పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ పుట్టినరోజు వేడుకలు

Director SV Krishna Reddy's 75th birthday celebrated in the presence of many film personalities
Spread the love

– 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు
– ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్న 43వ సినిమా “వేదవ్యాస్” మేకింగ్ వీడియో లాంఛ్

కుటుంబ కథా చిత్రాలతో తెలుగు తెరకు మిరుమిట్లు గొలిపే విజయాలు అందించిన దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి ప్రస్తుతం తన 43వ సినిమా “వేదవ్యాస్” రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె . అచ్చిరెడ్డి సమర్పణలో నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి తన సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పిడుగు విశ్వనాథ్ హీరోగా అరంగేట్రం చేస్తుండగా…కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ సెగ్మెంట్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. “వేదవ్యాస్” సినిమా ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ రోజు దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో పుట్టినరోజు వేడుకలతో పాటు “వేదవ్యాస్” సినిమా మేకింగ్ వీడియో లాంఛ్ చేశారు. 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు పత్రాన్ని అందజేశారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి గారు గొప్ప దర్శకులు. మంచి మనసున్న వ్యక్తి. ఆయన సకుటుంబంగా చూసే ఎన్నో అద్భుతమైన చిత్రాలు రూపొందించారు. ఆ సినిమాలన్నీ వినోదంతో పాటు సమాజానికి సందేశాన్ని కూడా చెప్పాయి. పిల్లల నుంచి పెద్దల దాకా ఎస్వీ గారి సినిమాలను ఆస్వాదించారు. నేను సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి కారణం ఎస్వీ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు. మన వేదాల గొప్పదనం, వాటి వెనక ఉన్న సైన్స్ గురించి చెబుతూ కృష్ణారెడ్డి గారు “వేదవ్యాస్” కథ సిద్ధం చేశారు. ఇలాంటి కథతో సినిమా చేస్తే నేటి సమాజానికి మంచిని చెప్పినట్లవుతుందని ఆయన నాతో అన్నారు. నేను వెంటనే మూవీ చేసేందుకు అంగీకరించాను. ఈ సినిమా కోసం నిర్మాతగా ఆయన ఏది చెబితే అది ఫాలో అయ్యాను. “వేదవ్యాస్” సినిమా షూటింగ్ పూర్తయింది. మూవీ చాలా బాగా వచ్చింది. మా సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నా. తను దర్శకత్వం వహించిన 42 చిత్రాల్లో 38 సినిమాలకు సంగీతం అందించిన రికార్డ్ ఆయనకే సొంతం. అందుకే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వారు వరల్డ్ రికార్డ్ గుర్తింపు అందజేశారు. కృష్ణారెడ్డి గారు నూరేళ్లు సంతోషంగా జీవించాలి. మరెన్నో విజయాలు సాధించాలి. ఆ ప్రయాణంలో మేమూ ఉండాలని కోరుకుంటున్నాం. అన్నారు.
సీనియర్ నటులు మురళీమోహన్ మాట్లాడుతూ – ఈ రోజు ఈ కార్యక్రమంలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఎస్వీ కృష్ణారెడ్డి గారు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. వంద చిత్రాలకు దర్శకత్వం వహించాలి. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి స్నేహం ఇలాగే చిరకాలం కొనసాగాలి. మన వేదాలు, సంస్కృతి గొప్పదనం చెబుతూ కృష్ణారెడ్డి వేదవ్యాస్ సినిమాను రూపొందించడం అభినందనీయం. ఈ సినిమాతో టాలీవుడ్ కు వస్తున్న నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి గారికి స్వాగతం చెబుతున్నాం. కృష్ణారెడ్డి గారు దర్శకుడిగా వంద చిత్రాలు పూర్తి చేయాలి. అన్నారు.
