్కరించుకుందాం. బయటకు వెళ్లి కేసులు పెట్టుకోవడం వల్ల మనమే చులకన అవుతాం. మనమంతా కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం. ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రతీ ఒక్కరికీ నా శుభాకాంక్షలు” అని అన్నారు.
ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ .. ‘శ్రీశైలం యాదవ్ గారే ఈ సంస్థకు మొదటగా డబ్బులు ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆయన ముందుండేవారు. ఆయన కుమారుడు నవీన్ చాలా గొప్ప వ్యక్తి. శ్రీశైలం గారి సతీమణి ఎంతో మంది మహిళా ఆర్టిస్టులు, డ్యాన్సర్లకు ఆర్థిక సహాయం అందించేవారు. జానీని ఎంతో మంది కిందకు లాగాలని ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగారు. సుమలత విజయం ఈ యూనియన్‌కు మంచి రోజుల్ని తీసుకు వస్తుంది. మా తరపున కూడా ఈ యూనియన్‌కు అన్ని రకాల సహాయ సహకారాల్ని అందిస్తాం’ అన్నారు.
జానీ మాస్టర్ మాట్లాడుతూ .. ‘మా మీద నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మేం ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన బాడీ సహకారంతో యూనియన్ సంక్షేమం కోసం పాటు పడతాం. యూనియన్‌లోని ప్రతీ ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ విషయాన్ని రామ్ చరణ్ గారికి చెప్పిన వెంటనే ఆయన ఆర్థిక సాయం అందించారు. యూనియన్‌లోని ప్రతీ ఒక్కరికీ స్థలం వచ్చేలా చూస్తామని చెప్పిన శ్రీశైలం యాదవ్ గారికి, నవీన్ యాదవ్ గారికి ధన్యవాదాలు. మన యూనియన్ నుంచి ఓ సభ్యుడు రిటైర్ వెళ్తే.. ఆ వెళ్లే సమయంలో దాదాపు పది నుంచి పదిహేను లక్షలు ఇచ్చేలా ప్రణాళిక చేయాలని నా కోరిక. ఆ కోరిక నెరవేరాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ప్రధాన కార్యదర్శిగా కె. శ్రీనివాసరావు, కోశాధికారిగా పి. చిరంజీవి కుమార్, ఉపాధ్యక్షులుగా కె. సురేష్, యమ్. రాజు, సహ కార్యదర్శులుగా కే. కిరణ్ కుమార్, ఏ. రాము, కార్య నిర్వహక కార్యదర్శిగా యు. శివ కృష్ణ , కమిటీ సభ్యులుగా కె. సతీష్ గౌడ్, కె. శ్రీదేవి, పి. సురేష్, ఎస్. వేదాంత, మనోహర్, ఎల్. కృష్ణ, బి. సుమన్, ఆర్. బోస్, ఎస్. శృతి ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి కె.ఎల్. దామోదర్ ప్రసాద్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కమీషనర్ ఆఫ్ లేబర్ శ్యామ్ సుందర్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కోశాధికారి జి. భీముడు (శ్రీకాంత్) తదితరులు పాల్గొన్నారు.