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి వంటి గొప్ప వాళ్లు ఉండటం వల్లే మన ఇండస్ట్రీ గొప్ప పేరు తెచ్చుకుంది. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది అతిథులు హాజరవడం సంతోషంగా ఉంది. కృష్ణారెడ్డి గారు ఎన్నో గొప్ప ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రూపొందించారు. ఈ రోజు ఇండస్ట్రీకి ఒక దిక్సూచి కావాలి. అలాంటి దిక్సూచిగా ఎస్వీ గారు నిలవాలి. ఆయన ఇంకా మరిన్ని అద్భుతమైన సినిమాలు రూపొందించి తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగం కావాలి, ప్రేక్షకుల్ని అలరించాలి. అన్నారు.
దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ – నేను విజయా సంస్థలో పనిచేశాను. అక్కడ నాగిరెడ్డి చక్రపాణి అనుబంధం చూసినవాడిని. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిని చూస్తుంటే వాళ్లే గుర్తుకువస్తారు. ఈరోజున వస్తున్న సినిమాలు, వాటి టైటిల్స్ చూస్తుంటే ఒకప్పుడు కృష్ణారెడ్డి గారు గొప్ప ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో స్వర్ణయుగం సృష్టించారు అనిపిస్తోంది. ఈ రోజు వారి పుట్టినరోజు కార్యక్రమం చూస్తుంటే మళ్లీ ఆ స్వర్ణయుగం వచ్చిందని అనిపిస్తోంది. మన రామాయణం, మహాభారతం, వేదాలు..చాలా గొప్పవి. మన సంస్కృతిలోని గొప్పదనం చాటేలా వేదవ్యాస్ సినిమాను రూపొందిస్తున్న ఎస్వీకి, ఈ సినిమాను నిర్మిస్తున్న ప్రతాపరెడ్డి గారికి అభినందనలు. అన్నారు.
నిర్మాత దామోదరప్రసాద్ మాట్లాడుతూ – కంటెంట్ ను నమ్మి సినిమాలు రూపొందించి చిత్ర పరిశ్రమకు ఘన విజయాలు అందించిన దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి గారు. అప్పటికి కమెడియన్ గా ఉన్న అలీతో యమలీల వంటి బ్లాక్ బస్టర్ చేశారంటే కంటెంట్ నమ్మడం వల్లే సాధ్యమైంది. ఆయన మళ్లీ తనదైన తరహాలో సినిమాలు రూపొందించేందుకు ముందుకొచ్చారు. ఎస్వీ గారు చేస్తున్న వేదవ్యాస్ సినిమా పెద్ద విజయం సాధించాలి. అన్నారు.
నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ – ప్రతి ఒక్కరిలో పాజిటివ్ మాత్రమే చూసే వ్యక్తి కృష్ణారెడ్డి గారు. అందుకే ఆయనకు అంతా మంచి జరుగుతుంది. ఎస్వీ లాంటి గొప్ప దర్శకుల అవసరం ఇప్పుడు ఇండస్ట్రీకి ఉంది. నిర్మాతలం క్యాషియర్స్ అయ్యాం. మన సినిమా పాన్ ఇండియా స్థాయికి వెళ్లినా అయోమయ స్థితి నెలకొంది. ఎస్వీ గారు ఇప్పటిదాకా ఎన్ని చిత్రాలు చేశారో, మళ్లీ అంత కెరీర్ ఆయనకు ఉండాలి. టాలీవుడ్ కు ఒక దిక్సూచిలా నిలవాలి. అన్నారు.
నటి లయ మాట్లాడుతూ – ఇళయరాజా గారి మ్యూజిక్ కు ఎలా అభిమానులు ఉంటారో, ఎస్వీ కృష్ణారెడ్డి గారి పాటలకు కూడా అలాగే సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. నేనూ ఆయన సంగీతానికి అభిమానిని. ఎస్వీ గారి దర్శకత్వంలో రెండు చిత్రాల్లో నటించాను. మరిన్ని మూవీస్ చేస్తే బాగుండును అని అనిపిస్తుంటుంది. ఎస్వీ గారికి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నారు.
నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ – ఎస్వీ గారి దర్శకత్వంలో ఎక్కువ చిత్రాల్లో హీరోగా నటించే అదృష్టం నాకే దక్కింది. ఆయన 75వ పుట్టిరోజు వేడుకుల్లో మేమంతా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. కృష్ణారెడ్డి గారు ప్రస్తుతం వేదవ్యాస్ అనే సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఎస్వీ గారు మరెన్నో చిత్రాలను రూపొందించాలి. అన్నారు.
నటుడు జేడీ చక్రవర్తి మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన గొప్ప కథకుడు. ఆయన కథ చెప్పే విధానం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సరదాగా మనం ఏదైనా పాయింట్ మీద కథ చెప్పమన్నా అద్భుతంగా చెబుతారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నా. అన్నారు.
నటుడు అలీ మాట్లాడుతూ – జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి హీరో దాకా ఒకేలా గౌరవించే గొప్ప మనసున్న వ్యక్తి ఎస్వీ గారు. ఆయన చీమకు కూడా హాని చేయరు. 42 చిత్రాల్లో 38 సినిమాలకు సంగీతం అందించడం మామూలు విషయం కాదు. ఆయనతో మా అందరిదీ 35 ఏళ్ల జర్నీ. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేమంతా చిన్నపిల్లలయ్యాం. ఆయన వందో పుట్టినరోజు కూడా మేమంతా హాజరవ్వాలి. కృష్ణారెడ్డి గారి వేదవ్యాస్ సినిమా ఘన విజయం సాధించాలి. అన్నారు.
నటుడు శివాజీరాజా మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో దాదాపు 20 చిత్రాల్లో నటించాను. మా ఇంటి నిండా ఆ సినిమాల షీల్డులే ఉన్నాయి. కృష్ణారెడ్డి గారి మాతో చేయించిన క్యారెక్టర్స్ వేటిలోనూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. మా ముఖాలపై సెన్సార్ కత్తెర పడలేదు. అంత గొప్ప దర్శకులు ఎస్వీ గారు. ఆయన మరెన్నో సినిమాలు చేయాలి. వాటిలో మేమంతా నటించాలని కోరుకుంటున్నాం. అన్నారు.
వేదవ్యాస్ మూవీ హీరో పిడుగు విశ్వనాథ్ మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి గారి లాంటి లెజెండరీ డైరెక్టర్ చేతుల మీదుగా నేను హీరోగా లాంఛ్ కావడం నా అదృష్టం. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఇలాంటి బర్త్ డే లు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా. అన్నారు.
దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ – ఇంతమంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులు అతిథులుగా వచ్చారు కాబట్టే ఈరోజు నా పుట్టినరోజు కార్యక్రమం ఇంత ఘనంగా జరుపుకున్నాం. నా పుట్టినరోజున నా మ్యూజిక్ కు ఒక రికార్డ్ దక్కింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వారి నుంచి మెమొంటో అందుకున్నాను. ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి. మీరంతా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. నా రాబోయో వేదవ్యాస్ సినిమాను కూడా సక్సెస్ చేస్తారు. మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.
నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ – ఎందరో ఆత్మీయుల మధ్య కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు, వేదవ్యాస్ మేకింగ్ వీడియో లాంఛ్, ఎస్వీ గారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరుపుకున్నాం. మా ఈ 43 చిత్రాల జర్నీలో నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, ఇతర మిత్రులు సహకరించడం వల్లే మేము ఇక్కడి వరకు రాగలిగాం. ఈ వేడుక ఇంత ఘనంగా జరుపుకోగలిగాం. ఈరోజు కార్యక్రమాన్ని జర్నలిస్ట్ ప్రభు, శివ మల్లాల బాగా డిజైన్ చేశారు. దాదాపు 10 రోజులుగా వారి టీమ్స్ ఈ కార్యక్రమం సక్సెస్ చేసేందుకు శ్రమించారు. అందుకే ఇంత బ్యూటిఫుల్ గా ఈవెంట్ జరుపుకోగలిగాం. మిత్రుడు ఉమాపతిరాజు ఆయన సోదరుడు శ్రీహరిరాజు ఎస్వీని నన్ను ప్రశంసిస్తూ పాటలు రూపొందించారు. వారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. మేము ఇంత కాన్ఫిడెంట్ గా జోష్ తో పనిచేయడానికి కారణం, మాకు బ్యాక్ బోన్ లా నిలిచింది ప్రొడ్యూసర్ కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు. ప్రతాపరెడ్డి గారు కృష్ణారెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, అభిమానం, నమ్మకంతో వేదవ్యాస్ సినిమాను రూపొందించేందుకు సంపూర్ణమైన స్వేచ్ఛ, సహకారం, ప్రోత్సాహం ఇచ్చారు. ఆ సహకారంతోనే ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం. వేదవ్యాస్ సినిమా మా అందరికీ కమ్ బ్యాక్ మూవీ అవుతుంది. కృష్ణారెడ్డి గారి పవర్, ఆయన ఆలోచనా ధోరణి ఏంటి అనేది ప్రేక్షకులు తెలియజేయాలి అనే తపనతో గత నాలుగైదు ఏళ్లుగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ వచ్చాం. వేదవ్యాస్ స్క్రిప్ట్ విషయంలో పరుచూరి గోపాలకృష్ణగారు, సత్యానంద్ గారు, మరెంతోమంది తమ సహకారం, ప్రోత్సాహం అందించారు. ఇలాంటి స్క్రిప్ట్ ను ఒక దృశ్యకావ్యంగా ప్రేక్షకులకు అందించాలంటే సమర్థవంతమైన, నమ్మకమైన, శక్తిమంతమైన ప్రొడ్యూసర్ కావాలి. ఆ నిర్మాత భగవంతుడు పంపినట్లు మా కొమ్మూరి ప్రతాపరెడ్డి గారి రూపంలో వచ్చారు. ఈ రోజు మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది కాబట్టి నమ్మకంగా చెబుతున్నాం. కృష్ణారెడ్డి గారు తన మనసులో అనుకున్న విజన్ ను ఈ రోజు సినిమాలో మేము చూడగలిగాం. గ్రాఫిక్స్ చాలా పనిచెప్పే కంటెంట్ మా మూవీలో ఉంది. ఫాంటమ్ కంపెనీ నుంచి మంచి సీజీ టీమ్ మా మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. మా డీవోపీ శరత్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, నృత్య దర్శకురాలు సుచిత్ర, ఫైట్ మాస్టర్ పృథ్వీ, అంజి మాస్టర్ అద్భుతంగా వర్క్ చేశారు. ఎంతోమంది సాంకేతిక నిపుణులు తమ సహకారం అందించారు. వీళ్లందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ రోజు మా ఈవెంట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మీరంతా రావడం వల్లే ఒక ఫ్యామిలీ వాతావరణం ఈ కార్యక్రమంలో ఏర్పడింది. అన్నారు.
నటీనటులు – పిడుగు విశ్వనాథ్, జూన్ హ్యూంజీ, షరన్ బోల్డ్ సెగ్మెంట్, సాయికుమార్, సుమన్, బాబు మోహన్, శివాజీ రాజా, అలీ, ఉత్తేజ్ , రఘు బాబు అజయ్ ఘోష్ , ఐమాక్స్ వెంకట్, విద్యులేఖ, రాజేశ్వరి నాయర్
టెక్నికల్ టీమ్:
————
పాటలు: భువనచంద్ర , వెనిగళ్ళ రాంబాబు
కెమెరా : శరత్
కొరియోగ్రఫీ: సుచిత్ర
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనింగ్ : బ్రహ్మ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:ఫణి శ్రీనివాస రెడ్డి మేడపాటి
పీఆర్ఓ – జర్నలిస్ట్ ప్రభు
సమర్పణ : కె అచ్చిరెడ్డి
నిర్మాత కొమ్మూరి : ప్రతాపరెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వం – ఎస్వీ కృష్ణారెడ్డి

Related posts